శివనామస్మరణతో మార్మోగిన వేములవాడ

ఓం నమ: శివాయ, హరహర మహదేవ శంభో శంకరా.. నామస్మరణతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.చలిని లెక్క చేయకుండా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత దర్శనం కోసం 6 గంటల సమయం పట్టగా, బ్రేక్​ దర్శనం కోసం గంటకు పైగా సమయం పట్టింది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఈవో వినోద్​ రెడ్డి తెలిపారు.