అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగిపోతుంది.  జనవరి 22న అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  అయోధ్యను రామజన్మభూమిగా పురాణాలు చెబుతున్నాయి.  అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు.. అయోధ్యలో ఇక్ష్వాకుల పాలన ఎంతకాలం జరిగిందో తెలుసుకుందాం.. . .

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.  అయోధ్యలోని రామాలయం, రామ్ కి పైడి, హనుమాన్ గర్హి, నాగేశ్వర్ నాథ్ ఆలయం మొదలైన వాటికి కూడా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం  అయోధ్య నగరాన్ని ఎప్పుడు, ఎవరు స్థాపించారో తెలుసుకుందాం.  .

త్రేతా యుగంలో మానవుడిగా పుట్టిన శ్రీరాముడు   దేవుడిగా పూజలను అందుకుంటున్నాడు. రాముడు జన్మించిన అయోధ్య హిందువులకు పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయోధ్య ఒక పురాతన నగరం. రాముడు జన్మించిన నగరం కాబట్టి ఇది మతపరమైన నగరంగా కూడా పరిగణించబడుతుంది. శ్రీ రామునిపై భక్తీ విశ్వాసం ఉన్నవారికి అయోధ్య అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రం. 

పురాణ గ్రంథాల ప్రకారం అయోధ్య నగరాన్ని వివస్వాన్ (సూర్యుడు) కుమారుడు వైవస్వత మనుచే స్థాపించబడింది. త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ దేవుడి కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు వివస్వాన్ .. వివస్వాన్ కుమారుడు వైవస్వత మనువు. వైవస్వత మనువు క్రీ.పూ.6673లో జన్మించాడని నమ్మకం.

అయోధ్య ప్రాచీన చరిత్ర

హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ప్రకారం అయోధ్య సూర్యుని కుమారుడు వైవస్వత మనుచే స్థాపించబడింది. వైవస్వత మనువు భార్య శ్రద్ధ.. ఈ దంపతులు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేసే సమయంలో చేసిన పొరపాటుతో ఇల అనే కుమార్తె.. 9 మంది కుమారులు జన్మించారు. వీరు ఇక్ష్వాకుడు, శిబి, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. వశిష్ఠుని వరం వలన ఇల కుమారుడు సుద్యుమ్నుడు మారి ప్రభువయ్యాడు. దీంతో వైవస్వత మనువుకు 10 మంది కుమారులుగా పురాణాలు పేర్కొన్నాయి. అయితే ఈ కుమారుల్లో ఇక్ష్వాకు వంశం విస్తరించింది. 
మనువు కుమారుడు ఇక్ష్వాకుడు అయోధ్యను పాలించడం ప్రారంభించాడు. ఇక్షాకుల వంశంలో దశరథుడు అయోధ్యకు 63వ రాజు. దశరధుడి తనయులు శ్రీ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయోధ్యను దశరధుడు తర్వాత శ్రీరాముడి పాలించాడు. శ్రీ రాముని కుమారుడు కుశ అయోధ్యను పునర్నిర్మించాడు, అందుకే అయోధ్య చరిత్ర మత, సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది.

అయోధ్య జైన పుణ్యక్షేత్రం కూడా...

జైనమతానికి సంబంధించిన ప్రజలకు అయోధ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జైనమతం ప్రకారం, 24 తీర్థంకరులలో, 5 తీర్థంకరులు అయోధ్యలో జన్మించారు. మొదటి తీర్థంకరుడు రిషభదేవ్, రెండవ అజిత్‌నాథ్, నాల్గవ అభినందన్ నాథ్, ఐదవ సుమతీనాథ్ తో పాటు 14వ తీర్థంకరుడు అనంతనాథ్ అయోధ్యలో జన్మించారని నమ్ముతారు.