హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ( మే 4)వరూథిని ఏకాదశి అంటారు. ఆ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన వరాహ అవతారాన్ని పూజిస్తారు.ఈ ఏడాది (2024) వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం.. పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ప్రతి సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ప్రతి నెలలోనూ శుక్ల పక్షంలో ఓ ఏకాదశి.. క్రిష్ణ పక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఇలా వచ్చే ఏకాదశుల్లో ప్రతి ఒక్క దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో చైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి వరూథిని ఏకాదశి ( మే 4) అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు వరాహ రూపాన్ని పూజిస్తారు. అంతేకాదు ఈరోజున దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
ఈ ఏడాది వరూథిని ఏకాదశి వ్రతం మే4 శనివారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైద్రి యోగంతో వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది. వరూథిని ఏకాదశి రోజున విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు.ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ జీవితంలోని సకల పాపాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు తమకు అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
వరూథిని ఏకాదశి శుభ ముహుర్తం..
- ఏకాదశి తిథి ప్రారంభం : 2024, మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 11:24 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు : 2024, మే 4వ తేదీ శనివారం రాత్రి 08.28 గంటలకు
హిందూ పంచాంగం ప్రకారం, ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మే4, 2024 శనివారం రోజునే వరుథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
వరూథిని ఏకాదశి పూజా విధానం..
- * వరూథిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి.
- * అనంతరం ఉతికిన దుస్తులను ధరించి, ఇంట్లో ఆలయంలో నెయ్యి, దీపం వెలిగించాలి.
- * శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేసి పూలు, తులసి సమర్పించాలి. ఆ తర్వాత విష్ణువుకు కొత్త వస్త్రాలను సమర్పించాలి. అనంతరం విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించాలి.
- * పూజ చేసే సమయంలో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.
- * ఏకాదశి నాడు తులసిని కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపకూడదు. ఈరోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మాల కూడా ధరించవచ్చు. తులసి మొక్క వేరులోని తడి మట్టిని కొద్దిగా తీసుకుని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు.
- *వరూథిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
- * పూజ సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలి
- * ఏకాదశి రోజు జంతువులు, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
- *వరూథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది.
- *మే 4న ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడని పండితులు చెబుతన్నారు.
- *ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. వైకుంఠ ప్రవేశం లభిస్తుంది.
వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత..
ఈ ఏకాదశి రోజున ( మే 4) ఉపవాసం ఉండటం వల్ల మోక్షప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. భూలోకంలో ఉండే వారికి యమలోక భయాన్ని పోగొట్టుకునేందుకు వరూథిని ఏకాదశి అవసరమని శ్రీ క్రిష్ణుడు యుధిష్టిరునికి వివరించాడు. వరూథిని ఏకాదశి అంటే శుభాలను ప్రసాదించేది.. సర్వ పాపాలను తొలగించేది.. చివరగా మోక్షాన్ని ప్రసాదించేది.. వరూథిని ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వల్ల మాంధాత రాజు స్వర్గానికి చేరుకున్నాడు. ఈ ఏకాదశి ఫలం పదివేల సంవత్సరాల తపస్సుకు సమానమైనదిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున పవిత్ర గంగానదిలో స్నానం చేయడం, ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలొస్తాయని శ్రీక్రిష్ణుడు యుధిష్టిరునికి చెప్పారు.