కరీంనగర్ జిల్లాను వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

  • జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్న పేషెంట్లు
  • ఒక్కరోజే ఓపీకి 1100 మంది వరకు రాక
  • కరీంనగర్‌‌ ‌‌ లో ముసురుకుంటున్న సీజనల్ వ్యాధులు
  • హాస్పిటల్ లో‌‌ మందుల కొరత.. బయటికి రాస్తున్న డాక్టర్లు

కరీంనగర్, వెలుగు: జిల్లాను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. వానకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులతో జనాలు జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో జిల్లాలోని హాస్పిటళ్లు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా ఏరియా హాస్పిటల్ లో సోమవారం ఒక్కరోజే  1100 మంది అవుట్ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధులే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్లకు చూపించుకునేందుకు వందలాది మంది క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. వీళ్లలో చాలా మంది అడ్మిట్ అయ్యారు. జ్వర పీడితుల కోసం ఇప్పటికే రెండు వార్డులు ఉన్నప్పటికీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వీరారెడ్డి వెల్లడించారు. 

బ్లడ్ టెస్టులు చేసే బయో కెమిస్ట్రీ ఎనలైజర్ రిపేర్‌‌ ‌‌ 

జిల్లా హాస్పిటల్‌‌ లో బ్లడ్ టెస్టులు చేసే బయోకెమిస్ట్రీ ఎనలైజర్ పనిచేయకపోవడంతో ఐదు రోజులుగా చాలా రకాల టెస్టులు నిలిచిపోయాయి. రోగ నిర్ధారణకు బ్లడ్ టెస్టులే ప్రధానం కావడంతో పేషెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయటే చేయించుకుంటున్నారు. బయో కెమిస్ట్రీ ఎనలైజర్ పనిచేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని సీహెచ్ సీలు, పీహెచ్ సీల నుంచి వచ్చిన వందలాది బ్లడ్ శాంపిల్స్‌‌ ను పక్కన పడేశారు.

అలాగే థైరాయిడ్ టెస్టు మెషిన్ కూడా పని చేయడం లేదు. దీంతోపాటు డాక్టర్లు రాసే అన్నిరకాల మందులు హాస్పిటల్ లో దొరకడం లేదు. బయటే కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు  ప్రభుత్వ  మెడికల్ కాలేజీ మంజూరై క్లాసులు కొనసాగుతున్నా జిల్లా ప్రధాన ఆస్పత్రిలో న్యూరో,  నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇంకా ప్రారంభించలేదు. ఈ సమస్యలపై పేషెంట్లు వస్తే వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌‌ కు రెఫర్ చేస్తున్నారు. 

వారంలో 5 డెంగ్యూ కేసులు నమోదు..

ఉమ్మడి జిల్లా పరిధిలో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో 135 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారం రోజుల్లో 5 ఐదు కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్ కు వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. 

అదనపు వార్డు ఏర్పాటు చేశాం 

జిల్లా హాస్పిటల్ లో సీజనల్ వ్యాధులతో వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరగడంతో అదనంగా మరో వార్డు ఏర్పాటు చేశాం. పేషెంట్ల సంఖ్య పెరగడంతో మందులు సరిపోవడం లేదు. అవసరాలకు అనుగుణంగా మందులను సెంట్రల్  డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించి, పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో హాస్పిటల్ సిబ్బంది అందరికి  బయోమెట్రిక్ వర్తించేలా చేస్తాం.  

వీరారెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్