తెలంగాణ కిచెన్ : ఈ గోల్డ్​ కాయిన్స్​ను టేస్టీగా తినేయొచ్చు!

బంగారం రేటు పెరిగిందా? తగ్గిందా? అనే దాంతో సంబంధం లేకుండా ఈ గోల్డ్​ కాయిన్స్​ను టేస్టీగా తినేయొచ్చు! వీటిలో కూడా వెజిటేరియన్​, నాన్​–వెజిటేరియన్​లకు వేరువేరుగా బోలెడు రుచులు ఉన్నాయి. వాటిలో కొన్ని రుచులను ఇక్కడ ఇస్తున్నాం. నచ్చిన గోల్డ్​ కాయిన్స్​ వండుకుని తినడమే తరువాయి.

ఎగ్ గోల్డ్ కాయిన్

కావాల్సినవి :

కోడిగుడ్లు - మూడు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
ఎండు మిర్చి తునకలు - అర టీస్పూన్
సోయాసాస్ - ఒక టేబుల్ స్పూన్
కార్న్​ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు - రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు, ఉప్పు - సరిపడా

తయారీ : కోడిగుడ్లను పన్నెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత కోడిగుడ్ల పెంకు తీసేయాలి. కోడిగుడ్డును గుండ్రటి ముక్కలుగా తరగాలి. పచ్చసొన బయటకు రాకుండా ఆముక్కల్ని కార్న్ ఫ్లోర్​లో దొర్లించాలి. అవసరం అనుకుంటే కొంచెం ఎక్కువ కార్న్​ ఫ్లోర్ వాడుకోవచ్చు. నూనె వేడి చేసి వీటిని వేగించాలి. కోడిగుడ్డు ముక్కలు వేగుతున్నప్పుడే ఎండుమిర్చి తునకలు, అల్లం, వెల్లుల్లి తరుగు, సోయాసాస్  వేయాలి. వేగించడం పూర్తయ్యాక పైనుంచి ఉల్లికాడల తరుగు చల్లాలి. 

వెజ్ గోల్డ్ కాయిన్

కావాల్సినవి :

ఆలుగడ్డలు - రెండు,
 క్యారెట్, ఉల్లిగడ్డ - ఒక్కోటి, 
పచ్చిమిర్చి - రెండు
క్యాప్సికమ్​ - చిన్నది ఒకటి
ఒరెగానో, సోయా సాస్ - ఒక్కో టీస్పూన్
రెడ్ చిల్లీ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు
కార్న్​ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
బ్రెడ్ స్లయిస్​లు, నువ్వులు, ఉప్పు, నీళ్లు, నూనె - సరిపడా

తయారీ : ఆలుగడ్డలు ఉడికించి, తొక్క తీసి మెదపాలి. దాన్ని ఒక గిన్నెలో వేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు వేయాలి. క్యారెట్​ తురిమి, నీళ్లు పిండేసి అందులో వేయాలి. తరువాత ఒరెగానో, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్ ముక్కల్ని గ్లాసు సాయంతో గుండ్రంగా కట్ చేసి ఒక్కో దానిపై ఈ మిశ్రమం పెట్టాలి. ఒక చిన్న గిన్నెలో కార్న్​ ఫ్లోర్ వేయాలి. అందులో నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని స్పూన్​తో బ్రెడ్ మీద రాసి పైన నువ్వులు చల్లాలి. నూనె వేడి చేసి అందులో తయారుచేసుకున్న బ్రెడ్​ ముక్కలు వేగించాలి. కెచెప్​తో తింటే ఇవి టేస్టీగా ఉంటాయి.

చికెన్ గోల్డ్ కాయిన్

కావాల్సినవి :

చికెన్ ఖీమా - 200 గ్రాములు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
ఉప్పు, నూనె - సరిపడా
కశ్మీరీ కారం - ఒక టీస్పూన్
బ్రెడ్ స్లయిస్​లు - ఏడు
వెన్న - ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ - ఒకటి
మైదా - ఒక టేబుల్ స్పూన్
పాలు, మొజరెల్లా చీజ్ - అర కప్పు
నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - కొంచెం
కోడిగుడ్డు - ఒకటి
నువ్వులు - ఒక టేబుల్ స్పూన్

తయారీ : ఒక గిన్నెలో చికెన్ ఖీమా, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కశ్మీరీ కారం వేసి బాగా కలిపి అరగంట  పక్కన పెట్టాలి.  నూనె వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్​లో మరోసారి నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అవి వేగాక మైదా వేసి కలపాలి. తర్వాత పాలుపోసి, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి కలపాలి. మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక చికెన్ ఖీమా  వేసి కలపాలి. రెడీ అయిన ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి పనీర్, చీజ్, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. గుండ్రంగా కట్ చేసిన బ్రెడ్​ మీద ఈ స్టఫింగ్​ పెట్టాలి. మరో బ్రెడ్​ ముక్కను కార్న్​ఫ్లోర్​ కలిపిన నీళ్లలో ముంచి స్టఫింగ్​ పెట్టిన బ్రెడ్​మీద పెట్టి మూసేయాలి. తర్వాత పాలు, కోడిగుడ్డు సొన కలిపిన మిశ్రమంలో ముంచాలి. ఒకవైపు బ్రెడ్​ పొడి, మరో వైపు నువ్వులు అద్దాలి. వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వీటిని నేరుగా తినొచ్చు లేదా కెచెప్​లో అద్దుకుని కూడా తినొచ్చు.

పిజ్జా గోల్డ్ కాయిన్

కావాల్సినవి :

బ్రెడ్ స్లయిస్​లు - సరిపడా
ఆలుగడ్డలు - మూడు (ఉడికించి, పొట్టు తీయాలి.)
ఉల్లిగడ్డ, టొమాటో - ఒక్కోటి
క్యాప్సికమ్ - చిన్నది ఒకటి
మొక్కజొన్నలు, పనీర్ - ఒక్కోటి నాలుగు టేబుల్ స్పూన్లు
పిజ్జా చీజ్ - మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు, మయోనీస్ - సరిపడా
ఒరెగానో - రెండు టీస్పూన్లు
ఎండు మిర్చి తునకలు - ఒకటిన్నర టీస్పూన్
నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
టొమాటో కెచెప్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
మైదా - మూడు టేబుల్ స్పూన్లు
కార్న్​ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్

తయారీ : ఉడికించిన ఆలుగడ్డల్ని ఒక గిన్నెలో వేసి మెదపాలి. అందులో ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, టొమాటో తరుగు వేయాలి. అందులోనే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, ఒరెగానో, ఎండు మిర్చి తునకలు, నల్ల మిరియాల పొడి, పనీర్​, చీజ్, కొత్తిమీర, టొమాటో కెచెప్ కూడా వేసి బాగా కలపాలి.  
ఒక గిన్నెలో మైదా, కార్న్​ ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. అందులో నీళ్లు పోసి దోశె పిండిలా జారుగా చేయాలి. బ్రెడ్​ని గుండ్రంగా కట్ చేసి దానిపై మయోనీస్, టొమాటో కెచెప్ రాయాలి. తర్వాత రెడీ చేసిన పిజ్జా స్టఫ్​ని బ్రెడ్​ ముక్కల మీద పెట్టాలి. ఆ తర్వాత మైదా మిశ్రమం దానిమీద పూయాలి. అన్ని బ్రెడ్​ ముక్కల్ని అలా చేశాక వేడి వేడి నూనెలో వేగించాలి.

మష్రూమ్​ గోల్డ్ కాయిన్

కావాల్సినవి :

పుట్టగొడుగులు - 200 గ్రాములు
బ్రెడ్ స్లయిస్​లు - ఐదు
నూనె, ఉప్పు - సరిపడా
పచ్చిమిర్చి - రెండు
ఉల్లికాడలు - కొన్ని
టొమాటో కెచెప్ - ఒక టేబుల్ స్పూన్
మైదా - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొంచెం
కోడిగుడ్డు - ఒకటి
కార్న్​ ఫ్లోర్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టేబుల్ స్పూన్

తయారీ : నూనె వేడి చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. అందులో పుట్టగొడుగులు కూడా వేగించాలి. తర్వాత ఉప్పు, ఉల్లికాడలు వేసి కలపాలి. టొమాటో కెచెప్, పుదీనా వేయాలి. ఆ తర్వాత మైదా వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లాలి. కోడిగుడ్డు సొనని ఒక చిన్న గిన్నెలో కార్చి అందులో కార్న్​ ఫ్లోర్ వేసి కలపాలి.  బ్రెడ్​ని గుండ్రటి ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కల మీద కోడిగుడ్డు మిశ్రమం పూయాలి. దానిపైన పుట్టగొడుగుల మిశ్రమం పరవాలి. చివరగా మరోసారి కోడిగుడ్డు సొన పూసి వేడి నూనెలో వేగించాలి.