కార్తీకం’లో రాజన్నకు కాసులపంట
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీకమాసంలో భారీ ఆదాయం సమకూరింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. కార్తీక మాసం మొదలైన నవంబర్ 1 నుంచి చివరిరోజైన 30 వరకు ఆలయానికి రూ. 6,83,58,000 ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ. 1.50 కోట్లు, కోడె మొక్కుల ద్వారా రూ. 1.65 కోట్లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 1.73 కోట్లు, రుద్రాభిషేకం టికెట్ల ద్వారా రూ. 24.18 లక్షలు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 63.53 లక్షలు, కల్యాణం టికెట్స్‌తో రూ. 39.60 లక్షలు, ఇతర సేవా టికెట్ల అమ్మకంతో రూ. 66.73 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. రెండు రోజుల్లో మరోసారి హుండీలను లెక్కిస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు తెలిపారు.
స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు, ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి మూడు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. మరో వైపు స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో సోమవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించారు.