ఇంకా కుదుటపడలే!

  • ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఖమ్మం, వెలుగు :  ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇంకా కుదుటపడలేదు. నీళ్లు, నిత్యావసరాలు, ఆహారం లాంటివి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నా.. ఒక్కో కుటుంబానికి రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరగడంతో కోలుకోలేకపోతున్నారు. కళ్ల ముందే కనబడుతున్న వరద విధ్వంస ఆనవాళ్లను క్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

మున్సిపల్ సిబ్బంది, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బంది కూడా ముంపు కాలనీల్లో సమస్యల పరిష్కారంపైనే ఫోకస్ పెట్టారు. తక్షణ సాయం రూ.10 వేల చొప్పున బాధితుల అకౌంట్లలో జమ చేసేందుకు బాధితుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.