అక్కినేని తెలుగు వారి వెలుగు

  • సెప్టెంబర్ 20వ తేదీ అక్కినేని శత జయంతి సందర్భంగా..

తెలుగు సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చే కొన్ని పేర్లలో అక్కినేని నటించిన కొన్ని చిత్రాల పేర్లు గానీ.. కొన్ని చిత్రాల్లో అక్కినేని పాత్రల పేరు గాని అలవోకగా మదిలో మెదులుతాయి. అందుకే దక్షిణ భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి కళాకారుడు అయ్యారు. తెలుగు వెండితెర మీద పెట్టిన నిలువెత్తు సంతకం తన నట జీవితం. ఎంత వద్దు అనుకున్నా కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. బహుశా పోలిక అనే పురుగు మెదడును తొలవడం వల్ల కావచ్చు. 

అందరికంటే ముందే.. 

చదువు సంధ్యల్లో కానీ.. స్ఫురద్రూపాల్లో కానీ.. గంభీరమైన వాక్ప్రవాహాల్లో కానీ.. చుట్టూ నందమూరి తారక రామారావు, ఎస్. వి రంగారావు, కొంగర జగ్గయ్య లాంటి వారున్నా అక్కినేని వీరందరికంటే ముందుగా చిత్ర సీమలో ప్రవేశించి, వారందరి తర్వాత కూడా చిత్రసీమలో అత్యున్నత స్థితిలో రాణించారు. 
నిరంతర శ్రమ, తనను తాను మెరుగు పరుచుకోవటం, ఎక్కడ నెగ్గాలో - ఎక్కడ తగ్గాలో, ఏ వయసు పాత్రలు ఎప్పుడు ధరించాలో తెలియడంతో పాటు ఆంగిక, వాచకాలపై శ్రద్ధ, పాత్రలను సహనటులకు అనువుగా తీర్చిదిద్దుకోవడం అందుకు కారణం.

చాణక్య చంద్రగుప్త చిత్రంలో ఎన్టీ రామారావుతో కలిసి నటిస్తున్నప్పుడు చాణక్య పాత్రలో కొద్దిగా శరీరాకృతిని మార్చుకుని, నిండైన చంద్రగుప్త పాత్రలో ఎన్టీఆర్ పక్కన నటించి శహభాష్ అనిపించుకోవటం కేవలం నటనా పరంగానే కాకుండా నట చాతుర్యం, పాత్రల దేహౌచిత్యం విషయంలో కూడా అక్కినేని శ్రద్ధ తెలుస్తుంది.

అన్ని పాత్రలు.. 

చిత్ర సీమ అంటే ఎవరెన్ని చెప్పినా అంతిమంగా వ్యాపారం. కానీ, అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కొన్ని విషయాలు ఆయన చుట్టూనే పరిభ్రమించాయి దేవదాసు వంటి భగ్న ప్రేమికుల పాత్రలు, భక్తతుకారం వంటి భక్తుల పాత్రలు, అమరశిల్పి జక్కన్న వంటి కొన్ని ప్రత్యేక చారిత్రక పాత్రలు, సెక్రటరీ వంటి నవలా నాయకుల పాత్రలు, విషాదాంత పాత్రలు కేవలం అక్కినేని చుట్టూనే తిరిగాయన్నది జగద్విదితం.

దశాబ్దాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎందరో మహానటులు వచ్చినా.. అటు దర్శక నిర్మాతలు కానీ, ఇటు ప్రేక్షకులు గాని ఆయా ప్రత్యేకమైన పాత్రలకు ఏఎన్నార్​ని తప్ప వేరేవారిని ఊహించుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ప్రతి పాత్రకు ప్రత్యేక శ్రద్ధ, పాత్ర పోషణలో నవ్యత అక్కినేనిని మాత్రమే అవి వరించడానికి కారణమయ్యాయి. దీనికి ఇంకో కారణం అక్కినేని విజ్ఞత. 

