సర్వేలు.. రీ సర్వేలతోనే సరి .. ముందుపడని వికారాబాద్-కృష్ణ రైల్వే పనులు

  • ఏండ్లు గడుస్తున్నా ముందుపడని వికారాబాద్-కృష్ణ రైల్వే పనులు
  • గతేడాది ఫైనల్​ లొకేషన్​ సర్వేకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు
  • తాజా బడ్జెట్​ సమావేశాల్లో నిధుల కేటాయింపుపై ఆశలు

మహబూబ్​నగర్, వెలుగు : వికారాబాద్–​-కృష్ణ రైల్వే లైన్​ ‌‌‌‌ఏండ్లుగా సర్వేలు, రీ సర్వేలతోనే సాగిపోతోంది. ఈ ప్రాజెక్టు 1980లో తెరమీదకు వచ్చినా.. ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొత్త ఎస్టిమేషన్స్​తో సర్వేలు చేపడుతున్నారే తప్ప, పనులు ప్రారంభించడం లేదు. గతేడాది ఈ రైల్వే లైన్​కు ఫైనల్​ లొకేషన్​ సర్వే (ఎఫ్ఎల్ఎస్) పూర్తి చేశారు. దీంతో ఈసారి రైల్వే బడ్జెట్​ కేటాయింపుల్లో వికారాబాద్–​-కృష్ణ రైల్వే లైన్​కు మోక్షం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

ఎఫ్ఎల్ఎస్​ కంప్లీట్..

1980లో వికారాబాద్–​-కృష్ణ రైల్వే లైన్  తెరమీదకు రాగా, 1988లో రూ.90 కోట్లతో వికారాబాద్  నుంచి పరిగి, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నారాయణపేట, కృష్ణ వరకు రైల్వే లైన్​ నిర్మించాలని అప్పటి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సర్వే చేయగా, అప్పటి రైల్వే బడ్జెట్​లో కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 2008లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్​ చేసేందుకు రీ సర్వే  చేయించింది.

సర్వేలో మార్పులు చేసి రైల్వే లైన్​ను వికారాబాద్‌‌ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌‌పేట, కొడంగల్, బొంరాస్‌‌పేట, దౌల్తాబాద్‌‌, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్‌‌ మీదుగా కృష్ణ (127 కిలోమీటర్లు) వరకు ఏర్పాటు చేయాలని రూ.1,100 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు కేటాయించాలని ఒప్పందం చేసుకున్నాయి. కానీ, అనివార్య కారణాల వల్ల సర్వే పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో ఈ ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టాలెక్కిస్తుందని భావించినా టేకప్​ చేయలేదు.

2017లో కేంద్రం ఈ పనులు చేసేందుకు అంగీకారం తెలిపినా స్పందించలేదు. ప్రధానంగా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చు  అవుతుందనే నెపంతో, అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్​ చేసేందుకు ముందుకు రాలేదనే విమర్శలున్నాయి. దీనికితోడు భూ సేకరణకు కూడా పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందనే టాక్​ ఉంది. అయితే గతేడాది సెప్టెంబర్​లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్​ లొకేషన్​ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతించింది. రూ.7.91 కోట్లతో 122 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. 

స్టూడెంట్లు, వ్యాపారులకు మేలు..

పరిశ్రమలు, గ్రానైట్, బంగారం, పట్టు చీరల ఉత్పత్తికి పేరు పొందిన వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల మధ్య ఈ రైల్వే లైన్​ ఏర్పాటు వల్ల దూరభారం తగ్గనుంది.  పరిగి, కొడంగల్, దోమ, వికారాబాద్​ ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మంది ఉద్యోగులు, స్టూడెంట్లు నిత్యం హైదరాబాద్​కు రాకపోకలు సాగిస్తుంటారు. నారాయణపేట నుంచి బంగారం, చీరల వ్యాపారాల నిమిత్తం రాయచూర్​, గుల్బర్గా, మహారాష్ట్ర నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైల్వే లైన్​ ఏర్పాటు చేయడం వల్ల వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్​ నియోజకవర్గాల్లోని ప్రజలకు రవాణా భారం తగ్గనుంది. అలాగే వికారాబాద్​ నుంచి రాయచూర్​ వెళ్లడానికి కూడా షార్ట్​ కట్​ రూట్​ అవుతుంది.

ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులివే..

  • గద్వాల-డోర్నకల్​ లైన్..  గద్వాల నుంచి వనపర్తి, నాగర్​కర్నూల్, కల్వకుర్తి,  దేవరకొండ వరకు 220 కిలోమీటర్లతో కొత్త రైల్వే లైన్​ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ప్రతిపాదన దశలోనే ఉంది. 
  • అచ్చంపేట, మహబూబ్​నగర్, తాండూరు వరకు కొత్త రైల్వే లైన్​ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. 180 కిలోమీటర్ల మేర రైల్వే లైన్​ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.
  • జడ్చర్ల-నంద్యాల 170 కిలోమీటర్ల వరకు కొత్త లైన్​ ఏర్పాటు చేసేందుకు 2007లో ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రూ.340 కోట్ల అంచనా వేయగా, ఇప్పుడు మూడింతలకు అంచనా వ్యయం పెరిగింది.
  • జడ్చర్ల-మిర్యాలగూడ వరకు 210 కిలోమీటర్ల మేర రైల్వే లైన్  ఏర్పాటు చేయాలని 2010 ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రూ.680 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ, పనులు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే అంచనా వ్యయం కూడా మూడింతలకు పెరిగే అవకాశం ఉంది.