కరీంనగర్‌రూరల్, వెలుగు : కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రపోజల్‌ను విరమించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్, దుర్శేడ్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు, ప్రజలు సోమవారం గోపాలపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి ర్యాలీగా వచ్చి చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడం వల్ల ఉపాధి హామీ పనులు కోల్పోవడంతో పాటు ట్యాక్స్‌లు సైతం పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలు కార్పొరేషన్‌కు దూరంగా ఉంటాయని, పంచాయతీలుగా కొనసాగితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కలెక్టర్ స్పందించి గ్రామాల్లో ఎంత మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ? వ్యవసాయం మీద ఆధారపడి ఎంత మంది జీవిస్తున్నారో ఎంక్వైరీ చేసి విలీన ప్రక్రియను రద్దు చేయాలని కోరారు.
గ్రామస్తుల ఆందోళనకు బీఆర్‌ఎస్ లీడర్లు మద్దతు పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు శ్యామసుందర్‌రెడ్డి, తిరుపతి, గోపాల్‌పూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్‌లు సుంకిశాల సంపత్‌రావు, ఆరె శ్రీకాంత్, గోనె నర్సయ్య, మంద రాజమల్లు, ఊరడి శివారెడ్డి పాల్గొన్నారు.