వెరిఫికేషన్​వెరీ స్లో..! నత్తనడకన సాగుతున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ​

జనగామ, వెలుగు: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్​) వెరిఫికేషన్ స్లోగా సాగుతోంది. జనగామ జిల్లాలో మొత్తంగా 61,472 అప్లికేషన్‌లు రాగా ఒక్కటి కూడా పూర్తిగా వెరిఫై చేయలేదు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తరచూ రివ్యూలు నిర్వహించి, ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 12 వేలపై చిలుకు అప్లికేషన్ల పరిశీలన ప్రారంభం కాగా, పూర్తి కాలేదు. డిసెంబర్ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

61 వేల దరఖాస్తులు

గత సర్కారు హయాంలో 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్ మొదలవగా, అప్పట్లో కేవలం అప్లికేషన్లను మాత్రమే స్వీకరించారు. ప్లాట్ల యజమానులు రూ.వెయ్యి, వెంచర్ల యజమానులు రూ.10 వేలు చెల్లించి, అప్లై చేసుకున్నారు. జిల్లాలో 61,472 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో జనగామ మున్సిపల్ పరిధిలో 18,379, గ్రామ పంచాయతీల పరిధిలో 35,412 ఉండగా, మిగిలినవి కుడా పరిధిలో ఉన్నాయి. వీటిని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి పరిశీలిస్తున్నారు.

 ఈ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుండగా, మొదటి దశలో వెరిఫికేషన్ చేసిన అధికారుల రిపోర్ట్ పంచాయతీ పరిధి అయితే పంచాయతీకి, మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్​కు చేరుతుంది. రెండో దశలో డిమాండ్ నోటీసు (ఎల్ఆర్ఎస్ రుసుము) రెడీ చేసి యజమానులకు ఇవ్వడం, మూడో దశలో సదరు యజమానులు డబ్బులు చెల్లిస్తే ప్రొసిడింగ్ సర్టిఫికెట్ అందించనున్నారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పరిశీలించిన అప్లికేషన్లు 4,392 ఉండగా, రెవెన్యూ అధికారులు వెరిఫై చేసినవి 4,719 ఉన్నాయి.

 ఇరిగేషన్ శాఖ తనిఖీ చేసినవి 3,654 అప్లికేషన్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 2,595 అప్లికేషన్లు రెండో దశకు చేరుకున్నాయి. వీటికి సంబంధించి డిమాండ్​ నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఇది పూర్తైతే సదరు యజమానులు డబ్బులు చెల్లించిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రొసిడింగ్స్ ను అందించనున్నారు. రూల్స్​కు అనుకూలంగా ఉన్న వాటినే త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్​జోన్, అసైన్డ్, ఈనాం, ఎండోమెంట్, వక్ఫ్ భూముల సర్వే నంబర్లలో ఉన్న ప్లాట్ల వెరిఫికేషన్​ను నిలిపేస్తున్నారు. 2020 ఆగస్టు 26 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన లే అవుట్ లేని వెంచర్ల ప్లాట్లకు సంబంధించి మాత్రమే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత క్రయవిక్రయాలు జరిగిన ప్లాట్లకు సంబంధించి ప్రస్తుత ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

మున్సిపల్​కు బాధితులు.. 

ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్ సందర్భంగా అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్లి చెక్ చేస్తుండగా, పలువురి ప్లాట్ల వివరాలకు సంబంధించి డాటా నాట్ ఫౌండ్ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. దీంతో సదరు యజమానులు మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను అందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా మున్సిపల్ లో అధికారులు సరిగా అందుబాటులో ఉండడం లేదు.

దీంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆఫీస్ సిబ్బందితో గొడవలకు దిగుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తిలో టౌన్ ప్లానింగ్ అధికారులది కీలక పాత్ర కాగా, ఇక్కడున్న ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిణి సెలవులో ఉన్నారు. మరో అధికారి వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతోపాటు సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.