హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?

చలికాలం వచ్చిందంటే... సీతాఫలాల పండ్ల బుట్టలు రోడ్డుకి ఆ పక్క, ఈ పక్క స్వాగతం చెప్తుంటాయి. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన వీటి రుచి చాలా బాగుంటుంది. అందుకే ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందుల సీతాఫలాలకు డిమాండ్ ఎక్కువ. హైదరాబాద్కే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి పండ్లు సరఫరా చేస్తారు.

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఇల్లందుల ఏజెన్సీలో అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన సీతాఫలాల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. పట్టణంలోని జేకే 5, 29 డీప్ భూగరృగనుల ప్రాంతంలో కాసే సీతాఫలాలు ఎంతో రుచిగా ఉంటాయి. జేకే 5 ఓసీ, పంద్రానెంబర్ 21, ఇంక్లైన్ ఏరియా, పూసపల్లి, రొంపేడు. గుండాల, ఆళ్లపల్లి, మర్మోద్ తదితర అటవీ ప్రాంతాల నుంచి సీతాఫలాలు ఇతర ప్రాంతాలకు తరలుతాయి. 

పట్టణంలోని జేకే బస్టాండ్ పరిసర ప్రాంతం, సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుంటారు. డజన్లు, గంపల వారీగా ధరను నిర్ణయిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఖమ్మం, హైదరాబాద్ కు అధికంగా సీతాఫలాలు పంపుతుంటారు. తినేవాళ్లకి రుచి, అమ్మేవాళ్లకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

స్థానికులు సీతాఫలాలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. సీతాఫలాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి, ఎలతో పాటు పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలు ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం వైద్యుల సలహా మేరకు తినాలి.

సహజసిద్ధంగా..
"సీతాఫలాల్లో షోలాపూర్ నుంచి ఎస్ఎంకే 1, 2. అనోనా 2, బాలానగర్, రెడ్ సీతాల్, వాషింగ్టన్, ఐలాండ్ జెమ్, ఆర్కా సహాన్, అటిమొయా సంకరజాతి మొక్కలను పెంచుతున్నాం. ఎస్ఎంకే రకం సీతాఫలాలు ఎకరానికి దాదాపు 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో సీతాఫలాల చెట్లు ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు వాడరు. అందుకే ఇక్కడి పండ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని" చెప్పాడు ఉద్యానవన శాఖాధికారి మరియన్న.

ఆదాయ వనరు..
ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు... స్థానికుల ఇండ్లలోనూ సీతాఫలాలు కాస్తాయి. అందుకే చాలామందికి ఆదాయ వనరుగా మారింది. ఒక్క సీజన్లోనే ఒక కోటి నుంచి మూడు కోట్ల వరకు. అమ్మకాలు జరుగుతాయి. ఒక్కో కుటుంబం అయితే.. ఇరవై వేల నుంచి యాభై వేల వరకు సంపాదిస్తారు.

ALSO READ | Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!