తెలంగాణ కిచెన్..వెరైటీ కిచిడీ రెసిపీలు

లంచ్​, డిన్నర్​ కోసం ఒక కూర, వేపుడు, చారు... అంటూ రెండు మూడు రకాల వంటకాలు చేయాలి. అయితే ఇన్ని రకాల వంటకాలు చేసేందుకు టైం, ఓపిక లేకపోతేనే వస్తుంది అసలు తంటా. ఇలాంటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ టైంలో ఈజీగా చేసే వంటకం కిచిడీ. రుచితో పాటు ఆరోగ్యంగా ఉండే వెరైటీ కిచిడీ రెసిపీలు తినాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. వంట ఎంత ఈజీగా రెడీ అవుతుందో... తినడమూ అంతే ఈజీ!  

ఓట్స్​తో...

కావాల్సినవి :

ఓట్స్ -  అర కప్పు 
పెసరపప్పు - పావు కప్పు, నీళ్లు - మూడు కప్పులు 
ఉప్పు - సరిపడా, నెయ్యి - రెండు టీస్పూన్లు 
దాల్చిన చెక్క - చిన్న ముక్క, జీలకర్ర - ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ, క్యారెట్ - ఒక్కోటి, అల్లం - చిన్న ముక్క, 
పచ్చిమిర్చి - రెండు, బీన్స్ తరుగు - అర కప్పు, 
పచ్చి బటానీలు - పావు కప్పు
ఇంగువ - చిటికెడు , పసుపు - పావు టీస్పూన్, 
కారం - అర టీస్పూన్, కొత్తిమీర - కొంచెం

తయారీ : పెసరపప్పుని ఐదు నిమిషాలు నానబెట్టాలి. నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులో అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్​ తరుగు, పచ్చి బటానీలు, ఇంగువ కలపాలి. పసుపు, కారం, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు కలపాలి. తర్వాత ఓట్స్ కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తరువాత నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముప్పావు శాతం ఉడికాక, ఉప్పు వేసి కొత్తిమీర చల్లి మరోసారి కలిపి కాసేపు ఉడికిస్తే... హెల్దీ ఓట్స్​ కిచిడీ తినేయడమే. 

పాలక్, వెల్లుల్లి కిచిడీ

కావాల్సినవి :

పొట్టు పెసరపప్పు, బియ్యం - ఒక్కో కప్పు
పాలకూర - మూడు కప్పులు
నీళ్లు, నూనె, ఉప్పు - సరిపడా
బిర్యానీ ఆకులు, యాలక్కాయలు - రెండేసి చొప్పున
లవంగాలు - మూడు
వెల్లుల్లి తరుగు - ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ, టొమాటో తరుగు - ఒక్కోటి అర కప్పు
పసుపు, గరం మసాలా, కసూరి మేతీ - ఒక్కోటి అర టీస్పూన్
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్
బేకింగ్ సోడా - చిటికెడు
అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - పది
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
దాల్చిన చెక్క - ఒకటి
చక్కెర - పావుటీస్పూన్
పచ్చిమిర్చి - ఐదు
కొత్తిమీర - కొంచెం

తయారీ : పెసరపప్పు, బియ్యాన్ని విడివిడిగా కడిగి విడివిడిగానే రెండు గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు, కొంచెం నూనె వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. మరో గిన్నె​లో నానబెట్టిన బియ్యం, ఉప్పు, నూనె వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ఉడికిన పెసరపప్పులో అన్నం వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నీళ్లు వేడి చేసి పాలకూర తరుగు, బేకింగ్ సోడా, చక్కెర వేసి ఉడికించాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉడికించిన పాలకూర మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత నెయ్యి వేడి చేసి జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులోనే ఉప్పు, ధనియాలపొడి, పసుపు, జీలకర్ర పొడి, కసూరీ మేతీ వేసి, నీళ్లు పోసి గరిటెతో కలపాలి. తరువాత టొమాటో తరుగు, పాలకూర పేస్ట్​ వేసి కలపాలి. చివరిగా ఆ మిశ్రమంలో అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపాక రెండు కప్పుల వేడి నీళ్లు పోయాలి. గరిటెతో ఒకసారి కలిపి మరికాసేపు ఉడికిస్తే పాలక్ కిచిడీ తయారవుతుంది. అలానే లేదా తాలింపు వేసుకుని తినొచ్చు. 

