కూరగాయల సాగుకు ప్రోత్సాహం కరవు

  •     కామారెడ్డి జిల్లాలో 3 వేల ఎకరాల్లోనే కూరగాయల సాగు..
  •     సబ్సిడీలు అందిస్తే మేలంటున్న రైతాంగం 
  •     విపరీతంగా పెరిగిపోయిన కూరగాయల ధరలు 
  •     కొనలేక ఇబ్బంది పడుతున్న సామాన్య జనం    

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో కూరగాయల సాగు రోజు రోజుకు తగ్గిపోతుంది. జిల్లా వ్యాప్తంగా కేవలం 3 వేల ఎకరాల్లోనే కూరగాయలు పండిస్తుండగా.. అవసరాలకు సరిపడా దిగుబడి రావడం లేదు. దీంతో వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు ధరల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

కామారెడ్డి జిల్లాలో5 లక్ష ల 40  వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా..  2 వేల నుంచి 3 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయల ను పండిస్తున్నారు. కామారెడ్డి, రాజంపేట, భిక్కనూరు, సదాశివనగర్​, తాడ్వాయి మండలాల్లోని  కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు తమ అవసరాల కోసం మాత్రమే కూరగాయల సాగు చేస్తుండగా.. కొద్ది మంది మాత్రమే అమ్మకాల కోసం సాగు చేస్తున్నారు.  ప్రధానంగా టమాట, బెండ, బీర, చిక్కుడు, క్యాబేజీ, వంకాయ, ఆకుకూరలు సాగు చేస్తున్నారు.  టమాట, ఆలు, దొండ,  క్యాప్సికం, క్యాలీఫ్లవర్​, పచ్చిమిర్చి, క్యారేట్, బీట్​రూట్​, ఉల్లి గడ్డ ఇతర ఏరియాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  

ఈ ప్రాంతంలో సాగయ్యే టమాట ఇక్కడి అవసరాలను 30 నుంచి 40 శాతం కూడా తీర్చటం లేదు.  ఆంధ్రప్రదేశ్​లోని మదనపల్లి , ఇతర ఏరియాల నుంచి టమాటను దిగుమతి చేసుకుంటున్నారు.  ఆలుగడ్డ, ఉల్లి మహారాష్ర్ట నుంచి వస్తోంది.  మిగతా కూరగాయలు ఇతర ఏరియాల నుంచి వస్తున్నాయి.  కొన్ని సీజన్లలో టమాట, పచ్చిమిర్చి  దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో  దూర ప్రాంతాల నుంచి తీసుకు వస్తుండటంతో రవాణా చార్జీల భారం పడి  ధరలు పెరుగుతున్నాయి. 
 
సాగుదారులకు ప్రోత్సాహకాలు లేక.. 

కూరగాయలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహాకాలు లేక డీలా పడుతున్నారు.  కూరగాయలను సాగు చేసే రైతులకు గతంలో అనేక రకాలు ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు ఇచ్చేవి.  హార్టికల్చర్​ ద్వారా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు, బుట్టలు, డ్రిప్, నెట్స్ లాంటివి ఇచ్చేవారు.  పందిళ్ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ ఉండేది.   బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు క్రమంగా వీటన్నింటినీ
బంద్ చేసింది.  

ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణాలు

ప్రస్తుతం మార్కెట్లో  కూరగాయలు భారీగా పెరిగాయి. కామారెడ్డి మార్కెట్లో కిలో టమాట రూ.80, పచ్చిమిర్చి రూ.100, బీర కాయ రూ.70, దొండ రూ. 70, ఆలుగడ్డ రూ. 40,  బెండ రూ. 40, ఆకు కూరలు రూ.40 ఉన్నాయి.   ఎక్కువగా టమాట, పచ్చిమిర్చి వినియోగిస్తారు. వీటి ధరలు ఏ మాత్రం కొనలేని స్థితిలో ఉన్నాయి.  ఈ ధరలు పెరుగుదలకు ప్రధానంగా సాగు విస్తీర్ణం లేకపోవటం, గత వేసవిలో అకాల వర్షంతో చాలా ఏరియాల్లో  కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.  ప్రధానంగా టమాట పంటకు ఎక్కువ నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

సబ్సిడీలతో పాటు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి 

కూరగాయలు సాగు చేసే రైతులకు ఎలాంటి సబ్సిడీలు అందడం లేవు.  విత్తనాలు, డ్రిప్ సబ్సిడీపై గతంలో ఇచ్చేవారు. దీన్ని తొలగించారు.  మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయనే ఒక సీజన్లో అందరు రైతులు టమాట సాగు చేయగానే ధర పతనమవుతుంది.  మార్కెటింగ్​ సౌకర్యాలు కల్పించాలి.  కూరగాయలను సాగు చేసే రైతులకు ప్రోత్సహకాలు అందించాలి. 
- బాల్​రాజు, రైతు, కామారెడ్డి