హాస్పిటళ్లకు జ్వర బాధితుల తాకిడి

  •      ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్ లో 42 డెంగ్యూ కేసులు 
  •      జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ పెరుగుతున్న జ్వరం కేసులు 
  •      జిల్లా హాస్పిటళ్లలో  పెరిగిన ఓపీ 
  •      హాస్పిటళ్లలో మందుల కొరత 

కరీంనగర్/రాజన్నసిరిసిల్ల/ జగిత్యాల/  పెద్దపల్లి, వెలుగు : వరుసగా ముసురు పట్టడంతో ఉమ్మడి జిల్లాలో వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులు  విజృంభిస్తున్నాయి. ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, డయేరియాతో  ఇబ్బందిపడుతున్నారు.  చల్లని వాతావరణంలో చిన్నారులు అస్వస్థతకు గురువుతున్నారు. దీంతో మండలాల్లోని పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల నుంచి జిల్లా హాస్పిటళ్ల దాకా పేషంట్ల తాకిడి పెరిగింది. గతంతో పోలిస్తే గత వారం రోజులుగా రెట్టింపు స్థాయిలో ఫీవర్ బాధితులు వస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఈ సీజన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 42 డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

ఓపీకి పెరిగిన తాకిడి.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ వెయ్యి మంది వరకు ఓపీకి వస్తున్నారు. ఈ నెల 22న 1210 మంది రాగా, 23న 918 మంది,24న 657 మంది, 25న 706 మంది పేషెంట్లు ఓపీలో చూపించుకున్నారు.  జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వారం రోజులుగా  వెయ్యికి పైగా ఓపీ వస్తోంది. ఇందులో 300 పైగా ఫీవర్ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అలాగే కోరుట్ల, మెట్ పల్లి సీహెచ్ సీలు, ఇతర పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లోనూ ఓపీ సంఖ్య  పెరుగుతోంది. జగిత్యాల జిల్లా హాస్పిటల్ లో 30 మందికి పైగా వైరల్ ఫీవర్ తో అడ్మిట్ అయ్యారు. పెద్దపల్లి సివిల్ హాస్పిటల్ లో నాలుగు రోజులుగా ఓపీ 300 నుంచి 350 వరకు ఉంటుంది.

అందులో 90 నుంచి 100 వరకు ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి  రోజూ వెయ్యికిపైగా, సిరిసిల్ల ఆస్పత్రికి 900 మంది వరకు పేషెంట్లు వస్తున్నారు. ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.  సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఒకేరోజు 865 ఓపీకి రాగావారిలో 553 మంది వైరల్ ఫీవర్ తో, 312 మంది డయేరియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 

ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లకు క్యూ 

ప్రభుత్వ హాస్పిటళ్లలో జ్వరం, ఇతర సీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోగుల సంఖ్య పెరగడంతో చాలామంది ప్రైవేట్​బాటపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల హాస్పిటళ్లలో జనం క్యూ కడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లోని చిన్న ప్రైవేట్ ఆసుపత్రులు సైతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లు దోపిడీ తెరతీశాయి. 

ఫీవర్ కేసులు పెరిగాయి.. 

 కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఇప్పటి వరకు మొత్తం 42  డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు 700 నుంచి 1200  వరకు కేసులు నమోదవుతుండగా, అందులో 100 వరకు ఫీవర్ కేసులే ఉంటున్నాయి. ఫీవర్ పేషెంట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నందున, గతంలో ఉండే 4  ఓపీలకు బదులు 6 ఓపీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బెడ్స్ తో పాటు అదనంగా 2 గదులను పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచాం.పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా డాక్టర్లతో పాటు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాం.

- డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, కరీంనగర్ జనరల్ హాస్పిటల్