ఉమ్మడి ఆదిలాబాద్ పేరు చెప్తే చాలు.. ప్రకృతి అందాలు, సహజ సంపద, అడవులు, జలపాతాలు గుర్తొస్తాయి. వాటితో పాటు ఒక అద్భుతమైన ఘాట్ రోడ్డు కూడా ఉంది. ఈ రోడ్డుని చూసేందుకు నిత్యం విజిటర్స్ వస్తుంటారు. దీనికి ఏకంగా 16 మూలమలుపులు ఉన్నాయి.
ఆసిఫాబాద్ ఉట్నూర్ మార్గంలో కెరమెరి ఘాట్ రోడ్డు ఉంది. ఇది జిల్లాలోనే అతి పురాతనమైన మార్గం. కెరమెరి మండలానికి దగ్గర్లో 6 కిలోమీటర్ల పొడవున ఈ ఘాట్ ఉంది. కెరమెరి ఘాట్ మధ్యలో ఎత్తయిన గుట్ట ప్రాంతంలో ఓ వాచ్ టవర్ ఉంది. ఘాట్ అందాలు చూసేందుకు వచ్చిన వాళ్లు ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన అడవి, వన్యప్రాణులు ఉండటంతో అటవీశాఖ అధికారులు వాచ్ టవర్ కట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు తగ్గిపోవడంతో ప్రకృతి అందాలను చూసేందుకు వాడుతున్నారు.
చెచ్చెర జలపాతం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం కౌఠగామ్ గ్రామ సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో చెచ్చెర జలపాతం ఉంది. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని కొండల మధ్య 200 అడుగుల ఎత్తు నుంచి కిందకి సెలయేరు పడుతుంటుంది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే.. ఎనిమిది కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లాలి.
ఇలా చేరుకోవాలి
చెచ్చెర జలపాతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆసిఫాబాద్ నుండి గండిపేట గ్రామం వరకు రోడ్డు జర్నీ చేయాలి. గండిపేట నుండి కాలినడకన అటవీ ప్రాంతం గుండా చెచ్చెర జలపాతానికి చేరుకోవచ్చు. ఈ దారిలో శ్రీ సంగమేశ్వర ఆలయం కూడా ఉంది.
మాసాడె సంతోష్‌కుమార్, ఆసిఫాబాద్