కోమటిరెడ్డి బ్రదర్స్..సామాజిక సేవకు బ్రాండ్ అంబాసిడర్స్ : వేముల వీరేశం

  • ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : సామాజిక సేవకు కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేదలు, విద్యార్థులకు సాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.

ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతోపాటు ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందించడంలో వారిది గొప్ప వ్యక్తిత్వమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం.. 

నకిరేకల్, వెలుగు : తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విద్యాదినోత్సవ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో మేకల నాగయ్య, మున్సిపల్ చైర్మన్ రజితాశ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు రాములు, టీచర్లు  పాల్గొన్నారు.