త్రివేండ్రంకి చెందిన ఏడేండ్ల విశ్వజిత్.. గిన్నిస్ రికార్డ్‌కి ఎక్కాడు. ఇంత చిన్న వయసులో ఏం చేశాడా? అనుకుంటున్నారా.. విశ్వజిత్కి చిన్నప్పటి నుంచి డైనోసార్ బొమ్మలంటే ఇష్టం. వాటితో ఆడుకోవడమే కాకుండా తన దగ్గర ఉన్న అనేక రకాల డైనోసార్ల సైంటిఫిక్ నేమ్స్ తెలుసుకునే వాడు. అలా శాస్త్రీయ నామాలు (సైంటిఫిక్ నేమ్స్)తో వాటిని గుర్తుపెట్టుకోవడం అలవాటైపోయింది. ఒక నిమిషంలో 41 డైనోసార్ల శాస్త్రీయ నామాలను అవలీలగా చెప్తాడు. ‘నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ జురాసిక్ పార్క్ చూసినప్పటి నుంచి డైనోసార్లంటే ఇష్టం ఇంకా పెరిగింది’ అంటాడు విశ్వజిత్.
విశ్వజిత్ అమ్మానాన్న సింధు, విశ్వరాజ్ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్లు కొడుక్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటాన్ని గమనించారు. ఆ పిల్లవాడిని ప్రోత్సహించారు. జురాసిక్ పార్క్ సినిమా చూసినప్పటి నుంచి విశ్వజిత్కి ఉన్న ఇంట్రెస్ట్ గమనించి డైనోసార్లు కొనివ్వడం మొదలుపెట్టారు. డైనోసార్ బొమ్మలతో ఆడుకోవడం కంటే ముందు వాటి సైంటిఫిక్ నేమ్స్ అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు విశ్వజిత్ దగ్గర ఎన్నో డైనోసార్బొమ్మలతో పాటు పుస్తకాలు కూడా ఉన్నాయి.
డ్రాయింగ్ కూడా..
మూడేండ్ల వయసు నుంచే విశ్వజిత్‌కు డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం. డైనోసార్ బొమ్మలతో మరికొన్ని జంతువుల బొమ్మలుగీసేవాడు. బ్లాక్ స్కెచ్ పెన్, కలర్ పెన్సిల్‌తో 30 నిమిషాలు ఆపకుండా డ్రాయింగ్ వేశాడు. అంతేకాదు తన ఊహతో క్రియేటివ్‌గా 23 సముద్ర వాతావరణాలను గీశాడు. కలరింగ్ కాంపిటీషన్స్‌లో కేరళలో జరిగిన కల్చరల్ ఫెస్టివల్లో సెకండ్ ప్రైజ్ గెలిచాడు.
విశ్వజిత్ టాలెంట్‌కి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి. వాటితోపాటు సూపర్ టాలెంటెడ్ కిడ్ వన్ ఇన్ ఎ మిలియన్ అవార్డ్, కలామ్ వరల్డ్ రికార్డ్‌లు కూడా వరించాయి.