తెలంగాణ కిచెన్ : బెల్లంతో తియ్యతియ్యగా

బెల్లం ఆరోగ్యానికి మంచిది. అలాగని వట్టి బెల్లాన్ని ఎంతని తినగలరు? అందుకే కదా పాయసం, కొన్ని స్వీట్లు చేసుకుంటాం అంటున్నారా. అవి ఓకే, ఈసారి  బెల్లంతో రొట్టెలు, బోండాలు, గారెలు వంటి రెసిపీలు చేసుకుని తినండి. వెరైటీ టేస్ట్​ నోటికి అందించినట్టు అవుతుంది.

బెల్లం రొట్టె

కావాల్సినవి :

బెల్లం పొడి - అర కప్పు ; 

నీళ్లు - ముప్పావుకప్పు

గోధుమ పిండి - ఒకటింబావు కప్పు

సోంఫు - ఒక టీస్పూన్ 

నెయ్యి - ఒక టేబుల్ స్పూన్

కొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక పాత్రలో నీళ్లు వేడి చేయాలి. అందులో బెల్లం పొడి కరిగించాలి. ఆ తర్వాత దాన్ని అరగంట పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, సోంఫు, నెయ్యి, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. బెల్లం నీళ్లని వడకట్టి అందులో పోయాలి. ఆ తర్వాత అవన్నీ కలిసేలా బాగా కలపాలి. మిశ్రమం సాఫ్ట్​గా అయ్యాక ముద్ద చేయాలి. ఆ ముద్ద నుంచి చిన్న ఉండలు చేయాలి. ఒక కవర్​ మీద నెయ్యి పూసి, దానిపై ఉండని పెట్టి చేత్తో వత్తి చిన్న రొట్టెలా చేయాలి. 
వెంటనే వాటిని పాన్​ మీద వేయాలి. రెండు వైపులా నెయ్యితో కాల్చితే.. టేస్టీ బెల్లం రొట్టె రెడీ. 

గుల్​గులే

కావాల్సినవి : 

ఎర్ర గుమ్మడి పండు గుజ్జు (ఉడికించి, మెదిపి) - ఒకటిన్నర కప్పు

బెల్లం - అర కప్పు

కొబ్బరి తురుము - అర కప్పు

గసగసాలు - రెండు టీస్పూన్లు

యాలకుల పొడి - పావు టీస్పూన్

గోధుమ పిండి - అర కప్పు

 బేకింగ్ సోడా - చిటికెడు

నూనె - వేగించడానికి సరిపడా

తయారీ : గుమ్మడిపండు తొక్క తీసి, ముక్కలుగా తరగాలి. ఆ ముక్కల్ని ఉడికించి మెత్తటి గుజ్జులా చేయాలి. ఒక గిన్నెలో గుమ్మడికాయ గుజ్జు, బెల్లం వేసి బాగా కలపాలి. తర్వాత అందులో గసగసాలు, యాలకుల పొడి, గోధుమ పిండి, బేకింగ్ సోడా, కొబ్బరి తురుము వేసి మరోసారి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో గుమ్మడికాయ మిశ్రమాన్ని బోండాల్లా వేయాలి. అంతే.. గుమ్మడి ఫ్లేవర్​తో చేసిన గుల్​గులే తినడమే.

అప్పమ్

కావాల్సినవి : 

బెల్లం - రెండు కప్పులు  

నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు

 నీళ్లు - అర కప్పు 

ఉప్పు - చిటికెడు

యాలకుల పొడి - అర టీస్పూన్ 

బియ్యప్పిండి - రెండున్నర కప్పులు 

నెయ్యి - ఒక టేబుల్ స్పూన్

తయారీ : ఒక పాన్​లో నీళ్లు పోసి అందులో బెల్లం వేసి కరిగించాలి. తర్వాత ఆ నీళ్లను వడకట్టాలి.  పాకం చిక్కగా అయ్యేవరకు వేడిచేసి అందులో బియ్యప్పిండి, యాలకుల పొడి, ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. మిశ్రమాన్ని బాగా కలిపాక, కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్న ఉండలు చేసి చేతిలో బిస్కెట్​లా వత్తాలి. పాన్​ వేడి చేసి నెయ్యి పూసి, దానిపై అప్పమ్​ వేయాలి. వాటిపై నువ్వులు చల్లి రెండు వైపులా కాల్చాలి. 

