జగిత్యాల జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు

  • వైరల్ ఫీవర్ తో ఒక్క రోజు ఇద్దరు మృతి
  •  జగిత్యాల జిల్లాలో 227 డెంగీ పాజిటివ్ కేసులు 
  •  నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
  •  తనిఖీలు చేస్తూ నోటీసులు ఇస్తున్న స్పెషల్ టీంలు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి.  ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే చాలు మిగతా కుటుంబ సభ్యులూ మంచం పడుతున్నారు.  ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో 227 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ప్రకటించారు. సోమవారం ఒకే రోజు ఇద్దరు డెంగ్యూతో మృతిచెందడం కలకలం రేపుతోంది. గవర్నమెంట్ ఆసుపత్రులతో పాటు, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారీతిన బిల్స్ వేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.  

ఆర్ఎంపీ, పీఎంపీ..

కొంతమంది జ్వర పీడితులు  సమీపంలోని ఆర్ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. సరైన అవగాహన లేని ఆర్ఎంపీ, పీఎంపీలు ఎలాంటి టెస్ట్ లు చేయకుండానే యాంటీ బయోటిక్ మందులు, ఇంజక్షన్లు ఇస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.  కొందరికి నయమైనా మరికొందరికి ప్రాణాల మీదకి వస్తోంది.  జ్వరం తీవ్రతను బట్టి హాస్పిటళ్లకు రెఫర్ చేయకుండా తమ క్లినిక్ లోనే సెలైన్ ఎక్కిస్తూ ఎక్కువ డోస్ మందులు ఇస్తూ  ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. 

స్పెషల్ టీంలు ఫోకస్..

జిల్లా లో వైరల్ ఫీవర్, డెంగ్యూ పరిస్థితుల నేపథ్యం లో ప్రైవేటు హాస్పిటళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. ఆయా టీంలు ప్రైవేటు హాస్పిటళ్ల ను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీ ల్లో హాస్పిటళ్ల లో వైద్యుల వివరాలు, చార్జీల వివరాలు తెలుసుకుంటున్నారు. చార్జీల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న దాదాపు 5 ఆస్పత్రుల కు నోటీసులు అందజేశారు. రోగుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు.

ఒకే రోజు ఇద్దరు మృతి

వెల్గటూర్ మండలం స్తంభం పల్లి గ్రామానికి చెందిన అవ్వ లింగయ్య(48) ధర్మపురి పట్టణానికి చెందిన గజ్జల రాంచరణ్ (10) అనే బాలుడు విష జ్వరం బారిన పడి సోమవారం మృతి చెందారు. స్తంభంపల్లి గ్రామానికి చెందిన లింగయ్య మూడు రోజుల క్రితం జ్వరం తో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. జ్వరం మరింత తీవ్రమై కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే విధంగా రాంచరణ్ జ్వరం బారిన పడి కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతూ చనిపోయాడు. సోమవారం ఇద్దరు చనిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

అయిదు హాస్పిటల్స్ కు నోటీసులు

వరుస తనిఖీలతో ఫిర్యాదులు తగ్గాయి. తనిఖీల్లో హాస్పిటల్స్ కు సంబంధించిన డాక్టర్ల వివరాలు, చార్జీలను తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. రూల్స్ కు విరుద్దంగా నడుపుతున్న దాదాపు 5  హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేశాం.
డాక్టర్ శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్, క్లినికల్ ఎస్టబిలిష్మెంట్ యాక్ట్, జగిత్యాల జిల్లా