62,695 వేల పట్టభద్రులు.. 4,911 టీచర్ ఓటర్లు

  • ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా విడుదల 
  • డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ  
  • కొత్త ఓటరు నమోదుకు సైతం అవకాశం
  • షెడ్యుల్ కోసం ఆశావహుల ఎదురుచూపు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పరిధిలోని టీచర్, పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 2025 మార్చితో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2021 అక్టోబర్ 30 వరకు డిగ్రీ పూర్తి చేసిన పట్ట భద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

 ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు శనివారం ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అయితే చాలా మంది అవగాహన లే‌కపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఓటు హక్కు నమోదుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం 62,695 మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇంకా వేలల్లో పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటు నమోదుకు ఆసక్తి చూపలేదు. డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుండగా.. పట్ట భద్రులు, టీచర్లకు ఓటు నమోదుకు మరో అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 25 లోగా అభ్యంతరాలను పూర్తిచేసి, అదే నెల 30న తుది జాబితా విడుదల చేయనున్నారు. 

10 వేల మంది టీచర్లున్నా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటివరకు కేవలం 4,911 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తే టీచర్లు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా ఓటర్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు.పట్టభద్రులు, టీచర్ల ఓటు నమోదుపై స్వయంగా అభ్యర్థులు అవగాహన కల్పించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత క్రమంలో జరుగనున్నందున పోలైన ఓట్లన్నీ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. 

పోటీ రసవత్తరం..

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ఎట్టకేలకు విడుదల కావడంతో ఇక ఎన్నిలకు సంబంధించి షెడ్యుల్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి రేకేత్తిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన పార్టీలకు చెందిన నేతలే కాకుండా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, కొంత మంది విద్యాసంస్థల అధిపథులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 అయితే టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాజకీయ పార్టీ సింబల్ లేకుండా జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలు మాత్రం తమ మద్దతు దారులనే బరిలోకి దింపుతుంటాయి. ప్రస్తుతం నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అటు బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేల బలం ఉండటంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ సైతం బలమైన మద్దతు దారులను బరిలో ఉంచేందుకు కసరత్తు చేస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 

జిల్లా     పట్ట భద్రులు    టీచర్లు 
మంచిర్యాల        28,113    1405

నిర్మల్                15,947    1686
ఆదిలాబాద్        13,402    1401
ఆసిఫాబాద్         5,233    419