పబ్లిక్​కు కూరగాయాలే.. వనపర్తి జిల్లాలో వెజిటెబుల్​ సాగు అంతంతే

  •  500 ఎకరాలకు మించని సాగు విస్తీర్ణం
  •  ప్రతి రోజు బయటి రాష్ట్రాల నుంచి 180 టన్నులు రాక
  •  పక్క జిల్లాలతో పోల్చితే రేట్లు 20 శాతం ఎక్కువ

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో కూరగాయల సాగు 500 ఎకరాలను దాటకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి టన్నుల కొద్దీ వెజిటెబుల్స్​ సాగు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో పక్క జిల్లాలతో పోల్చుకుంటే వనపర్తి జిల్లాలో కూరగాయల రేట్లు 20 శాతం ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో కూరగాయల సాగును ప్రభుత్వ, అధికారులు ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.  ఒక వ్యక్తి రోజుకు 363 గ్రాముల కూరగాయలు తీసుకుంటే వాటి నుంచి పోషకాలు, పీచుపదార్థాలు, విటమిన్లు, మాంసకృత్తులు అంది ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు.  

అయితే జిల్లా ప్రజలకు అవసరమైన కూరగాయలు జిల్లాలో పండించకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వాటిని తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ, కూరగాయల సాగు మాత్రం 500 ఎకరాలు దాటడం లేదు. అన్నిరకాల కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి రావడంతో కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చుంటున్నాయి.

ఏ కూరగాయ కొందామన్నా  కిలో రూ.80కి తక్కువగా లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయల జోలికి వెళ్లేందుకే ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్లినప్పుడు ఇతర వస్తువులతో పాటు కూరగాయలు కూడా తెచ్చుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కురిసిన వానలకు టమాటాతో పాటు ఇతర పంటలు దెబ్బ తినడంతో అన్ని రకాలు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 

పక్క రాష్ట్రాల మీదే ఆధారం..    

వనపర్తికి రోజుకు 180 మెట్రిక్​ టన్నుల కూరగాయలు బయటి రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఏపీలోని మదనపల్లి నుంచి టమాటా, కర్నాటకలోని చిక్కబళ్లాపుర, కోలార్​ తదితర ప్రాంతాల నుంచి క్యాప్సికం, బీన్స్, క్యారెట్, క్యాబేజి, కాకరకాయ తెప్పిస్తున్నారు. జిల్లా రైతులు వివిధ కారణాలతో వెజిటెబుల్స్​ సాగుకు ముందుకు రావడంలేదు. కనీసం బిందు సేద్యం పరికరాలు సబ్సిడీపై ఇస్తే విజిటెబుల్స్​ సాగుకు రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు కనీస స్థాయిలో కూడా లేకపోవడంతో జిల్లా ప్రజలు బయటి రాష్ట్రాలపై ఆధారపడాల్సి 
వస్తోంది.

ప్రోత్సాహం లేకనే..

కూరగాయలు పండించడానికి గతంలో రైతులకు గవర్నమెంట్​ ప్రోత్సాహకాలు ఇచ్చేది. పదేండ్లుగా  గవర్నమెంట్​ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. జిల్లాలో గ్రౌండ్  వాటర్​ పెరిగినా సరైన ప్రోత్సాహం లేక రైతులు పండించడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకనైనా ప్రభుత్వం, అధికారయంత్రాంగం జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

తోటల వైపు  మొగ్గు చూపడంతోనే..

జిల్లాలోని రైతులు ఎక్కువగా తోటల పెంపకంపై మక్కువ చూపుతున్నందున కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంలేదు.  కూరగాయలు సాగు చేసినా ఒక గుంట, రెండు గుంటలకే పరిమితమవుతున్నారు. సమీపంలోని కర్నూల్​ నుంచి తక్కువ ధరకు వచ్చే కూరగాయలను తెచ్చి అమ్ముతున్నారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.


- సురేశ్, హార్టికల్చర్​ ఆఫీసర్, వనపర్తి