ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం : గడ్డం వంశీకృష్ణ

  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం పని చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​తో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రజా పాలనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతున్నామన్నారు. పదేండ్ల బీఆర్ఎస్​ ప్రభుత్వంలో అప్పులు చేసి ఆర్థికంగా నష్టం కలిగించినా కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం పని చేస్తోందని తెలిపారు.

ఏ పని మొదలు పెట్టినా ముందు గణపతిని మొక్కుకుంటామని, వినాయకుడు తన ఇష్టమైన దేవుడన్నారు. చిన్నతనంలో పరీక్షలు రాసేముందు వినాయకుడికి పూజలు చేయడాన్ని తన కుటుంబ సభ్యులు నేర్పించారని గుర్తు చేసుకున్నారు. గోదావరిఖనిలో గణనాథుడి నిమజ్జనోత్సవ శోభాయాత్ర కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.

అనంతరం లక్ష్మీనగర్, కల్యాణ్​నగర్​, ఎన్టీపీసీ​లో పలు చోట్ల గణపతి మండపాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకుని పూజలు చేశారు. ఎంపీ వెంట మేయర్​ అనిల్​ కుమార్, సీనియర్​ లీడర్లు పి.మల్లికార్జున్​, గుమ్మడి కుమారస్వామి, రాచకొండ కోటేశ్వర్లు, కామ విజయ్, నర్సింగ్​ దొర, తిప్పారపు మధు, జావెద్​ ఉన్నారు. 

పెద్దపల్లి: పట్టణంలో గణపతి నిమజ్జనోత్సవం సందర్బంగా సోమవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీకి గణపతి మండప నిర్వాహకులు శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం నిర్వహించిన గణపతి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు. పెద్దపల్లి గుండం చెరువులో గణపతి నిమజ్జనం కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మున్సిపల్ చైర్ పర్సన్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.