ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ముల్లంగి పేరు వినగానే మూతి విరుస్తారు కొందరు. కానీ ముల్లంగిని ఇక్కడ చెప్పినట్టు వండుకుంటే మాత్రం మహా ఇష్టంగా తినడం ఖాయం. ఇవన్నీ రెగ్యులర్ వంటకాలు కావు. ఈ వంటకాలను ఒకసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించడం ఖాయం.
కోఫ్తా కర్రీ
కావాల్సినవి :
కోఫ్తా కోసం :
ముల్లంగి - అర కిలో
శనగపిండి - పావు కప్పు
వాము - ఒక టీస్పూన్
అల్లం తరుగు - అర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా, కారం - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ధనియాల పొడి, జీలకర్ర పొడి - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
ఉప్పు - సరిపడా
కర్రీ కోసం :
పచ్చిమిర్చి - మూడు
వెల్లుల్లి రెబ్బలు - పదిహేను
అల్లం - చిన్న ముక్క
ఉల్లిగడ్డలు, టొమాటోలు, బిర్యానీ ఆకులు - ఒక్కోటి రెండేసి చొప్పున
జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం - ఒక్కో టీస్పూన్ చొప్పున
పసుపు, జీలకర్ర పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
మిరియాలు - ఎనిమిది
జీడిపప్పులు - పది
దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయ - ఒక్కోటి
నూనె, ఉప్పు - సరిపడా
కోఫ్తా తయారీ : ముల్లంగిని శుభ్రంగా కడగాలి. తరువాత తొక్క తీసి తురమాలి. తురుముని గట్టిగా పిండి వేరే గిన్నెలో వేయాలి. పిండినప్పుడు వచ్చిన నీళ్లను ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగు, శనగపిండి, వాము, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. వేడి నూనెలో ముల్లంగి ఉండల్ని వేసి వేగిస్తే కోఫ్తాలు రెడీ.
కర్రీ : పాన్‌లో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, ఉప్పు.. ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. అందులోనే జీడిపప్పు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి నల్ల యాలక్కాయ, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగించాలి. అందులోనే ఉల్లిగడ్డ తరుగు కూడా వేగించాలి. ఇవన్నీ వేగాక, టొమాటో పేస్ట్ కలపాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. అందులో ముల్లంగి నీటిని వేసి కలిపి మూత పెట్టి మరికాసేపు ఉడికించాలి. అందులో కోఫ్తాలు వేసి కలిపి, కొత్తిమీర తరుగు చల్లి మూత పెట్టి కాసేపు మగ్గబెట్టాలి.
రైతా
కావాల్సినవి :
ముల్లంగి - ఒకటి
పెరుగు - ఒక కప్పు,
ఉప్పు - సరిపడా
నూనె - ఒక టీస్పూన్
తాలింపు గింజలు - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
ఉల్లిగడ్డ తరుగు - పావుకప్పు
తయారీ : పెరుగులో ఉప్పు వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక ముల్లంగి తురుము కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలిపి, పైనుంచి కొత్తిమీర చల్లాలి.
చైనీస్ పాన్కేక్
కావాల్సినవి :
ముల్లంగి - పావు కిలో
ఉప్పు - సరిపడా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లికాడ, కోడిగుడ్డు - ఒక్కోటి
సోయాసాస్, నువ్వుల నూనె - ఒక్కో టీస్పూన్
మిరియాల పొడి చక్కెర - ఒక్కో చిటికెడు
అల్లం - చిన్న ముక్క
మైదా - ఐదు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో ముల్లంగి తురుము, ఉప్పు వేసి పావుగంట నానబెట్టాలి. తర్వాత పైకి వచ్చిన నీళ్లను వంపేయాలి. ముల్లంగి తురుములో ఉల్లికాడ తరుగు, అల్లం ముక్కలు, కోడిగుడ్డు సొన, నువ్వుల నూనె, ఉప్పు, సోయాసాస్, చక్కెర, మైదా వేసి బాగా కలపాలి. నూనె వేడి చేసి ముల్లంగి మిశ్రమాన్ని స్పూన్‌తో పాన్ కేక్స్లా వేయాలి. రెండు వైపులా బాగా కాల్చాలి. ఈ పాన్కేక్స్ని చిల్లీసాస్‌తో కలిపి తింటే వారెవ్వా అనాల్సిందే.
చట్నీ
కావాల్సినవి :
ముల్లంగి తరుగు - ఒక కప్పు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
శనగపప్పు, పెసరపప్పు - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
ధనియాలు - ఒక టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండు మిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - మూడు
అల్లం - చిన్న ముక్క
పసుపు - పావు టీస్పూన్
నీళ్లు - రెండు టేబుల్ స్పూన్లు
చింతపండు - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - ఒక టీస్పూన్
కరివేపాకు - కొంచెం
తయారీ : నూనె వేడి చేసి శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు వేగించాలి. తర్వాత అందులో పసుపు వేసి నీళ్లు పోయాలి. ఆ నీళ్లు ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేయాలి. ఇందులోనే చింతపండు, ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేగించాలి. ఈ తాలింపును చట్నీలో వేయాలి.
పరాటా
కావాల్సినవి :
ముల్లంగి - నాలుగు
వాము - ముప్పావు టీస్పూన్
జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్ పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు, నీళ్లు, నూనె - సరిపడా
గోధుమ పిండి - రెండు కప్పులు
తయారీ : ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, అర టీస్పూన్ వాము, టీ స్పూన్ నూనె వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండి కలపాలి. ముద్ద చేశాక దానికి నూనె రాసి కాసేపు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో ముల్లంగి తురుము, ఉప్పు వేసి పావుగంట పక్కన ఉంచిన తర్వాత అందులోని నీళ్లన్నీ పిండేయాలి.
పాన్‌లో నూనె వేసి జీలకర్ర, పావు టీస్పూన్ వాము, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. తర్వాత ముల్లంగి తురుము, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి వేసి ఐదు నిమిషాలు వేగించి, కొత్తిమీర చల్లాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను చిన్న ఉండలు చేయాలి. వాటిని చిన్న చపాతీలా వత్తి, అందులో ముల్లంగి మిశ్రమం పెట్టి మళ్లీ ఉండ చేయాలి. మరోసారి ఆ ఉండను చపాతీలా వత్తాలి. వాటిని పాన్‌లో వేసి రెండు వైపులా నూనెతో కాల్చాలి. టేస్టీగా ఉండే ముల్లంగి పరాటా రెడీ.