Vastu Tips : ఇల్లు కట్టడం మధ్యలో ఆపొచ్చా.. ఈ చెట్లు పెంచకోకూడదా..!

ఈ చెట్లు పెంచుకోకూడదా? 

మా ఇంటికి ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలంలో గులాబీ చెట్లు, బొప్పాయి చెట్లు పెంచుకుంటున్నాం. కొందరు ముళ్లచెట్లు, పాలుకారే చెట్లు ఇంటిదగ్గర ఉండకూడదని అంటున్నారు. పెంచుకునే చెట్లకు, ఇంటి వాస్తుకు సంబంధం ఉంటుందా?
శేఖర్, ఆర్మూరు

ముళ్లచెట్లు, పాలుగారే చెట్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని వద్దంటారు. గులాబీ చెట్లకు ముళ్లుంటాయి కాబట్టి పిల్లలకు గుచ్చుకుంటాయి. బొప్పాయి చెట్లకు పాలుగారడమే కాదు, పిల్లలు ఆడుకుంటూ వాటిని ఎక్కితే విరుగుతాయి. అందుకే పెద్దవాళ్ళు వద్దంటారు. వాస్తు ప్రకారం ఇంటికి, పెంచుకునే చెట్లకు ఎలాంటి సంబంధం లేదు.

వంటిల్లు ఎక్కడ కట్టుకోవాలి?

మా ఇంటికి తూర్పు వాకిలి. తూర్పు, ఉత్తరం దిక్కుల్లో రోడ్లు ఉన్నాయి. దక్షిణం దిక్కులో ఉన్న ఖాళీస్థలంలో చుట్టిల్లు కట్టుకున్నాం. అక్కడ వంట చేసుకునే వాళ్లం. ఆ ఇల్లు పడిపోయింది. ఆ స్థలాన్ని ఎలా వాడుకుంటే మంచిది?
-వెంకటేష్, నకిరేకల్ 

స్థలానికి తూర్పు, ఉత్తరం ఖాళీ ఉంటే మంచిది. దక్షిణం వైపు ఎక్కువగా ఉండ కూడదు. దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని విడగొట్టి, ఇంటి స్థలానికి దానికి మధ్య గోడ లేదా కంచె కట్టండి. ఎట్లాగూ వంటిల్లు పడిపోయింది. కాబట్టి, దక్షిణ ఆగ్నేయంలో కొత్తగా వంటిల్లు కట్టుకోవచ్చు. వద్దనుకుంటే ఆ స్థలంలో మొక్కలు పెంచుకోవచ్చు.

ఆ బోరు నీళ్లు వాడుకోవచ్చు

మాకు 200 గజాల స్థలం ఉంది. ఉత్తరం దిక్కున పది గజాలు రోడ్డు కోసం వదలాల్సి వచ్చింది. బోరు ఆ స్థలంలో ఉంది. ఆ నీళ్లే వాడుకుంటున్నాం. ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కొత్త బోరు వేయించుకోవాల్సిన అవసరం ఉందా?
-ఉదయశంకర్, మల్కాజిగిరి 

రోడ్డు కోసం వదిలిన స్థలంలో బోరు ఉన్నా, సమస్యలు రావు. ఆ బోరు నీళ్లు ఎప్పట్లాగే వాడుకోవచ్చు. వాస్తు ప్రకారం మీ ఇంటికి, రోడ్డు స్థలంలో ఉన్న బోరుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే.. అది పూర్తిగా ప్రభుత్వ స్థలం కాబట్టి. మీరు కొత్తగా బోరు వేయించుకోవాలనుకుంటే ఉత్తర ఈశాన్యంలో వేయించుకుంటే మంచిది.

ఇల్లు కట్టడం మధ్యలో ఆపొచ్చా?

ఇల్లు కడదామని పిల్లర్లు వేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతటితోనే ఆపేయాల్సి వచ్చింది. ఏడాది గడిచింది. కొందరు అలా ఆపొద్దు, స్లాబ్ వెయ్యమని సలహా ఇస్తున్నారు. ఇల్లు మధ్యలో ఆపడం వల్ల ఇబ్బందులొస్తాయా?
- నర్సింగ్, మంచిర్యాల

ఇల్లు కట్టడం మధ్యలో ఆపడం వల్ల ఇంట్లో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావు. నష్టం జరగదు. వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ సరిగా లేకపోయినా కూడా మధ్యలో ఆగిపోవచ్చు. ఇంట్లో వాళ్లకు సమస్యలూ రావచ్చు. కాబట్టి మీకు దగ్గర్లో ఉన్న వాస్తు సిద్ధాంతిని పిలిపించి ఒకసారి ఇంటి ప్లాన్ చూపించండి. ఏమైనా మార్పులు ఉంటే చేయించండి.

వాస్తు సిరి
కాశీనాథుని శ్రీనివాస్,
వాస్తు కన్సల్టెంట్
ఫోన్: 9440088799