Nirjala Ekadasi 2024: జూన్​ 18న నిర్జల ఏకాదశి.. కఠినమైన ఉపవాసం... నియమాలు ఇవే..

హిందూ పురాణాల్లో ఏకాదశి తిథి ఉన్న రోజు చాలా విశిష్టమైన రోజు.  ప్రతి నెల రెండు ఏకాదశి రోజలు ఉంటాయి.  జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో  వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు.  సహజంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు.  అన్ని ఏకాదశుల్లో  ... నిర్జల ఏకాదశిని  అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం చాలా కష్టంగా ఉంటుంది .. కాని శీఘ్రంగా అంటే అతి త్వరగా ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు.  ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు.. శుభ ముహూర్తం.. ఎప్పుడు.. నిర్జల ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత .. పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం. . . 

 ప్రతి సంవత్సరం, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసం మత గ్రంథాలలో చాలా ప్రత్యేకం. మహాభారత కథలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా వేదవ్యాసుడు వర్ణించాడు. ఈ వ్రతాన్ని ఆచరించరిస్తే ఏకంగా 24 ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని మహాభారతంలో గ్రంధంలో ఉందని పండితులు చెబుతున్పారు. ఈ ఏకాదశి రోజున కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటేనే అది ఫలిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇది చాలా కష్టమైన ఉపవాసంగా పురాణాల్లో పరిగణించబడుతుంది. 

నిర్జల ఏకాదశి ఎప్పుడు..?

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూన్ 17 ఉదయం 4:45 గంటలకు నిర్జల ఏకాదశి ప్రారంభం కానుంది. తిరిగి జూన్ 18న ఉదయం 6:20 గంటలకు ఈ వ్రతం ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో బ్రహ్మ ముహూర్తంలో ఉన్న తిథిని ఆధారంగా లెక్కిస్తారు కావున  ఉదయతిథి ప్రకారం, ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకుంటారు. 

ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ హరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని.. ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు. ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం 18 జూన్ 2024 న జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే..నిర్జల ఏకాదశి పూజ సమయం, కావాల్సిన వస్తువులు గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి..?

నిర్జల ఏకాదశి మొత్తం 24 ఏకాదశులలో అత్యంత కష్టతరమైన ఉపవాసం. ఈ రోజంతా నీటిని కూడా తీసుకోకూడదు. కానీ ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి, ఉపవాసం ఉండాలని కోరుకుంటే, అతను నీటితో పాటు పండ్లను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. అయితే నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి బట్టలు ధరించి ఉపవాసం ఉండేందుకు కావలసిన శక్తిని ప్రసాదించమని  దేవుడిని ప్రార్థించుకోవాలి. తర్వాత  విష్ణుమూర్తి చిత్ర పటాన్ని కాని.. ప్రతిమను కాని పూలు, తులసి మాలలతో  అలంకరించాలి. విష్ణువుకు పండ్లు, పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత తులసి మొక్కకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి.

తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తర్వాత కథను చదివి హారతి ఇవ్వాలి.   రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి వారిని తలుచుకుంటూ ప్రార్థించాలి. నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో రాత్రి నిద్రపోకూడదు. రాత్రి పూట విష్ణుమూర్తిని స్మరించుకుంటూ కాలం గడపాలి.  వీలైతే భజన, కీర్తనలు కూడా చేయాలి. ఈ ఉపవాసం మరుసటి రోజు విరమించాలి. మరుసటి రోజు అనగా జూన్ 19వ తేదీ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానము చేసి పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఈ ఉపవాసం సంపూర్ణంగా పూర్తి చేసినట్లు అవుతుంది. ఇలా నిష్టతో విష్ణుమూర్తిని పూజించడం వలన స్వామి వారిని కరుణించి ధనవంతులను చేస్తారని భక్తులు నమ్ముతారు.