ప్రేమించాడు.. బోర్డర్ దాటాడు... పాక్ పోలీసులకు చిక్కాడు..

  • ప్రేమ కోసమని బార్డర్ దాటితే..  అక్కడికెళ్లాక నో చెప్పిన పాక్ యువతి
  • దాయాది దేశంలో జైలు పాలైన యూపీ యువకుడు 

లాహోర్: ఫేస్‌‌బుక్​లో పరిచయమైన యువతిని పెండ్లి చేసుకునేందుకు యూపీకి చెందిన ఓ యువకుడు పాకిస్తాన్​కు వెళ్లాడు. అయితే, అక్రమంగా సరిహద్దు దాటినందుకు అక్కడి పోలీసులు అతన్ని ఇదివరకే అరెస్టు చేశారు. మరోవైపు అతడిని పెండ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆ యువతి కూడా తాజాగా పోలీసులకు చెప్పడంతో ఆ యువకుడు ఎరక్కపోయి బార్డర్ దాటి.. పాక్ లో ఇరుక్కున్నట్టయింది. 

ఉత్తరప్రదేశ్‌‌లోని అలీగఢ్ జిల్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ బాబు అనే 30 ఏండ్ల యువకుడు.. పాకిస్తాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్స్‌‌ మండి బహౌద్దీన్ జిల్లాలో గల మాంగ్ గ్రామానికి చెందిన 21 ఏండ్ల సనా రాణి  ఫేస్‌‌బుక్ స్నేహితులు. అయితే, సనా రాణిని పెండ్లి చేసుకునేందుకు బాబు.. డిసెంబర్​ 28వ తేదీన అక్రమంగా పాకిస్తాన్​సరిహద్దు దాటి.. ఆ యువతి నివాసముండే మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు. 

విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు పాకిస్తాన్ విదేశీ చట్టం సెక్షన్లు 13, 14 కింద అతన్ని అరెస్టు చేశారు. అనంతరం ఆ యువతిని పోలీసులు విచారించగా..  బాబు, తాను గత రెండున్నరేండ్లుగా ఫేస్‌‌బుక్‌‌లో స్నేహితులమని.. అయితే, అతడిని పెండ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పోలీసులకు సనా రాణి వాంగ్మూలం ఇచ్చిందని పంజాబ్ పోలీసు అధికారి నసీర్ షా చెప్పారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది. కాగా, తమ కుమారుడిని తిరిగి మన దేశానికి తీసుకురావాలని బాబు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.