సీతారామ జననంలో శ్రీరాముని పాత్ర ధరించిన ఆయన ఎన్టీఆర్​ శ్రీకృష్ణ, శ్రీరామ పాత్రలు ధరించిన తర్వాత, తనకి శ్రీ కృష్ణార్జున యుద్ధం, సంపూర్ణ రామాయణాల్లో కృష్ణ పాత్రలు ధరించే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. అలాగే నాటకాల్లో తన పాత్రకు తానే పాడుకునే అలవాటు ఉన్న అక్కినేని ... సినిమాల్లో కూడా మొదట తానే పాడుకునేవారు. సీతారామ జననం, పల్నాటి యుద్ధం చిత్రాలలో తనే పాడుకున్నారు. ఘంటసాల సినీ రంగ ప్రవేశం చేసిన పిమ్మట తనంతట తానుగా పాడటం విరమించుకుని ఘంటసాల గారితో తన పాత్రకి పాడించమని చెప్పారు. ఉదాహరణకు.. బాలరాజు చిత్రంలో ‘‘చెలియా కనరావా’’ పాట. 

తగిన పాత్రలతోనే...

ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆ వయసుకు తగ్గ పాత్రలతోనే ప్రేక్షకులను అలరించారు. సీతారామయ్యగారి మనవరాలు, బహుదూరపు బాటసారి, బంగారు కుటుంబం వంటి చిత్రాలు కాలం, వయసు తెచ్చిన ఉత్తమ పరిపక్వతకు నిదర్శనం. తెలుగు చలనచిత్ర సీమను తన స్టెప్పులతో ఉర్రూతలూగించిన అక్కినేని, ఆనాటి కలల రాకుమారుడుగా కూడా అలరించారు. స్టైల్​గా సిగరెట్ కాల్చడం, మత్తెక్కించే చూపులతో కారుకు ఆనుకుని నిలబడటం ఆరోజుల్లో యువతను ఎంతగానో ఆకర్షించేవి. అక్కినేని పంచ కట్టు అప్పటికీ ఇప్పటికీ తెలుగు వారి ప్రత్యేక శైలే.

కావాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళే అక్కినేని వ్యక్తిత్వం తెలుగు చిత్ర సీమను హైదరాబాద్ రప్పిస్తే... ఎన్ని ఒత్తిడిలు వచ్చినా రాజకీయాల్లోకి రాకపోవడం.. వద్దనుకుంటే దాని వంక కన్నెత్తి చూడక పోవటంలో కూడా అంతే నిబద్ధత ఉంది. సాహిత్యాన్ని అవపోసన పట్టాలన్నా, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం అయినా, వైద్యులకి అందనంత చమత్కారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ... జీవితాంతం హేతువాదిగా నిలబడినా.. సడలని పట్టుదలే కారణం. ఆయన సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, వైవిధ్యమైన పాత్రలు ఉన్నాయి. అందుకే సంవత్సరాల తరబడి ఆడిన చిత్రాలు ఉన్నాయి. 

నచ్చిన చిత్రం బాటసారి 

మనందరికీ దేవదాసు నచ్చినా... బాటసారి ఆయనకు నచ్చిన చిత్రం. ఆ చిత్రంలోని పాత్రకు ఆయన చేసిన కృషే అందుకు కారణం. బెంగాలీ బాబును తెలుగువాడిగా మార్చడమే కాకుండా అనంతర కాలంలో ఇప్పటివరకు ఎన్ని భాషల్లో దేవదాసు తీసినా అక్కినేని నటనే అపూర్వం, అద్వితీయం. ఆ చిత్రం కోసం, అందులోని నిర్జీవమైన చూపుల కోసం తిండి మానేశారు. తన నటనాశక్తి అంతా కళ్ళలోకి తెచ్చుకుని భారతీయ చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్నారు. 
ఇప్పటికీ ధైర్యం చేసి ఎవరన్నా తాగుబోతుగా, భగ్న ప్రేమికుడిగా నటించినా అక్కినేనిని ప్రస్తావించకుండా ఉండరు. బహుశా రోల్ మోడల్​కి పరిపూర్ణమైన ఉదాహరణ అంటే ఇదేనేమో.

పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో అక్కినేని అంజలీదేవి విజయవంతమైన జంటగా నటించగా, సాంఘిక చిత్రాల్లో అక్కినేని సావిత్రి పోటా పోటీగా నటించిన పాత్రలు చూడటానికి తెలుగు ప్రేక్షకులకు రెండు కళ్ళూ చాలవు. ఆహ్లాదకరమైన జంటగా వీరిద్దరూ పేరుపొందారు. ఆ తర్వాత అక్కినేని వాణిశ్రీ మంచి నవలా నాయికా, నాయకులుగా పేరుపొందారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు నాగేశ్వరరావు. రంగస్థలం మీద స్త్రీ పాత్రలు ధరించి నాటక సమాజాల్లో పారితోషకం తీసుకొని నటించడం అంటే ఎంతో ప్రతిభా వ్యుత్పత్తులు ఉంటే కానీ సాధ్యం కాదు. 

