పది రోజుల పెద్ద పండుగ వచ్చేసింది...

మన ఇంటి పక్క సందులో పిల్లలు ఐదు రోజుల కోసం చిన్న వినాయకుడి విగ్రహాన్ని పెడతారు...ఇంకొంచెం దూరం పోతే, మెయిన్ రోడ్డు పక్కనే కొంచెం పెద్దోళ్లు పెద్ద వినాయకుడ్ని పెడతారు.. ఐదడుగులు, పదడుగులు, ఇరవై అడుగులు. యాభై అడుగులు ఎంత పెద్ద వినాయకుడుంటే ఆ ఏరియాకి అంత క్రేజ్ అన్నట్టు.  ..నవరాత్రి ఉత్సవాలు జరిపి పూజలు చేసి. నిమజ్జనం చేయడంతో వినాయకుడికి చేసే అతిపెద్ద పండుగ పూర్తవుతుంది. ..వినాయకుడికే ఎందుకు ఇంత పెద్ద వేడుక? వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి కొన్ని విశేషాలు.

విఘ్నేశ్వరుడు, గణేశుడు, గణపతి, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా... విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడే. అది దంపతులు శివ పార్వతుల పెద్ద కుమారుడు వినాయకుడు గురించి స్కంద పురాణం, గణేశ పురాణం, శివపురాణం, వరాహ పురాణం.. ఇలా ఎన్నో పురాణాల్లో కథలున్నాయి. కాని  స్కంద పురాణంలోని కథే వినాయక వ్రత కల్పంలో వినిపించేది.

స్వర్గంలోకంలోని దేవుళ్లందరూ విఘ్నాలకు ఒక అధిపతి కావాలని కైలాశానికి బయలుదేరి శివుడ్ని కోరితే, ఆయన వినాయకుడిని విఘ్నాతిపతిగా ఎంపిక చేశాడు. వినాయకుడు పెట్టే విఘ్నాలను తప్పించుకొని ఆ పనులు పూర్తి చేయడం మానవులు ఎవ్వరికైనా కష్టమైన పనే. అందుకే ఏ పని మొదలు పెట్టినా వినాయకుడికే ముందు పూజ చేస్తారు. త్రిమూర్తులుగా చెప్పుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వినాయకుడిని పూజించినవాళ్లేనని పురాణాలు చెబుతున్నాయి. 

పది రోజుల పెద్ద పండుగ


వినాయకుడు విఘ్నాతిపతిగా అవతరించిన రోజే వినాయక చవితి. భాద్రపద మాసం చతుర్ది (చవితి) రోజున విఘ్నాతిపతిగా అవతరించాడు వినాయకుడు. ఈ ఏడాది సెప్టెంబర్​ 7 న  ఈ పండుగ వస్తుంది.

"శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే" అంటే తెల్లటి వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణిం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహచృప్తి తోడి ముఖంగలవాడు అయిన వినాయకుడిని అన్ని అడ్డంకులు తొలగించమని కోరడం.... దేవతల్లో ఎవరికీ లేనన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే, అందరికంటే ముందే పూజలు అందుకుంటాడు వినాయకుడు, వినాయక చవితి రోజు ఇంట్లో, వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు.

 పది రోజుల పాటు. వైభవంగా పూజలు నిర్వహించి పదకొండో రోజు దగ్గర్లోని నది. చెరువు, సరస్సుల్లో నిమజ్జనం చేస్తారు. ఇక్కడితో ఈ పండుగ అయిపోతుంది. ఈ పండుగ ఉద్దేశం ఆ దేవుడ్నే భూమ్మీదకి రప్పించి, వైభవంగా ఆయనకు ఉత్సవం చేసి తిరిగి ఆయనను తన లోకానికి పంపించడం, భక్తి, శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవం నిర్వహిస్తే ..., ఎంతో మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. ఈ సమయంలో ఏదైనా పని మొదలుపెడితే అది విజయవంతంగా పూర్తవుతుందని విశ్వపిస్తారు..

ALSO READ : వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారు? ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందంటే..

వినాయకుడి జననం

వినాయకుడి జననం గురించి మనం చెప్పుకునే కథ స్కందపురాణంలోనిది. గజాసురుడనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందుతాడు. నీకేం కావాలో కోరుకో' అని గజాసురుడు అడిగితే, నా కడుపులో ఉండిపో అని కోరతాడు. గజాసురుడు అడిగిన కోరికను తీర్చేస్తాడు శివుడు, కాగా, ఈ విషయం తెలిసిన విష్ణువు.. గజాసురుడి దగ్గరికెళ్లి, అతని కడుపులో ఉన్న శివుడ్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక తన చావు తప్పదని అర్థమైన గజాసురుడు, శివుడ్చి ఇంకో కోరిక కోరతాడు. 'నేను చనిపోయిన తరువాత తన తలను లోకపూజ్యం చెయ్యాలి' అని కోరతాడు. 

ఇక శివుడు కైలాసానికి తిరిగొస్తున్నాడని తెలిసిన పార్వతీ దేవి.. నలుగు పిండితో ఒక బాలుడ్ని తయారుచేసి, ఆ బాలుడ్ని వాకిట్లో కాపలాకు పెట్టి స్నానం చెయ్యడానికి వెళ్తుంది. శివుడు తిరిగొస్తాడు. ఇంటి బయట బాలుడు శివుడ్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. కోపంతో ఆ బాలుడి తలను నరికేస్తాడు. శివుడు. స్నానం చేసి బయటికొచ్చిన పార్వతి.... తాను తయారుచేసిన బాలుడు లేకపోవడంతో శివుడ్ని నిలదీస్తుంది. శివుడు పార్వతి కోసం, ఆ బాలుడికి గజాసురుడి తల అతికించి మళ్లీ బతికిస్తాడు. ఆ బాలుడే ఇవ్వాళ అన్ని లోకాల్లో మొదట పూజలు అందుకుంటున్నవినాయకుడు.

వినాయకుడిని బుద్ధి ..సిద్ధి ...వృద్ధి... అందించే దేవుడిగా భావిస్తారు. మంచి మేధస్సు, ఆలోచనా తీరు వినాయకుడిని పూజిస్తే వస్తుందని నమ్ముతారు. అదే బుద్ధి అందుకే వినాయక చవితి రోజున విద్యార్థులు తమ పుస్తకాలను దేవుడి దగ్గర ఉంచి మంచి చదువు ప్రసాదించమని కోరుతుంటారు. ఇక పనీ మొదలుపెట్టినా అందులో అభివృద్ధి సాధించాలంటే వినాయకుడిని పూజించాలి. ఏ యోగం దక్కాలన్నా దేవుడి అనుగ్రహం తప్పనిసరి. వినాయకుడికి పూజచేయడంతో ఆ యోగం సిద్దించి జీవితంలో ఉన్నతంగా బతకొచ్చని భక్తులు బలంగా నమ్ముతారు.