అవేర్ నెస్..వాడిన నూనె.. మళ్లీ వాడొచ్చు! 

‘‘ఒకసారి వాడిన నూనెను వంటకు మళ్లీ వాడకూడదు’’ అనే మాట వినే ఉంటారు. మళ్లీ మళ్లీ వాడడం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అలా వాడొద్దు అని చెప్తారు. అయితే కొన్ని నూనెలను మాత్రం మళ్లీ వాడొచ్చు! అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అదేంటది అని ఆశ్చర్యపోతున్నారా? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వివరాలు చదవండి.

రోజు వారీ వంటలో తక్కువలో తక్కువ ఒక స్పూన్​ నూనె నుంచి పావు లీటర్​ వరకు వాడుతుంటారు. మన దేశంలో నూటికి తొంభై శాతం వంటలు నూనెతోనే చేస్తుంటారు. అయితే... కొన్నేండ్ల క్రితం వరకు ఒకసారి వాడిన నూనెను మరోసారి వంటల్లో వాడేవారు. అలా వాడడం వల్ల లేనిపోని అనారోగ్యాలు వస్తున్నాయని వాడిన నూనెను రెండోసారి వాడట్లేదు చాలామంది. నిజానికి అంతంత రేట్లు పెట్టి కొన్న నూనెని ఒక్కసారి వాడి పారబోయాలంటే మనసొప్పక పోవడం సహజం.

మరీ ముఖ్యంగా డీప్​ ఫ్రైలకు అంటే పూరీలు, గారెలు వంటి వాటికి ఎక్కువ నూనె అవసరం పడుతుంది. అలాంటప్పుడు మిగిలిన నూనెని మళ్లీ వాడొచ్చు అనుకుంటారు. ఆ నూనెను తరువాత వడియాలు, అప్పడాలు వేగించడానికో, పోపు కోసమో వాడుతుంటారు కూడా. అయితే అలా వాడుతున్న ఏ నూనె అనేది చూసుకుని వాడాలి.  అది తెలిస్తే ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడినా మరేం పర్వాలేదు అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్. 

టెంపరేచర్ చెకింగ్

ఒకసారి వాడిన నూనెని తిరిగి వాడాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. వాటిలో ఏ రకం నూనె వాడారనేది మొట్టమొదటి విషయం. ఎందుకంటే ప్రతి నూనెకి స్మోకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే... ఏ ఉష్ణోగ్రత​ దగ్గర నూనె పొగగా మారుతుందో దాన్నే ‘స్మోకింగ్ పాయింట్’ అంటారు. పెద్ద మంట మీద ఫ్రై చేయాలనుకుంటే అందుకు తగ్గ నూనె వాడాలి. అప్పుడు దాని హై స్మోకింగ్ పాయింట్ 400 డిగ్రీలకు పైగా ఉంటుంది. ఉదాహరణకు వేరుశనగ నూనె, కనోలా, సీడ్స్​, నట్స్​, గ్రెయిన్స్​ నుంచి తీసే వెజిటబుల్ ఆయిల్ వంటివి. ఇలాంటివి వాడాల్సిన వంటలకు ఎక్స్​ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటివి వాడకూడదు. ఎందుకంటే దానికి స్మోక్ పాయింట్ తక్కువగా ఉంటుంది​. ఖరీదు కూడా ఎక్కువ.

వాటి ఫ్లేవర్​ వంటకం రుచిని డామినేట్ చేస్తుంది. అందుకని డీప్​ ఫ్రైలకు ఇది అస్సలు పనికిరాదు. డీప్​ ఫ్రైలు ఎక్కువగా చేసుకునే అలవాటు ఉన్నవాళ్లు డీప్​ ఫ్రయ్యర్ కొనిపెట్టుకోవడం బెటర్. ఎలక్ట్రిక్  ఫ్రయ్యర్స్ అయితే వంట ప్రాసెస్​ ఈజీగా అయిపోతుంది. అది ఆటోమెటిక్​గా ఆయిల్ టెంపరేచర్​ని క్రమపరుస్తుంది. ఎక్కువ వేడెక్కితే ఆటోమెటిక్​గా అదే ఆపేస్తుంది. స్టవ్​ మీద డీప్​ ఫ్రైలు చేయాలంటే పెద్ద సైజులో బరువైన, లోతైన కడాయిలు వాడాలి. మంట అన్నివైపులా తగలాలి. నూనె టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మామీటర్ అవసరం. అది కూడా 400 డిగ్రీల ఫారెన్ హీట్ రీడ్ చేయగలిగేది అయి ఉండాలి. ఈ థర్మామీటర్​కి క్లిప్ ఉంటుంది. వంట చేసే గిన్నెకు ఆ క్లిప్​తో థర్మామీటర్​ ఫిక్స్ చేయాలి.

ఇలా టెంపరేచర్​ చెక్ చేసుకోవడం వల్ల ఆయిల్​ షెల్ఫ్​ లైఫ్​ పెరుగుతుంది. ఆయిల్ స్మోక్ పాయింట్​ దాటితే అందులోని కొవ్వులు పగిలిపోయి, అక్రోలెయిన్ అనే పదార్థం బయటకు వస్తుంది. అది ఫుడ్​ని మాడుస్తుంది. దాంతో వంటకం రుచి చేదెక్కుతుంది. ఏ ఫుడ్​కి​ అయినా ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడితే జిడ్డుగా ఉంటుంది. రుచి వగరు లేదా చేదుగా ఉంటుంది. అందుకని ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడాలనుకుంటే టెంపరేచర్​ స్మోకింగ్​ పాయింట్​ దాటకుండా జాగ్రత్తపడాలి. 

అంతేకాదు ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడే ముందు అందులో ఉన్న మలినాలను తొలగించాలి. నూనె మొత్తం చల్లారాక చీజ్ క్లాత్ లేదా కాఫీ ఫిల్టర్​తో వడపోయాలి. ఆ నూనెని గాలి చొరబడని కంటె యినర్​లో పోసి మూతపెట్టాలి. ఆ కంటెయినర్​ని ఫ్రిజ్​లో పెట్టాలి. 

పడేయాలంటే..

ఒకసారి వాడిన నూనె చూసేందుకు, వాసనకు బాగున్నా మళ్లీ వాడే ఉద్దేశం లేకపోతే దాన్ని డ్రెయిన్​లో పారబోయొద్దు. అలా వేస్తే పైపుల్లో స్టక్ అయిపోయి ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని పారేయాలనుకున్న నూనెను ఒక గిన్నెలో పోసి మూతపెట్టి చల్లార్చి, చెత్త డబ్బాలో పారబోయాలి.

ఎన్నిసార్లు వాడొచ్చు?

నూనె అణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని పెద్ద అణువులుగా మారి నూనె మందంగా, జిడ్డుగా అవుతుంది. ముదురు రంగులోకి మారిపోతుంది. ఇలా ఉంటే ఆ నూనె వంటకు పనికిరాదు అంటున్నారు సైంటిస్ట్​ రాబర్ట్ ఓల్కె. ఇలాంటివన్నీ చూసుకున్నాక ఒకసారి వాడిన నూనెని మళ్లీ వాడాలో లేదో డిసైడ్​ కావాలి. ఇదేకాకుండా... నూనె వాసన కూడా మారిపోతుంది. అయితే చూసేందుకు, వాసనకు నూనె మంచిగానే ఉన్నా మూడు సార్లకు మించి వాడకూడదు.

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడాలంటే వీలైనంత త్వరగా వాడాలి. ఒకటి లేదా రెండు నెలలకు మించి నిల్వ చేయొద్దు. వాడిన నూనెని తిరిగి వాడితే అంతకుముందు వండిన వంటకం ఫ్లేవర్ నూనెకు అంటుకుంటుంది. కాబట్టి అలా వాసన వచ్చే నూనె వాడొద్దు.