డైరెక్టర్​ కాలేదు​

ధర్మపత్ని చిత్రంలో వేషం ఇచ్చిన పి పుల్లయ్య, సీతారామ జననం చిత్రంలో అవకాశం ఇచ్చిన ఘంటసాల బలరామయ్య, అక్కినేనిని మళ్లీ మద్రాసు తీసుకువచ్చిన దుక్కిపాటి మధుసూదనరావు, మాయలోకం చిత్రంలో కథానాయకుడిగా తీసుకున్న గూడవల్లి రామబ్రహ్మం.. వీరందరికి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఋణపడి ఉంటారు. సంభాషణ చాతుర్యం, నటనలే కాకుండా ఆహార్యం, దుస్తులు కాలానుగుణమైన నవ్య రీతుల్ని పాత్రలకి ఆపాదించడం, తోటి నటులతో సమన్వయం, నృత్య రీతులు, పాత్రల ఎంపిక అక్కినేని చిరకాలం పాటు వెండితెర మీద ఉజ్వలంగా ప్రకాశించడానికి కారణమయ్యాయి. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన అక్కినేని అనేక చిత్రాలు నిర్మించినప్పటికీ ఏనాడూ దర్శకత్వం చేసిన దాఖలాలు కనిపించవు. 

మంచి వక్త

వ్యక్తిగా అనేక విషయాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్న అక్కినేని మంచి వక్త. సందర్భోచితంగా మాట్లాడటం మాత్రమే కాదు, చమక్కులు, చురకలు వేయడంలో కూడా దిట్ట. సినిమాలు తగ్గించుకున్న తరువాత అనేక సభల్లో పాల్గొనేవారు. సాధికారతతో ప్రసంగించేవారు. రచయితగా తన ఆలోచనలను, నట జీవితాన్ని, తన దర్శకులతో అనుభవాలను అక్షరీకరించారు. తన చిత్రాల్లో కథ, సంగీతం పట్ల ఎనలేని శ్రద్ధ తీసుకున్నారు. ఆయన చిత్రాల్లోని దాదాపు పాటలన్నీ మ్యూజికల్ హిట్స్​గా తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతునే ఉంటాయి.

1941 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు సుదీర్ఘ కాలం పాటు నటించినవారు తెలుగులోనే కాదు ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు. 41 మళ్ళీ14 అయ్యే వరకు ఆయన నటిస్తూనే ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు నటించే అవకాశం బహుశా భవిష్యత్తులో కూడా ఎవరికీ దక్కదేమో! పైగా ప్రధాన పాత్రల్లో అసంభవం కూడా కావచ్చు! అక్కినేని నాగేశ్వరరావు గారికి నచ్చిన మాటల్లో చెప్పాలంటే ‘‘ఏదీ తనంత తానుగా సాధ్యపడదు లెమ్ము.. నరుడు నరుడవుట యెంతో దుష్కరము సుమ్ము’’. 

అక్కినేని అలుపెరుగని బాటసారి. 
తెలుగు ప్రేక్షకుల అమరజీవి.
శత జయంతి సందర్భంగా ఆ మహానటునికి నివాళులు అర్పిస్తూ ... 
అక్కినేని తేట తేట తెలుగు ... తెలుగు వారి వెండితెర వెలుగు.


జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||

ఓ శాతవాహనుల రాజ్యం
ఓ తిరుపతి వెంకన్న
ఓ బతుకమ్మ
ఓ సంక్రాంతి ముగ్గు
ఓ సకినం
ఓ పూత రేకు
ఓ అక్కినేని నాగేశ్వరరావు.. ఇవన్నీ తెలుగు వారికి ప్రతీకలు.

మూడు పురస్కారాలు

భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి పద్మశ్రీ, పద్మభూషణ్ , పద్మ విభూషణ్ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన అరుదైన నటుడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి “రఘుపతి వెంకయ్య అవార్డు”, తమిళనాడు ప్రభుత్వం నుంచి “అన్న అవార్డు” పొందారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి “ కాళిదాస కౌస్తుభ’ బిరుదుతో సత్కరించింది. మేఘసందేశం, బంగారు కుటుంబం తదితర చిత్రాల్లోని నటనాప్రతిభకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు పొందారు. 


అడవి రాజబాబు, అనౌన్సర్, ఆకాశవాణి