మంత్రి పదవి రేసులో.. వాకిటి శ్రీహరి

  • ఇది వరకే మినిస్టర్​ పోస్ట్​ ఇస్తామని సీఎం హామీ
  • జిల్లా స్థాయిలో నామినేటెడ్​ పదవుల కోసం పెరిగిన పోటీ
  • ముడా చైర్మన్​ పోస్ట్ కు డిమాండ్​

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం రేవంత్​ రెడ్డిపై ఫుల్​ ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే జిల్లా నుంచి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు కొనసాగుతుండగా, త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో ఎమ్మెల్యేకు కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్​ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

పార్లమెంట్​ ఎన్నికల్లో సీఎం హామీ..

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్, మక్తల్, నారాయణపేట, షాద్​నగర్, జడ్చర్ల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, నాగర్​కర్నూల్​ నియోజకవర్గాల్లో 20 లక్షల వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీరిలో 8 లక్షలకు పైగా ముదిరాజ్​ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే గత పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా జిల్లాల్లో పర్యటించిన సీఎం రేవంత్​రెడ్డి పాలమూరు జిల్లాకు మరో మంత్రి పదవి ఇప్పిస్తామన్నారు. ఇందులో భాగంగా మక్తల్​లో జరిగిన సభలో బీసీ కోటాలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాలుగు రోజులుగా సీఎం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఢిల్లీలో హైకమాండ్​తో చర్చలు జరుపుతున్నారు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా, సీఎం నలుగురి పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో వాకిటి శ్రీహరి పేరు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సీఎంకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు మంత్రి వర్గంలో బెర్త్​ కన్ఫాం అయ్యిందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అలాగే నాలుగు రోజుల నుంచి శ్రీహరి కూడా సీఎంతో పాటే ఢిల్లీ టూర్​లో ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. 

భారీగా ఆశావహులు..

జిల్లా స్థాయి పదవులకు ఫుల్​ డిమాండ్​ ఏర్పడింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు, నలుగురు లీడర్లు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేల వద్ద పైరవీలు మొదలుపెట్టారు. అయితే ముడా చైర్మన్​ పోస్టు కోసం ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. దీని పరిధిలో మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవకరద్ర నియోజకవర్గాలు ఉండడంతో, ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన సెకండ్​ కేడర్​ లీడర్లంతా ఎమ్మెల్యేల వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ విషయంపై కొద్ది రోజుల కింద ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సమక్షంలో హైదరాబాద్​లో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. కానీ, జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే గైర్హాజరు​కావడం, ఆయన తన నియోజకవర్గానికి చెందిన లీడర్​కే చైర్మన్​ పదవి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నట్లు తెలిసింది. మరో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గానికే ఈ పదవి కావాలని ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేపడుతున్నట్లు సమాచారం. అలాగే మార్కెట్​ కమిటీ, దేవాదాయ, గ్రంథాలయ పదవుల కోసం కూడా పోటీ నెలకొంది. 

ప్రధానంగా చైర్మన్​ పదవులను ఆశిస్తున్న వారిలో  మహబూబ్​నగర్ నుంచి మారేపల్లి సురేంద్​ రెడ్డి, బురుజు సుధాకర్​ రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, సంజీవ్​ ముదిరాజ్, లక్ష్మణ్​ యాదవ్, సిరాజ్​ఖాద్రీ, అమరేందర్​రాజు, బెక్కరి అనిత, వసంత, జడ్చర్ల నుంచి బుక్కా వెంకటేశం, బాద్మి రవిశంకర్, నిత్యానందం, నారాయణపేట నుంచి యూత్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవీందర్​ రెడ్డి, నారాయణపేట పార్టీ  మండల అధ్యక్షుడు సదాశివారెడ్డి, మాజీ జడ్పీ కో ఆప్షన్​ సభ్యుడు ఎండీ గౌస్​ ఉన్నారు. 

ఏడు నెలలుగా పెండింగ్..​

గత ఏడాది డిసెంబర్​లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. వెంటనే జీవో విడుదల చేయడంతో అప్పటి వరకు నామినేటెడ్​ పదవుల్లో ఉన్న గత ప్రభుత్వంలోని పెద్దలు పదవుల నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ఈ  పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల కింద ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​గా వనపర్తి జిల్లాకు చెందిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్ గా మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన ఒబేదుల్లా కొత్వాల్​కు అవకాశం దక్కింది. ఆ తర్వాత మిగతా పోస్టులు కూడా భర్తీ అవుతాయని అందరూ భావించినా.. వెంటనే పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ రావడంతో ఈ పదవుల భర్తీకి బ్రేక్​ పడింది. 

ఇటీవల కోడ్​ ముగియడంతో వారం నుంచి ఈ పదవులను భర్తీ​చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రధానంగా జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్​ చైర్మన్లు, దేవాదాయ శాఖ చైర్మన్​ పదవులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మహబూబ్​నగర్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(ముడా) చైర్మన్​, డైరెక్టర్​ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఆరా తీస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వీటిని భర్తీ చేయనున్నట్లు సమాచారం.