వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..

  • తమ భూముల డిమాండ్‍ కోసం లీడర్ల మాయాజాలం
  • గత ప్రపోజల్‍లో ఏనుమాముల టూ ఆరేపల్లి  బైపాస్‍ రోడ్డు 
  • తన భూములకు డిమాండ్‍ పెరిగేలా మాజీ ఎమ్మెల్యే  
  • రోడ్‍ అలైన్‍మెంట్‍ మార్పులు
  • బడా హాస్పిటల్‍, విద్యా సంస్థకు లాభం రైతులకు తీవ్ర నష్టం  
  • భూములు పోతున్న బాధితులు రోడ్డెక్కి ఆందోళనలు.. ఆఫీసర్లకు వినతులు

వరంగల్‍, వెలుగు: లీడర్ల భూముల కోసమే వరంగల్ పరిధి ఏనుమాముల, వంగపహాడ్‍ శివారు నుంచి వెళ్లే నేషనల్‍ హైవే –-163, ప్రతిపాదిత 300 ఫీట్ల ఔటర్‍ రింగు రోడ్డును కలిపే 200 ఫీట్ల బైపాస్‍ రోడ్‍ అలైన్‍మెంట్ మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే భూములకు డిమాండ్‍ రావడం కోసమే కుట్ర చేశారని మండిపడుతున్నారు.  వంకర తిరిగిన రోడ్డుతో ఇప్పుడు తమ విలువైన భూములు, ప్లాట్లు కోల్పోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రాబల్యం కలిగిన హాస్పిటల్‍, విద్యాసంస్థకు  చెందిన భూములకు ఇబ్బందులు రావొద్దనే రోడ్డును మార్చారంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.

సర్వే కోసం వచ్చిన అధికారులతో వాదనలకు దిగుతున్నారు.  ఓ వైపు ఆందోళనలు కొనసాగి స్తూనే గ్రేటర్‍ మున్సిపల్‍ కమిషనర్‍, కుడా ఆఫీసర్లు, వరంగల్‍ కలెక్టర్‍ను కలిసి న్యాయం చేయాలని ప్రాధేయపడ్తున్నారు. మాస్టర్‍ప్లాన్‍లో గతంలో ఎక్కడినుంచో వెళ్లాల్సిన 200 ఫీట్ల బైపాస్‍ రోడ్డు ప్రపోజల్స్ ఇప్పుడు లీడర్‍ భూముల పక్కనుంచి వెళ్లేలా ప్రతిపాదనలు మార్చారు.  ఇంకొందరు లీడర్లు, బడా వ్యాపార వేత్తలు తమ భూములకు ఇబ్బంది రాకుండా సక్కగా ఉన్న రోడ్డు ను వంకర తిప్పేలా చక్రం తిప్పారంటూ బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.  

మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట కొనుగోలు చేసి..
వరంగల్‍ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‍ఎస్‍ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‍భాస్కర్‍ తన భార్య  రేవతి పేరిట వరంగల్‍ జిల్లా, మండలం పైడిపెల్లి పరిధిలో భూములను కొనుగోలు చేశాడు. సర్వే నం. 806/1/ఏలో 22 గుంటలు, 806/1/2లో 6 గుంటలు, 806/1/బిలో 22 గుంటలు, 808 సర్వే నంబర్ లో 1.13 గుంటలు, 808/ఏ లో 26 గుంటలు.. ఇంకా తదితర నంబర్లతో మరిన్ని భూములను తన భార్య పేరిట మాజీ ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. మరో 8 ఎకరాల భూములను తన అనుచరుల పేర్లతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి  ములుగు రోడ్‍ నుంచి ఆరేపల్లి దాటాక కెనాల్‍ నుంచి కుడివైపున ఉన్నాయి.  ఇవి రాళ్లు, రప్పలు గుట్టల ప్రాంతం కాగా.. ధరణి లో  రెగ్యులర్ అగ్రికల్చర్‍ ల్యాండ్‍ కింద నమోదైంది. 

