కిచెన్ తెలంగాణ : ఇమ్యూనిటీ పెంచే శ్నాక్స్!

ఈ చలికాలంలో చీటికీ మాటికీ వచ్చే హెల్త్​ ఇష్యూస్​కి చెక్​ పెట్టాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిందే. అది కూడా శ్నాక్స్​తో. ఇది సాధ్యమేనా? అనుకుంటున్నారా.. నిజమే! శ్నాక్స్.. అనగానే చాలామందికి నూనెతో వేగించినవి, జంక్​ ఫుడ్స్ వంటివి గుర్తొస్తాయి. కానీ, కాస్త పరిశీలిస్తే హెల్దీ శ్నాక్స్ కూడా ఉంటాయి. మరి ఇమ్యూనిటీ పెంచుకునేలా శ్నాక్స్​ ఏమున్నాయంటే ఇవిగో వీటిపై ఓ లుక్కేయండి.

ఎగ్ - బ్రెడ్ రోల్

కావాల్సినవి :

కోడిగుడ్లు – ఐదు
క్యారెట్, ఉల్లిగడ్డ,క్యాప్సికమ్ తరుగు – ఒక్కోటి పావు కప్పు
పచ్చిమిర్చి – మూడు
కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా
టొమాటో సాస్ – రెండు టేబుల్ స్పూన్లు 
బ్రెడ్​ స్లైస్​లు – పది

తయారీ : నాలుగు కోడిగుడ్లను ఉడికించి, తొక్క తీసి, తురిమి ఒక గిన్నెలో వేయాలి. అందులో రెండు బ్రెడ్ స్లైస్​లను ముక్కలు చేసి వేయాలి. తర్వాత క్యారెట్, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉప్పు, టొమాటో సాస్ వేసి బాగా కలపాలి. మరోవైపు ఒక చిన్న గిన్నెలో కోడిగుడ్డు సొన, ఉప్పు వేసి కలపాలి. బ్రెడ్​ స్లైస్​ని నాలుగు వైపులా చివర్లు కట్​ చేయాలి. ఒకవైపు కోడిగుడ్డు సొన పూయాలి. మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్​ని పెట్టి రోల్​ చేయాలి. ఇలా చేసుకున్న రోల్స్​ని గ్రిల్ పాన్​ మీద నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. ఎంతో టేస్టీ, హెల్దీ రోల్స్​ని కెచప్​తో తింటే బాగుంటాయి.

పీనట్ స్టిక్స్

కావాల్సినవి :

పల్లీలు, బెల్లం – ఒక్కో కప్పు
నువ్వులు – అర కప్పు
కొబ్బరి పొడి – సరిపడా
నీళ్లు – రెండు టీస్పూన్లు

తయారీ : పాన్​లో పల్లీలు, నువ్వులు వేరువేరుగా వేగించి పక్కన పెట్టాలి. పల్లీలు పొట్టు తీసి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అదే పాన్​లో బెల్లం వేసి, నీళ్లు పోసి పాకం వచ్చేవరకు మరిగించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో పల్లీల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత నువ్వులు కూడా వేసి మరోసారి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లో వేయాలి. అది కాస్త వేడిగా ఉండగానే, చేతిని తడుపుకుంటూ మిశ్రమాన్ని స్టిక్స్​లా చేయాలి. తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించాలి. 

ప్రొటీన్  బార్

కావాల్సినవి :

కొబ్బరి పొడి, బాదం, జీడిపప్పు, అవిసె, గుమ్మడి గింజలు  –ఒక్కో కప్పు చొప్పున
కర్జూరలు – మూడు కప్పులు
చియా గింజలు, నువ్వులు, చాకొలెట్ సిరప్ – ఒక్కోటి అర కప్పు
పీనట్ బటర్ – పావు కప్పు

తయారీ : పాన్​లో మొదట బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వేగించాలి. అదే పాన్​లో అవిసె, చియా గింజలు, కొబ్బరి పొడి వేగించి పక్కన పెట్టాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీజార్​లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కర్జూరల్ని మెత్తగా అయ్యేవరకు వేగించాలి. వాటికి కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి దానిపై ఈ మిశ్రమాన్ని సమాంతరంగా పరవాలి. దానిపై చాకొలెట్ సిరప్​ పూయాలి. ఆ ట్రేని నాలుగ్గంటలపాటు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత తీసి చాకుతో కట్​ చేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన ఈ ప్రొటీన్​ బార్స్ పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు.