వడ్డీ వ్యాపారుల వేధింపులు..అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు

  • వడ్డీ వ్యాపారుల వేధింపులతో పెరుగుతున్నబలవన్మరణాలు
  • ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతం 
  • రకరకాల పేర్లతో వడ్డీ వ్యాపారం
  • పట్టించుకోని అధికారులు 

జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అప్పులు తీసుకున్న వారి నుంచి రకరకాల పేర్లతో మిత్తీలు వసూలు చేస్తూ కోలుకోకుండా చేస్తున్నారు. అవసరాలు ఎలా ఉన్నా ఒకసారి లోన్​ తీసుకుంటే వ్యాపారుల చేతికి చిక్కినట్లే. పలుకుబడిగల వ్యక్తుల చేతుల్లో దందా నడుస్తున్నందున ఆపద సమయంలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక బెదిరింపులు, ఒత్తిళ్లు  తాళలేక  సూసైడ్​ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొస్తున్న చిట్​ఫండ్, మనీ లెండింగ్, మైక్రో ఫైనాన్స్, ఆన్​లైన్ సంస్థలపై నిఘా లేకపోవడంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.  

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ సిటీతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్​ పట్టణాలు, 530 గ్రామాలున్నాయి. వడ్డీ వ్యాపారం విస్తరిస్తున్నా  అధికారుల వద్ద  పూర్తి సమాచారం ఉండడంలేదు. పేరొందిన చిట్​ఫండ్​ కంపెనీ బ్రాంచ్​లు మాత్రమే రిజిస్ర్టేషన్ ఆఫీస్​లో నమోదవుతున్నాయి. తహసీల్దార్లు జారీ చేసిన మనీలెండింగ్​ లైసెన్స్​లతో  కొద్దిమంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వీటి సంఖ్య అధికారికంగా సుమారు 200 ఉండగా అనధికారంగా ఐదింతలు ఉన్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసేవారు అసలు రికార్డుల్లోనే లేరు. లైసెన్సులు తీసుకున్న మనీ లెండర్లు కూడా వడ్డీ ఎంత వసూలు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు.   వ్యాపారులు సమర్పించే రికార్డ్స్​ఆధారంగానే  లైసెన్స్​ల రెన్యూవల్​చేస్తున్నారు. అప్పు ఇచ్చేటప్పుడు పూచీకత్తు తీసుకోవడంతోపాటు బ్లాంక్​ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకోవడం బాధితుల కొంపముంచుతోంది. వందకు రూ.5 నుంచి  అవసరాన్నిబట్టి రూ.20 దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు.   వందకు రూ.20 వడ్డీతో గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్​ దందా నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. 

చొరవ చూపిన సీపీ కల్మేశ్వర్​

ఉపాధి కోసం గల్ఫ్​ బాటపట్టే వారు తులం బంగారం విలువకు సమానమైన డబ్బు అప్పుగా ఇచ్చి బదులుగా రెండు తులాలకు సమానమైన అమౌంట్​ తిరిగి వసూలు చేస్తున్నారని తెలిసి గత పోలీస్​ కమిషనర్​ కల్మేశ్వర్​ విస్తుబోయారు. చిట్​ఫండ్, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయడానికి చర్యలు చేపట్టారు.  ఆయన ఉన్నప్పుడు వడ్డీ వేధింపులు కొంత తగ్గినా ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 

ఆత్మహత్యల వివరాలు

నగరానికి చెందిన విప్పులంచి వేణు పాన్​షాప్​ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  వ్యాపారం విస్తరించేందుకు రూ.3 లక్షలు అప్పు చేశాడు.  కిస్తీలు సక్రమంగా చెల్లించినా ఇంకా బాకీ ఉందని వ్యాపారులు బెదిరించారు. పెళ్లి సంబంధం కుదిరిన కూతురు పూర్ణిమను నగ్నంగా ఊరేగిస్తామని వార్నింగ్​ ఇచ్చారు. అప్పటికే వేణు పెద్ద కూతురు ప్రియాంక అనారోగ్యంతో మరణించింది. వడ్డీ వ్యాపారుల బెదిరింపులు భరించలేక ఈనెల 6న వేణు, ఆయన భార్య అనురాధ, కూతురు పూర్ణిమ బాసర వద్ద గోదావరిలో దూకారు.

ALSO READ : గుట్టపై ‘కార్తీక’ శోభ

నిజామాబాద్​ ఆటోనగర్​కు చెందిన సయ్యద్​ హబీబ్​అజహర్​ అనే యువకుడు ఆటోరిక్షా కొనడానికి రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. ​ వాటిని తిరిగి కట్టినా మోయలేని వడ్డీ వేసిన వ్యాపారి ఏఎస్​ఐ సహాయంతో ప్రామిసరీ నోట్​ రాయించుకున్నాడు. అప్పటి నుంచి  బెదిరింపులు పెరిగాయి. దీంతో ఈనెల  7న జాన్కంపేట చెరువులో దూకి ఆత్మహత్య​ చేసుకున్నాడు. మృతుడి భార్య అయేషా బేగం 6వ టౌన్​లో ఫిర్యాదు చేసింది.కేవలం అప్పుల వారి వేధింపులతో పులాంగ్​ చౌరస్తాకు చెందిన ఆరీఫ్​ రెండు రోజుల కిందట ప్రాణాలు తీసుకున్నాడు.నెలన్నర కింద ఎడపల్లి మండలం వడ్డేపల్లి లో ఆన్​లైన్ యాప్​ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎదిగిన కొడుకు సహా దంపతులు ఆత్మహత్య​ చేసుకున్నారు.  అంతకు ముందు బాల్కొండ సెగ్మెంట్​లో వడ్డీ వ్యాపారి  వేధింపులతో ఓ యువకుడు  ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫిర్యాదు చేయాలి


వడ్డీ వ్యాపారుల బెదిరింపులు ఎదుర్కొనే  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. చట్టవ్యతిరేకంగా చిట్​ఫండ్​ వ్యాపారం ఎవరు చేస్తున్నా ఫిర్యాదు చేయొచ్చు.  ఆస్తి పత్రాలు తనఖా పెట్టుకొని అధిక వడ్డీ వసూలు చేసిన ఐదుగురిపై కేసులు పెట్టాం. మైక్రో ఫైనాన్స్​ బాధితులు ముందుకు రావాలి.- శ్రీనివాస్​, ఏసీపీ బోధన్​