వినాయక చవితి స్పెషల్ : ప్రతి పత్రమూ దివ్య ఔషధం.. ఏ ఆకు ఏ రోగాన్ని తగ్గిస్తుందో తెలుసుకుందాం..

మనది ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి. మనం చేసుకునే ఏ పండుగైనా ప్రకృతిలో భాగమే. వినాయకచవితి కూడా అలాంటిదే. సాధారణంగా దేవతా విగ్రహాలను, పటాలను పూలతో అలంకరిస్తారు. కానీ.. గణపతి విగ్రహాన్ని మాత్రం తొమ్మిది రోజులపాటు అనేక రకాల ఆకులతో అలంకరిస్తారు. ఇది గణేశుడి పూజలో స్పెషల్. స్వామి పూజకు ఉపయోగించే ప్రతి ఆకూ ఔషధమే.

వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాల గురించి చెప్పారు. ఆరోగ్యానికి ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. అందుకే మన పెద్దలు పూజల్లో ఆ ఔషధ ఆకులను వాడతారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత వాటిని వినాయకుడి విగ్రహంతోపాటు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ ఆకులకు ఉన్న ఔషధ గుణాల వల్ల ఆ నీరు శుభ్రం అవుతుంది. వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టులో వానలు ఎక్కువగా కురుస్తాయి. వాగులు, వంకలు పొంగి వరద నీరు చెరువుల్లో చేరుతుంది. అప్పుడు చెరువులో నీళ్లు కలుషితం అవుతాయి. అప్పుడు ఈ ఆకులు చెరువులో వేయడం వల్ల నీళ్లలో ఉండే హానికారక క్రిములు చనిపోతాయని పెద్దలు చెబుతుంటారు. అంత పవర్ ఉన్న ఔషధాలు ఏంటో తెలుసా?

దూర్వాయుగ్మం (గరిక) :

వినాయకుడి పూజలో ఇది చాలా ముఖ్యమైనది. ఇది ముక్కు, చర్మ, ఉదర వ్యాధులను, దద్దుర్లను, మూత్రనాళంలో మంటను తగ్గిస్తుంది. మొలల నివారణకు మంచి ఔషధం.

మాచీపత్రం (మాచిపత్రి) :

కంటి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. దద్దుర్లు, తలనొప్పి, వాతం నొప్పులకు ఔషధంలా పని చేస్తుంది. 

బిల్వపత్రం (మారేడు) :

పవిత్రమైన ఈ పత్రం జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గిస్తుంది. 

బృహతీ పత్రం (వాకుడాకు) :

ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, కంటి వ్యాధులను నయం చేస్తుంది. 

బదరీ పత్రం (రేగు) :

జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది. చిన్నపిల్లల్లో రోగ నిరోధకశక్తి పెంచుతుంది.

దత్తూర పత్రం(ఉమ్మెత్త) :

ఇది విషం లాంటిది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెగ గడ్డలు, స్తవ వాపు, పేను కొరుగుడు, ఒంటి నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, రుతు సంబంధిత సమస్యలు నివారిస్తుంది.

ఆపామార్గ పత్రం (ఉత్తరేణి) :

ఇది పళ్ళు తోముకోవడానికి, పిప్పళ్లు, చెవిపోటు, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

తులసీ పత్రం(తులసి) :

లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. దీని ఆకు దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 

చూత పత్రం (మామిడాకు) :

క్రిమి కీటకాలను నివారిస్తుంది. రక్త విరోచనాలు, చర్మ వ్యాధులకు ఇది దివ్య ఔషధం. 

కరవీర పత్రం (గన్నేరు) :

ఇది కణుతులు, తేలు కాటు, విష కీటకాల కాట్లు, దురద, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది.

విష్ణుక్రాంత పత్రం (విష్ణు కాంత) :

ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. 

దాడిమీ పత్రం (దానిమ్మ) :

ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుంచి రక్తం కారడం, కళ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు లాంటి సమస్యలు తగ్గిస్తుంది. 

దేవదారు పత్రం(దేవదారు) :

ఈ ఆకు అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు తగ్గిస్తుంది. 

మరువక పత్రం (మరువం) :

సువాసనలు వెదజల్లే పత్రం ఇది. జీర్ణశక్తి, ఆకలి పెంచుతుంది. జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది.

సింధూర పత్రం (వావిలి) :

ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలను దూరం చేస్తుంది.

శమీ పత్రం(జమ్మి ఆకు) :

ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

జాజీ పత్రం (జాజి ఆకు) :

వాతం నొప్పులు, జీర్ణాశయ, మలాశయ వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

గండకీ పత్రం(దేవ కాంచనం ) :

ఇది మూర్ఛ వ్యాధికి మంచి మందు. కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగులను నివారిస్తుంది. 

అశ్వత్థ పత్రం (రావి ఆకు) :

మల బద్ధకం, వాంతులు, మూత్ర నాళ సంబంధిత వ్యాధులు, జ్వరాలు నివారిస్తుంది. జీర్ణశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందిస్తుంది. 

అర్జునపత్రం(తెల్ల మద్ది) :

చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ సమస్యలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.

ఆర్క పత్రం (జిల్లేడు) : 

సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.