ఆకు కూరలు అనగానే... పాలకూర, తోటకూర, మెంతి కూర, గోంగూర, పొన్నగంటి కూర... అంటూ కొన్ని పేర్లు గుర్తుకొస్తాయి. నిజానికి చాలామంది ఆకుకూరల్లో ఇష్టంగా ఒకటో రెండో వెరైటీలు తింటారంతే! ఆ సంగతి పక్కనపెడితే ఈ ఆకు కూరల లిస్ట్‌లో వాము ఆకును కూడా చేర్చాలి. ఈ ఆకుతో ఎన్ని వెరైటీలు వండొచ్చంటే... బోలెడు అని చెప్పొచ్చు. ఆ వంటకాల్లో కొన్ని వెరైటీలు ఇవి...
బజ్జీ
కావాల్సినవి :
వాము ఆకులు - పది
శనగపిండి - ఒక కప్పు
బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
నూనె - సరిపడా
తయారీ : శనగపిండి, బియ్యప్పిండి ఒక గిన్నెలో వేసి, నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, కారం, బేకింగ్ సోడా వేసి బజ్జీలు వేసుకునేందుకు పిండిని జారుగా కలపాలి. వాము ఆకులు శుభ్రంగా కడిగి, పిండిలో దొర్లించాలి. ఈ వాము ఆకులను వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని నేరుగా తినొచ్చు. లేదంటే వాము ఆకు బజ్జీని మధ్యకు కట్ చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పెట్టి, కాస్త కారం లేదా మిరియాల పొడి చల్లుకుని తింటే టేస్ట్ ఆ మజానే వేరు.
రైతా
కావాల్సినవి :
వాము ఆకులు - పది
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - సరిపడా
బెల్లం పొడి - అర టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - రెండు
ఆవాలు - అర టీస్పూన్
పెరుగు - మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు : ఆవాలు, మినప్పప్పు
జీలకర్ర - ఒక్కో టీస్పూన్
ఎండు మిర్చి - రెండు
కరివేపాకు - సరిపడా
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వాము ఆకు తరుగు, ఉప్పు, బెల్లం పొడి వేసి కలపాలి. మిక్సీజార్‌లో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తరుగు, ఆవాలు వేయాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసి అందులో వాము ఆకులను ఉడికించిన నీళ్లతో సహా కలపాలి. చివరిగా పెరుగు వేసి బాగా కలపాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు తాలింపు వేసి దాన్ని వాము ఆకు రైతాలో వేసి కలపాలి.
తేనీరు
కావాల్సినవి :
నీళ్లు - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
టీ పొడి - రెండు టీస్పూన్లు
బెల్లం - ఒక టీస్పూన్
తయారీ : టీ గిన్నెలో నీళ్లు, పాలు పోసి అందులో టీ పొడి వేయాలి. పది నిమిషాలు తరువాత శుభ్రంగా కడిగిన వాము ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న టీలో వేయాలి. స్టవ్ ఆపేసి, గిన్నె మీద మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత గ్లాస్లో బెల్లం వేసి, టీ పోసి కలపాలి. ఈ టీ(తేనీరు) ఆరోగ్యానికి కూడా మంచిదంటారు!
పచ్చడి
కావాల్సినవి :
వాము ఆకులు - రెండు కప్పులు
ఎండు మిర్చి - పదిహేను
నూనె - ఒక టేబుల్ స్పూన్
మెంతులు - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
చింతపండు - ఒక టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
బెల్లం - చిన్న ముక్క
తయారీ : నూనె వేడి చేసి మెంతులు, ఎండు మిర్చి, జీలకర్ర వేగించాలి. అవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీయాలి. అదే పాన్‌లో వాము ఆకులు వేసి మూతపెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. ఆకులు మగ్గాక చింతపండు వేసి మరికాసేపు ఉడికించాలి. మిక్సీజార్‌లో వేగించిన ఎండు మిర్చి మిశ్రమంతోపాటు పసుపు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, బెల్లం ముక్క, వేగించిన వాము ఆకులు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఈ పచ్చడిని అలానే తిన్నా, తాలింపు వేసుకుని తిన్నా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో పెడితే దాదాపు ఇరవై రోజులు నిల్వ ఉంటుంది.
రసం
కావాల్సినవి :
వాము ఆకులు - ఐదు
వెల్లుల్లి రెబ్బలు - రెండు
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
టొమాటో - ఒకటి
ఆవాలు - అర టీస్పూన్
ఎండుమిర్చి- సరిపడా
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
నీళ్లు, ఉప్పు - సరిపడా
బెల్లం - ఒక టీస్పూన్
చింతపండు - ఒక టేబుల్ స్పూన్
మిరియాలు - పావు టీస్పూన్
తయారీ : వాము ఆకులు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత జీలకర్ర వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేగించాలి. అందులో టొమాటో తరుగు వేసి కాసేపు వేగించాక, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము ఆకు మిశ్రమం కలపాలి. తర్వాత చింతపండు రసం, నీళ్లు పోసి ఉప్పు, బెల్లం వేసి బాగా కలపాలి. రసం మరిగేటప్పుడు మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేయాలి.
నాన్
కావాల్సినవి :
వాము ఆకులు - పది
మైదా లేదా గోధుమ పిండి -ఒక కప్పు
బేకింగ్ సోడా - ఒక టీస్పూన్
ఉప్పు - సరిపడా
చక్కెర - అర టీస్పూన్
నూనె - ఒక టీస్పూన్
పెరుగు లేదా పాలు - రెండు టేబుల్ స్పూన్లు
నువ్వులు - సరిపడా
తయారీ : మిక్సీ జార్లో వాము ఆకులు మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీయాలి. దాంతోపాటు మైదా పిండి, చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా, నూనె వేసి బాగా కలపాలి. పెరుగు లేదా పాలు కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. ఈ పిండి ముద్దను రెండు గంటలు పక్కన పెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి, నువ్వులు అద్దాలి. వాటిని చపాతీల్లా వత్తి నీళ్లతో తడిపి పెనం మీద వేడి చేయాలి. తరువాత పుల్కాల్లా మంట మీద కాల్చాలి.
పకోడీ
కావాల్సినవి :
వాము ఆకులు - పది
ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకు - కొంచెం
ఉప్పు, నీళ్లు - సరిపడా
కారం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
బియ్యప్పిండి - ఒక టేబుల్ స్పూన్
శనగపిండి - ఒక కప్పు
తయారీ : వాము ఆకులు శుభ్రంగా కడిగి సన్నగా, పొడవుగా తరగాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత వాము ఆకు తరుగు, బియ్యప్పిండి, శనగపిండి ఒక్కోటిగా వేస్తూ కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీలు వేసుకునేందుకు వీలుగా పిండి కలపాలి. మరుగుతున్న నూనెలో తయారుచేసుకున్న పిండిని పకోడీల్లా వేయాలి.