బ్రౌన్ రైస్

కావాల్సినవి :

బ్రౌన్​ బాస్మతి రైస్ - ఒకటింబావు కప్పు
పెసరపప్పు - అర కప్పు
ఉప్పు - సరిపడా
పసుపు - అర టీస్పూన్
నెయ్యి, వెల్లుల్లి పేస్ట్​, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం పేస్ట్ - అర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టొమాటోలు - రెండేసి చొప్పున
కారం - ఒక టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
నీళ్లు - సరిపడా

తయారీ : బ్రౌన్​ బాస్మతి రైస్​ కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. పెసరపప్పు కూడా పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఈ రెండింటిని ప్రెజర్ కుక్కర్​లో వేయాలి. అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి కుక్కర్​ మూత పెట్టాలి. ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నెయ్యి వేడి చేసి జీలకర్ర, అల్లం పేస్ట్​, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు కలపాలి. అవన్నీ వేగాక ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. తర్వాత టొమాటో తరుగు, ఉప్పు కూడా వేసి కలపాలి. అందులో ఉడికించిన బ్రౌన్​ బాస్మతి రైస్, పెసరపప్పు మిశ్రమాన్ని కలపాలి. ముప్పావు కప్పు నీళ్లు పోసి మరోసారి కలిపి మూడు నిమిషాలు ఉడికించాలి. పైనుంచి కొత్తిమీర తరుగు చల్లితే బ్రౌన్​రైస్​ కిచిడీ రెడీ. 

సాబుదానా

కావాల్సినవి :

సాబుదానా (సగ్గుబియ్యం) -  ఒక కప్పు
నూనె -  రెండు టీస్పూన్లు
జీలకర్ర -  ఒక టీస్పూన్
కరివేపాకు -  కొంచెం
ఆలుగడ్డ -  ఒకటి
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ -  ఒక టీస్పూన్
మిరియాల పొడి -  అర టీస్పూన్
చక్కెర -  ఒక టీస్పూన్
పల్లీలు (వేగించి) -  అర కప్పు 
నిమ్మరసం -  ఒక టీస్పూన్

తయారీ : సగ్గుబియ్యాన్ని రెండుసార్లు కడిగి, అర కప్పు నీళ్లు పోసి మూడు గంటలు నానబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, ఆలుగడ్డ తరుగు ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. అందులో ఉప్పు వేసి కలిపాక అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, చక్కెర వేసి కలపాలి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వడకట్టి, వాటిని కూడా అందులో వేయాలి. తరువాత వేగించిన పల్లీలు వేసి, నిమ్మరసం చల్లాలి. కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి మూడు నిమిషాలు ఉంచాలి. అంతే.. సాబుదానా కిచిడీ తినడానికి రెడీ.

మొక్కజొన్న కిచిడీ

కావాల్సినవి :

బియ్యం (నానబెట్టి) - అర కప్పు
పచ్చి మొక్కజొన్న గింజలు(స్వీట్​కార్న్​ కాదు) - ఒకటిన్నర కప్పులు
బటానీలు - అర కప్పు
పాలు - అర కప్పు
నీళ్లు - ముప్పావు కప్పు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - అర టీస్పూన్
గరం మసాలా - ఒక టీస్పూన్
చక్కెర - ఒక టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
పసుపు - పావు టీస్పూన్
కొత్తిమీర - కొంచెం
దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి -  రెండేసి చొప్పున
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్

తయారీ : నూనె వేడి చేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు, ఆవాలు, ఎండుమిర్చి వేగించాలి. పచ్చి మొక్కజొన్నల్ని కచ్చాపచ్చాగా మిక్సీపట్టాలి. వాటిని కూడా తాలింపులో వేసి కలపాలి. తర్వాత పచ్చిబటానీలు, బియ్యం కలపాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, చక్కెర, గరం మసాలా, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పైనుంచి కొత్తిమీర, ఉప్పు వేసి మరోసారి కలిపి అందులో పాలు, నీళ్లు పోయాలి. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.