 రూట్‍ మార్చి.. 200 ఫీట్ల బైపాస్‍ రోడ్‍
వరంగల్‍ సిటీ మాస్టర్ ప్లాన్‍ – 2041 మేరకు గత బీఆర్‍ఎస్‍ సర్కార్ వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍ నుంచి హైదరాబాద్‍, కరీంనగర్‍, ములుగు, భూపాలపల్లి వైపు 4 – 5 కిలోమీటర్ల దూరంలో 200  ఫీట్ల బై పాస్‍ రోడ్డుకు ప్రతిపాదనలు చేసింది. కాగా.. మార్కెట్‍ నుంచి ప్రతిమ హాస్పిటల్‍ వెళ్లడానికి కొత్తపేట మీదుగా ఇప్పటికే 100 ఫీట్ల రోడ్డు ఉంది.

ఇంకోవైపు దేశాయిపేట, పైడిపల్లి మీదుగా ములుగు రోడ్‍ అయ్యప్పస్వామి గుడి పక్కనే ఉండే ఇస్కాన్‍ టెంపుల్‍ వద్ద నుంచి, వంగపహాడ్‍ జంక్షన్‍లో నేషనల్‍ హైవేకు కలిసేలా మరో పెద్ద రోడ్‍ ప్లాన్‍ చేశారు. కాగా.. లీడర్ల భూముల కోసం ప్లాన్‍ చేసిన రోడ్డునే మార్చేశారు. ప్రస్తుత రోడ్డు గత మాస్టర్ ప్లాన్‍లో ఉన్నట్లు దేశాయిపేట, పైడిపల్లి నుంచి కాకుండా మార్కెట్‍ నుంచి డైరెక్ట్ గా మాజీ ఎమ్మెల్యే భూముల పక్కనుంచి పరకాల వెళ్లే దారిలో దామెర క్రాస్‍రోడ్‍ వద్ద ప్రతిమ హాస్పిటల్‍కు ప్రతిపాదనలు మార్చారు. ఇక్కడ ఆల్రెడీ  100 ఫీట్ల రోడ్డు దగ్గర్లోనే ఉంది. ఇన్నాళ్లు మాస్టర్‍ప్లాన్‍కు ఆమోదముద్ర పడకపోవడంతో మార్చిన కొత్త రోడ్డు ప్రతిపాదనలు ఎవరికీ తెలియలేదు. 

ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయగా.. 
వరంగల్‍ మాస్టర్‍ప్లాన్‍కు గత నెలలో సీఎం రేవంత్‍రెడ్డి ఆమోదముద్ర వేయడంతో రికార్డులు బయటకొచ్చా యి. దీనికి తోడు 200 ఫీట్ల రోడ్డుకు మార్చిన అలైన్‍మెంట్‍ మేరకు.. ఈ రూట్ లోని రైతుల భూముల్లోకి ప్రస్తుతం అధికారులు రావడంతో అసలు కథ తెలిసింది.  మార్కెట్‍ నుంచి హైవేకు వెళ్లడానికి ఇదేమార్గం సక్రమంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  ముందస్తు ప్లాన్‍ ప్రకారమే భూముల కొనుగోలు, ఆపై వాటికి డిమాండ్‍ వచ్చేలా అలైన్‍మెంట్‍ మార్పు జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

 లీడర్ల భూముల కోసమే..
 కొందరు లీడర్ల భూములకు డిమాండ్‍ రావడం కోసమే వాటి పక్క నుంచి కొత్త లైన్‍ తీసిన్రు. ప్రస్తుతమున్న100 ఫీట్ల రోడ్డు వద్ద నుంచే 200 ఫీట్ల రోడ్డు వేస్తే ఏం లాభం. రోడ్డు వంకర తీయడం ద్వారా నా ఒక్కనిదే 2.5 ఎకరాల భూమి పోతుంది.

– సిర్ల శ్రీనివాస్‍, రైతు, ఆరేపల్లి