ఆర్​ఎంపీల​పై నిఘా .. పరిధి దాటి వైద్యం చేస్తే.. క్లినిక్​లు సీజ్​

  • రోగులకు హైడోస్​ యాంటీ బయాటిక్స్ 
  • తనిఖీలు చేపట్టిన  వైద్యాధికారులు 
  • కామారెడ్డి జిల్లాలో నాలుగు క్లీనిక్​ల సీజ్​

ఫస్ట్ ఎయిడ్​ సెంటర్ నడపాల్సిన  పీఎంపీ, ఆర్​ఎంపీలు ఏకంగా హాస్పిటల్స్, నర్సింగ్​ హోమ్ ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హై డోస్​ యాంటీ బయాటిక్స్ ఇస్తుండటంతో రోగుల పరిస్థితి విషమిస్తోంది. దీంతో వారు కామారెడ్డి, హైదరాబాద్​లోని హాస్పిటల్స్​కు వెళ్తున్నారు.  ఇటీవల మృతి చెందిన రోగుల సంబంధీకులు ఫిర్యాదు చేయడంతో హెల్త్​డిపార్ట్​మెంట్​ తనిఖీలు చేపట్టింది. 

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వైరల్​ ఫీవర్​ కేసులు ఎక్కువగా ఉన్నాయి.  జ్వరం, డెంగ్యూ లక్షణాలతో  జిల్లాలో ఆరుగురు  మృతి చెందారు.  జ్వరపీడితులు స్థానికంగా ఉన్న  పీఎంపీ, ఆర్​ఎంపీల వద్ద ట్రీట్మెంట్​ తీసుకుంటున్నారు.  కొందరు హై డోస్​ యాంటీ బయాటిక్స్​ ఇస్తున్నారన్న ఫిర్యాదులతో హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రైవేట్​ ట్రీట్మెంట్​పై   నిఘా పెట్టింది.   పీఎంపీ, ఆర్​ఎంపీలు ఫస్ట్ ఎయిడ్​ సెంటర్లుగా కొనసాగించాల్సి ఉండగా  హాస్పిటల్స్, నర్సింగ్​ హోమ్​బోర్డులు పెట్టి  ట్రీట్మెంట్​ చేస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇటీవల మృతి చెందిన రోగుల సంబంధీకులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.  నాలుగు క్లీనిక్​లను సీజ్​ చేశారు.  

145 డెంగ్యూ కేసులు

జిల్లాలో ఇప్పటి వరకు 145 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  జూలై, ఆగస్టులోనే 131 కేసులు నమోదు అయ్యాయి.  ఇవి కేవలం ప్రభుత్వ పీహెచ్ సీల్లో శాంపిల్స్ సేకరించి టీ-హబ్​ల్యాబ్​కు పంపగా నిర్ధారించినవి.  ప్రైవేట్​ హాస్పిటళ్లలో డెంగ్యూ, మలేరియా,  టైఫాయిడ్​  పాజిటివ్​ వచ్చిన కేసులు కూడా వందల్లో ఉంటాయి. 

స్థానికంగా ట్రీట్​మెంట్​ పొందుతూ..

జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, తండాలు, టౌన్​లలో  జ్వర పీడితులు వందల్లో ఉన్నారు.  వీరిలో కొందరు  డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్​ గున్యాతో బాధపడుతున్నారు.   జ్వరాలతో లింగంపేట,  సదాశివనగర్, తాడ్వాయి, కామారెడ్డి  మండలాల్లో  ఆరుగురు చనిపోయారు.  జ్వరం వచ్చిన తర్వాత ఎక్కువ మంది ట్రీట్​మెంట్​ కోసం స్థానికంగా ఉన్న పీఎంపీలు, ఆర్​ఎంపీల వద్దకు పరుగెడుతున్నారు.  ఇందులో  కొంత మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది.  రోగులకు మోతాదుకు మించి హైడోస్​యాంటీబయాటిక్స్​ ఇస్తున్నారని,  తట్టుకోలేని కొంతమంది పరిస్థితి విషమించిన తర్వాత  కామారెడ్డి, హైదరాబాద్​కు తరలిస్తున్నారు.  కాగా పీఎంపీ, ఆర్​ఎంపీలు కేవలం ఫస్ట్  ఎయిడ్​ మాత్రమే చేయాలని హెల్త్​ డిపార్ట్​ మెంట్​ పేర్కొంది. 

క్షేత్ర స్థాయిలో తనిఖీలు

పీఎంపీలు, ఆర్​ఎంపీలు చేస్తున్న ట్రీట్మెంట్​తో రోగులు ఇబ్బందిపడుతున్నారని  ఆఫీసర్లు చెబుతున్నారు.  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పీఎంపీలు, ఆర్​ఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్​లలో తనిఖీలు చేపట్టారు.   క్లినిక్స్​లో బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్​ చేస్తున్నారా,  మందులు ఏమి రాస్తున్నారనే వివరాలు పరిశీలిస్తున్నారు.  పేషెంట్లు చనిపోయినట్లు ఫిర్యాదులు వచ్చినా, హై డోస్​ యాంటీ బయాటిక్స్​తో  ట్రీట్మెంట్​ చేసినా ఆ క్లినిక్​లను సీజ్​ చేస్తున్నారు.   పర్మిషన్​ లేకుండా కొందరు నర్సింగ్ హోమ్​లు, హాస్పిటల్స్​గా బోర్డులు ఏర్పాటు చేశారు.   అనుమతులు లేని భిక్కనూరు,  లింగంపేట,  రామారెడ్డి మండల కేంద్రంతో పాటు,  సదాశివనగర్​ మండలం పద్మాజివాడి చౌరస్తాలోని నాలుగు క్లీనిక్​లను సీజ్​ చేశారు. 

ఫస్ట్ ఎయిడ్​ సెంటర్లుగా  నిర్వహించాలి

పీఎంపీ, ఆర్​ఎంపీలు ఫస్ట్ ఎయిడ్​ సెంటర్లుగా మాత్రమే నిర్వహించుకోవాలి.  కొందరు హాస్పిటల్స్, నర్సింగ్​ హోమ్ గా బోర్డులుపెట్టి ట్రీట్మెంట్​ చేస్తున్నారు.  డాక్టర్ల పేరుతో ప్రిస్క్రిప్షన్​ రాయకూడదు.  హై డోస్ యాంటీ బయాటిక్స్​తో ట్రీట్మెంట్​ చేయొద్దు.   తమ పరిధి దాటి చేస్తుండటంతో తనిఖీలు చేపట్టాం.  పేషెంట్ ఆరోగ్య పరిస్థితి గమనించకుండా గ్లూకోజ్​పెట్టొద్దు. ఇటీవల మాకు అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టి నాలుగు క్లీనిక్​లను సీజ్​ చేశాం. 

డాక్టర్​ చంద్రశేఖర్​, డీఎంహెచ్​వో