మిల్లెట్ పాన్ కేక్

కావాల్సినవి :

రాగి పిండి - అర కప్పు

గోధుమ పిండి - అర కప్పు

పెరుగు - పావు కప్పు

బెల్లం పొడి - పావు కప్పు

బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్బే

కింగ్ సోడా - అర టీస్పూన్

వెనీలా ఎసెన్స్ లేదా సోంఫు లేదా యాలకుల పొడి - అర టీస్పూన్

పాలు - ముప్పావు కప్పు

ఉప్పు - చిటికెడు

తయారీ : ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అందులో పెరుగు, పాలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. కావాలంటే మరికొన్ని పాలు పోయొచ్చు. అందులో వెనీలా ఎసెన్స్ కలపాలి. పాన్ వేడి చేసి మిశ్రమాన్ని దోశలా పోయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చాలి. 

తీపి బోండాలు

కావాల్సినవి :

బెల్లం - ఒకటింబావు కప్పు 

గోధుమ పిండి - రెండుంబావు కప్పులు

బేకింగ్ సోడా - ఒక టీస్పూన్ 

బొంబాయి రవ్వ - రెండు టీస్పూన్లు

నీళ్లు - పావు కప్పు

 పెరుగు - పావు కప్పు

 సోంఫు - ఒక టీస్పూన్

 ఉప్పు - చిటికెడు

తయారీ : ఒక గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోయాలి. ఆ గిన్నెను సన్నటి మంట మీద పెట్టి బెల్లం కరిగించాలి. తర్వాత అరగంట పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో పెరుగు, బేకింగ్ సోడా వేసి కలపాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. ఇష్టపడితేనే బొంబాయి రవ్వ వాడాలి. లేదంటే వాడకపోయినా పర్వాలేదు. అరగంట తర్వాత బెల్లం పాకం ఇందులో పోయాలి. దాంతోపాటు గోధుమ పిండి, ఉప్పు, సోంఫు వేసి బాగా కలపాలి. ఇంకొన్ని నీళ్లు పోస్తూ బోండాలు వేయడానికి వీలుగా పిండిని కలపాలి. మూత పెట్టి అరగంటసేపు పక్కన ఉంచాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. స్పూన్​ని తడి చేసి, దాంతో పిండి తీసుకుని నూనెలో వేయాలి. లేదంటే చేత్తో కూడా వేయొచ్చు. 

పాకం గారెలు

కావాల్సినవి :

బెల్లం -ఒక కప్పు 

నీళ్లు -ఒక కప్పు

 మినపప్పు -ఒక కప్పు

ఉప్పు -ఒక టీస్పూన్  

యాలకుల పొడి -అర టీస్పూన్ 

బేకింగ్ సోడా -పావు టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో మినపప్పు వేసి, నీళ్లు పోసి మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత శుభ్రంగా కడగాలి. మిక్సీజార్​లో మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి, అందులో బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోసి వేడి మీద కరిగించాలి. పాకం దగ్గర పడేటప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. లేత పాకం రెడీ అయ్యాక పాన్​లో నూనె వేడి చేయాలి. ఒక ప్లాస్టిక్​ కవర్​ మీద నూనె పూసి పిండిని పెట్టి గారెలా చేతితో వత్తాలి. వాటిని కాగే నూనెలో వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాక గారెని తీసి వెంటనే వేడిగా ఉన్న బెల్లం పాకంలో వేయాలి. అరగంట తర్వాత వాటిని తినాలి.