పర్మిషన్ లేకుండానే..ఒకేషనల్ కాలేజీలు!

  •     నడిగడ్డలో -ఫేక్  డాక్యుమెంట్లు, లీజ్  డీడీలతో బురిడీ
  •     అక్రమార్కులకు సపోర్ట్  చేస్తున్న ఆఫీసర్లు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో పర్మిషన్  లేకుండానే ఒకేషనల్  కాలేజీలు(వృత్తి విద్య కాలేజీలు) వెలుస్తున్నాయి. పర్మిషన్  రాకముందే కాలేజీల ముందు బోర్డులు ఏర్పాటు చేసి అడ్మిషన్లు తీసుకొని స్టూడెంట్లను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో మూసేసిన కాలేజీలకు ఫేక్  అగ్రిమెంట్  లీజ్  డీడీల డాక్యుమెంట్లతో ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

రూల్స్ కు విరుద్ధంగా ఫ్యాకల్టీలు లేకుండా నడిపిస్తూ రెండు కాలేజీల యాజమాన్యాలు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్టూడెంట్లు వాపోతున్నారు. స్టూడెంట్లు కాలేజీకి రాకున్నా డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ జిల్లా ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఫేక్  డాక్యుమెంట్లతో..

ప్రస్తుతం ఒకేషనల్  కాలేజీలకు డిమాండ్  పెరగడంతో ఎప్పుడో మూతపడ్డ కాలేజీలను సైతం ఇప్పుడు ఓపెన్  చేస్తున్నారు. 2010–11లో పీజే ఒకేషనల్  జూనియర్  కాలేజీని ఎంఎల్టీ, ఎంపీహెచ్ డబ్ల్యూ(ఎఫ్) కోర్సులతో ఓపెన్  చేశారు. దానిని 2013–14లో క్లోజ్​ చేశారు. ఇప్పుడు అదే కాలేజీని మళ్లీ రీ స్టార్ట్  చేసేందుకు ఫేక్  డాక్యుమెంట్లు సబ్​మిట్  చేయడం చర్చనీయాంశంగా మారింది. డాక్యుమెంట్  నెంబర్ 5214/2024 పేరుతో బిల్డింగ్  దస్తావేజును మే 15న రిజిస్టర్  చేశారు. ఒరిజినల్  డాక్యుమెంట్​లో బిల్డింగ్ ఓనర్ తో ముగ్గురు వ్యక్తులు అగ్రిమెంట్  చేసుకున్నట్లు ఉంది. 

ఇంటర్  బోర్డు వారికి సమర్పించిన డాక్యుమెంట్​లో మాత్రం ఒకే వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నట్లు చూపించి బురిడీ కొట్టించారు. ఒకేషనల్  కాలేజీని మూసివేసే సమయంలో ఎవరి పేరుపై బిల్డింగ్  డాక్యుమెంట్లు ఉంటాయో, వారికే మళ్లీ రీ ఓపెన్ కు అవకాశం ఉంటుంది. కానీ, వేరే వ్యక్తులు అగ్రిమెంట్  చేసుకుని పాత ఒకేషనల్  కాలేజీని ఓపెన్  చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి జిల్లా ఆఫీసర్లు సపోర్ట్  చేస్తున్నారనే విమర్శలున్నాయి. రిజిస్ట్రార్  ఆఫీస్ లో ఒకే డాక్యుమెంట్ తో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని రెండు కాలేజీల్లో ఇలాగే ఫేక్  డాక్యుమెంట్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ఫేక్​ సర్టిఫికెట్​ దందా..

మెడికల్  కాలేజీతో పాటు గవర్నమెంట్  హాస్పిటళ్లలో పని చేసేందుకు ఒకేషనల్  కాలేజీల్లో చదివినట్లు టెక్నికల్  సర్టిఫికెట్లు ఉండాలి. ఈ సర్టిఫికెట్​ ఉంటేనే వారికి ఔట్​ సోర్సింగ్, పర్మినెంట్​ జాబ్​ వస్తుంది. దీంతో జిల్లాలోని కొన్ని కాలేజీలు అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకేషనల్  కాలేజీలతో లాభాలు ఉండడంతో స్కూల్స్, కాలేజీలు ఉన్నవారు ఒకేషనల్  కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

పర్మిషన్  రాకముందే..

అయిజలో ఏర్పాటు చేసిన ఒకేషనల్  కాలేజీకి పర్మిషన్  రాక ముందే బోర్డులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. పాత కాలేజీ పేరు పీజే ఒకేషనల్  కోర్సు కాలేజీ అని ఉండగా, డాక్యుమెంట్ లో మాత్రం సన్ రైజ్  ఎడ్యుకేషనల్  సొసైటీ, విజేత ఒకేషనల్  జూనియర్  కాలేజీ అని మార్చడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి కాలేజీల్లో చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పలువురు విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. 

కాలేజీకి పర్మిషన్  రాకపోతే విద్యార్థులు నష్టపోతారని చెబుతున్నారు. గద్వాల జిల్లాలో 6 ఒకేషనల్  జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో రెండు గవర్నమెంట్  జూనియర్  కాలేజీలు మినహా.. మిగిలినవి ప్రైవేట్​ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్యాకల్టీ లేకపోవడం, క్లాస్​ రూమ్స్​ చిన్నవిగా ఉండడం, ల్యాబ్  లేకపోవడం, రెగ్యులర్ గా క్లాసెస్  జరగకపోవడంతో విద్యార్థుల్లో స్కిల్స్ లేకుండా పోతున్నాయని అంటున్నారు.

ఇబ్బందులు లేకుండా చూస్తాం..

ఒకేషనల్  కాలేజీల్లో చదివే వారికి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఫేక్  డాక్యుమెంట్  వచ్చిన విషయంపై ఎంక్వైరీ చేస్తాం. పర్మిషన్  రాకుండానే బోర్డులు ఏర్పాటు చేయడం సరైంది కాదు. వారిపై చర్యలు తీసుకుంటాం. 
-  హృదయ రాజ్, నోడల్  ఆఫీసర్