ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నం: వివేక్ వెంకటస్వామి

  • చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో పనులు: వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి
  • ప్రజలకు ఏడాదిలోపు అభివృద్ధి ఫలాలు అందుతాయని వెల్లడి
  • గత ప్రభుత్వం కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపాటు
  • మందమర్రిలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోల్​బెల్ట్/జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ధర్మారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఈ ప్రగతి ఫలాలు ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో రూ.2.80 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో 27 అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదేండ్ల పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. అప్పటి పాలకులు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానని చెప్పారు. మందమర్రి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టానని తెలిపారు. ఊరుమందమర్రి గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర సమస్యల పరిష్కారానికి రూ.62 లక్షలు కేటాయించానని వెల్లడించారు. చెన్నూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో క్వాలిటీని విస్మరించొద్దని, తరుచూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను వివేక్ ఆదేశించారు. 

చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కారించేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఊరు మందమర్రి, అందుగులపేట, పులిమడుగు గ్రామశివారులోని పెద్దవాగుపై మూడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం కోసం త్వరలోనే ఫండ్స్ సాంక్షన్ అవుతాయని చెప్పారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, పదేండ్లలో ప్రజల కనీస సౌలత్‌‌‌‌‌‌‌‌ల గురించి అప్పటి పాలకులు పట్టించుకోలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇక్కడి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా పాలనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు..

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)​లోని గెస్ట్ హౌస్‌‌‌‌‌‌‌‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌‌‌‌‌తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో వివేక్ వెంకటస్వామి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలోని పెండింగ్ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధమైన తాగు నీటిని అందించడంతో పాటు పైపులైన్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలాప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వంగిన, విరిగిన స్థంబాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్థంబాలు ఏర్పాటు చేయాలని, తెగిన, ప్రమాదకరంగా వేలాడే కరెంట్‌‌‌‌‌‌‌‌ తీగలను సరి చేయాలని విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం, ఆసుపత్రులలో పారిశుధ్యం నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. 

విద్యార్థులు పరిశోధన సామర్థ్యం పెంచుకోవాలి: వంశీకృష్ణ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. అవకాశాలను సృష్టించుకొని దేశానికి కొత్త ఆవిష్కరణలు అందజేయాలన్నారు. శనివారం ధర్మారం మండలం మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విశాక ట్రస్ట్ ద్వారా కోఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాలకు వంశీకృష్ణ 50 బెంచీలు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్ దేవసేన, సిబ్బంది, విద్యార్థులు వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికారు. తర్వాత స్కూల్‌‌‌‌‌‌‌‌ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి, నివాళులర్పించారు. 

అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చదువులో ఎక్కువ శ్రద్ధ కనబర్చలేదని, అయితే తన తాత వెంకటస్వామి జీవితాన్ని దగ్గర్నుండి చూసిన తర్వాత ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. తన కంపెనీ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసి పేటెంట్ హక్కులు కూడా పొందానని తెలిపారు. విద్యార్థులు ఎవరూ తమను తాము తక్కువగా భావించవద్దని, బాగా చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు, మంచి పేరు తేవాలన్నారు. తాత వెంకటస్వామి నెలకొల్పిన విశాక ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా తన తండ్రి వివేక్ వెంకటస్వామి, తాను కలిసి మరిన్ని సేవా కార్య్రమాలు చేస్తూ తాత స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. స్కూల్‌‌‌‌‌‌‌‌కు ఒక బోర్ వెల్ అవసరముందని ప్రిన్సిపాల్ దేవసేన కోరగా.. వెంటనే ఏర్పాటు చేయిస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.