మూడో వైపు.. ముహూర్తమెప్పుడో .. ముందుకు సాగని కేయూ భూ సర్వే

  • కుమార్ పల్లి, గుండ్ల సింగారం వైపే సర్వే  
  • పలివేల్పుల శివారును ముట్టుకోని ఆఫీసర్లు
  • అటువైపే కొందరు పెద్దాఫీసర్ల ఆక్రమణలు 
  • అందుకే సర్వేను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ లోని కాకతీయ వర్సిటీ భూ కబ్జాల వ్యవహారంపై నెలలు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. వర్సిటీకి ఒకవైపు వరంగల్- – కరీంనగర్​హైవే ఉండగా.. మిగతా మూడు వైపులా సర్వే చేయాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రెండు నెలల కిందటే లష్కర్​సింగారం, కుమార్​పల్లి శివారు భూముల డీమార్కేషన్​ పూర్తి చేశారు. కాగా.. మూడోవైపు కీలకంగా ఉన్న పలివేల్పుల భూముల జోలికి వెళ్లడం లేదు. వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన కొందరు పెద్దాఫీసర్ల ఇండ్లు ఉండటం వల్లే హద్దులు నిర్ణయించడంలో  కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలివేల్పుల వైపు సర్వే పూర్తి చేస్తే కేయూ భూ కబ్జాలపై క్లారిటీ రానుంది. మూడోవైపు సర్వేకు ముహూర్తం ఎప్పుడొస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు నెలలైనా సర్వే పూర్తికాలే

 వర్సిటీకి కుమార్ పల్లి, లష్కర్​ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలోని 673.12 ఎకరాలు సేకరించి ఇచ్చారు. కానీ ఆయా గ్రామాల పరిధిలోని వర్సిటీ భూములకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. దీంతో వర్సిటీ చుట్టూ ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా కుమార్ పల్లితో పాటు పలివేల్పుల శివారు భూములే ఎక్కువగా కబ్జా అయ్యాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్​కాకతీయ యూనివర్సిటీ టీచర్స్​(అకుట్​), వివిధ విద్యార్థి సంఘాల నేతలు పలుమార్లు ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేశారు. ఇక కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్సిటీ భూముల రక్షణకు కాంపౌండ్​నిర్మించేందుకు రూ.10 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. 

కానీ హద్దులు తేల్చకపోవడంపై వివాదం రాజుకుంది. ఆ సమయంలో ఇన్​చార్జ్ వీసీగా వాకాటి కరుణ ఆదేశాలతో గత జులై 14న గుండ్ల సింగారం వైపు వర్సిటీ భూముల ఫిజికల్​సర్వే మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సర్వేను కొద్దిరోజులకే బంద్ పెట్టారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ఆఫీసర్లకు ఫిర్యాదులు అందడం, ప్రభుత్వం కూడా సీరియస్​ గా తీసుకోగా.. మళ్లీ గత సెప్టెంబర్​11న సర్వే ప్రారంభించారు. విజిలెన్స్, కేయూ, రెవెన్యూ, సర్వే అండ్​ల్యాండ్ రికార్డ్స్​ ఆఫీసర్లు జాయింట్​ఇన్​స్పెక్షన్​చేసి వర్సిటీ భూముల డీ మార్కేషన్​కు శ్రీకారం చుట్టారు. నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకు సర్వే పూర్తి కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వీసీ చొరవ చూపితేనే..  

గుండ్ల సింగారం, కుమార్​పల్లి వైపు వర్సిటీ భూముల సర్వే పూర్తి కాగా.. మూడో వైపు పలివేల్పుల శివారు సర్వే చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువైపు కూడా సర్వే పూర్తయితే వర్సిటీ భూముల్లోని కబ్జాల బాగోతం బయటపడుతుంది. ఇక్కడి వర్సిటీ కబ్జాల్లో ఆఫీసర్లు ఉండటం, వారికి పొలిటికల్​ సపోర్టు ఉండటంతోనే సర్వే ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 రెవెన్యూ, సర్వే ఆఫీసర్లు కూడా లైట్​తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రూ.కోట్ల విలువైన వర్సిటీ భూమి అన్యాక్రాంతమైంది. కాగా.. పూర్తిస్థాయి వీసీ లేకపోవడంతోనే  భూముల పర్యవేక్షణ లేక కబ్జాల పాలయ్యాయి.  తాజాగా కేయూ వీసీగా ప్రొఫెసర్​ప్రతాప్​రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రత్యేక చొరవ చూపితేనే వర్సిటీ భూముల లెక్క తేలుతుంది. వీసీ వెంటనే వర్సిటీ కబ్జాలపై ఫోకస్​పెట్టి,  పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 

పలివేల్పుల శివారే కీలకం

జాయింట్​ఇన్​స్పెక్షన్​లో భాగంగా ఆఫీసర్లు ముందుగా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చిన కుమార్​పల్లి శివారులోని అసిస్టెంట్​రిజిస్ట్రార్​అశోక్​ బాబు ఇంటివైపు సర్వే నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి ఇండ్లు వర్సిటీ భూమిలోనే ఉన్నట్లు నిర్ధారించారు. నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత లష్కర్​ సింగారం శివారు భూముల సర్వే కూడా గత సెప్టెంబర్​లో పూర్తి చేశారు. కానీ.. పలివేల్పుల శివారు భూముల సర్వేకు మాత్రం ఆఫీసర్లు ముందడుగు వేయడంలేదు. 

పలివేల్పుల శివారు భూముల్లోనే ఎస్సార్ఎస్పీ కెనాల్, రుద్రమాంబ ఫిల్టర్​బెడ్​, సెరీకల్చర్​ కు కేటాయించిన ల్యాండ్ ఉంది. అవి కాకుండా రూ.కోట్ల విలువైన వర్సిటీ భూమి కబ్జాకు గురైంది. అక్కడి ఆక్రమణదారుల్లో ట్రాన్స్​పోర్ట్, పోలీస్​ డిపార్ట్​మెంట్​కు చెందిన పెద్దాఫీసర్లే ఉన్నారు. దీంతోనే వివిధ కారణాలను సాకుగా చూపుతూ సర్వే చేసేందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.