ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో జ్వరాల భయం

  • హై రిస్క్​ లిస్ట్​లో పాలమూరు, వనపర్తి
  • వనపర్తి, మహబూబ్​నగర్​లో   36కు పైగా చికున్​ గున్యా కేసులు
  • వివరాలు వెల్లడించిన రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు

మహబూబ్​నగర్​, వెలుగు :సీజనల్​ వ్యాధులతో ఉమ్మడి పాలమూరు జిల్లా వణికిపోతోంది.  రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.  గ్రామాల్లో పారిశుధ్యం సరిగా   లేకపోవడంతో దోమలు ఎక్కువై డెంగ్యూ, చికున్​ గున్యా   కేసులు  పెరుగుతున్నాయి. ఇటీవల హెల్త్​ డిపార్ట్​మెంట్​ రిలీజ్​ చేసిన బులిటెన్​లోనూ పాలమూరు, వనపర్తి జిల్లా  హై రిస్క్​ జిల్లాలో జాబితాలో ఉన్నాయి.

చికున్​ గున్యా కేసుల్లో టాప్​

ఐదు రోజుల కిందట రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు డెంగ్యూ, చికున్​ గున్యా, మలేరియా కేసుల వివరాలను వెల్లడించింది.   చికున్​ గున్యా డిసీజ్​కు సంబంధించి రాష్ర్ట వ్యాప్తంగా 2,673 మందికి పరీక్షలు చేయగా..   152 మందికి పాజిటివ్​ వచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. ఎక్కువగా హైదరాబాద్​లో 61 కేసులు ఉండగా మహబూబ్​నగర్​లో 19, వనపర్తిలో 17 కేసులు బయట పడ్డాయి. ఈ మూడు జిల్లాలను రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ హై రిస్క్​ జిల్లాల జాబితాలోకి చేర్చింది. 

250 వరకు డెంగ్యూ కేసులు..

పాలమూరు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో డెంగ్యూ బాధితులతో హాస్పిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రతి రోజూ సర్కారు హాస్పిటళ్లలో ఔట్​ పేషంట్లు (ఓపీ) 1,700లకు దాటిపోతుండగా.. ఇన్​ పేషంట్లు (ఐపీ) 320 వరకు ఉంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం.. మహబూబ్​నగర్​ జిల్లాలో ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటి 131 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. 

ఇందులో  49 మంది చిన్నపిల్లలకు  డెంగ్యూ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 72 మందికి, నారాయణపేటలో జిల్లాలో 22 మంది పాజిటివ్​ అని తేలింది. సర్కారు హాస్పిటల్స్​లో కాకుండా ప్రైవేట్​ హాస్పిటల్స్​లో డెంగ్యూ బాధితులు చేరుతున్నారు. ఒక్కో హాస్పిటల్​లో 50 నుంచి 80 వరకు ఓపీ వస్తుండగా.. ఇందులో 20 మందిని ఇన్​ పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. అయితే.. కేసుల వివరాలను చెప్పేందుకు వైద, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. కొద్ది రోజులుగా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఆ డేటాను చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.

ALSO READ : భూములు ఇచ్చేదేలే .. జీవనాధారం కోల్పోతామని రైతుల ఆందోళన

మూడు రోజులకు రూ.10 వేల బిల్

డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రైవేట్​ హాస్పిటళ్ల యాజమాన్యాలు దోపిడి చేస్తున్నాయి.   సాధారణ జ్వరంతో ప్రజలు హాస్పిటల్స్​కు వస్తున్నా.. మలేరియా, టైఫాయిడ్​, డెంగ్యూ టెస్టులు రాసి డబ్బులు గుంజుతున్నారు. వైరల్​ ఫీవర్​, మలేరియా పాజిటివ్​ వస్తే అడ్మిట్​ చేయించుకొని.. మూడు రోజులకు రూ.10 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. ఇవి కాకుండా మెడిసిన్​కు అదనంగా డబ్బులు  వసూల్​ చేయడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. 

దోమల నివారణకు చర్యలేవీ

దోమల నివారణకు ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ విజయేందిర బోయి ప్రతి మున్సిపాల్టీలో దోమల నివారణకు ఫాగింగ్​ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంత వరకు మున్సిపల్​ సిబ్బంది ఫాగింగ్​ చేయడం లేదు. వర్షాల వల్ల కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉంటున్నా.. బ్లీచింగ్​ పౌడర్​ చల్లడం లేదు. 

గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కొందరు ప్రత్యేక అధికారులు వారంలో ఒకసారే గ్రామ పంచాయతీలను విజిట్​ చేస్తుండటంతో పర్యవేక్షణ కరువైంది. వ్యాధుల సీజన్​ కావడంతో ప్రతి గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్​ చేయాల్సి ఉంది. కానీ, చాలా పంచాయతీల్లో ఈ మెషీన్​లు పని చేయడం లేదు. అవి మూలకు చేరడంతో ఫాగింగ్​ చేయడం లేదు. దీంతో దోమల బెడద ఎక్కువైంది. అదే సమయంలో డెంగ్యూ, చికెన్​ గున్యా, వైరల్​ ఫీవర్​ కేసులు కూడా అధికమయ్యాయి.