US election: అమెరికాలో ఇవాళ పోలింగ్.. అగ్రపీఠం దక్కేదెవరికి.?

 

  • 50 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటేయనున్న జనం
  • ఎర్లీ ఓటింగ్​లో ఇప్పటికే కోట్లాది మంది ఓటేసిన్రు
  • సోమవారం చివరి రోజు ట్రంప్, కమల సుడిగాలి పర్యటన
  • స్వింగ్ స్టేట్లలో ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు
  • పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు, ఫలితాల వెల్లడి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 50 రాష్ట్రాలలో ఓటర్లు పోలింగ్ బూత్​ల ముందు బారులు తీరనున్నారు. అధ్యక్షుడిని ఎంపిక చేసే ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్, రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడానికి చివరి రోజు వరకూ విస్తృతంగా పర్యటించారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే ఏడు స్వింగ్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేశారు. చివరిరోజు కమలాహారిస్ మిషిగాన్​లో పర్యటించగా.. ట్రంప్ పెన్సిల్వేనియాలో ప్రచారం సాగించారు. ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన చివరి, ఆఖరి సర్వేలో అమెరికన్లు ట్రంప్ వైపే మొగ్గారు. 

స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దే ఆధిక్యమని ఈ సర్వే తేల్చింది. కాగా, ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనుంది. అయితే, ఎర్లీ ఓటింగ్ సదుపాయం ఉపయోగించుకుని ఇప్పటికే కోట్లాది మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళవారం సాయంత్రం ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు మొదలు పెట్టి, అధికారులు వెంట వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్రాల వారీగా ఫలితాలు వెలువడేందుకు ఒక్కోసారి రోజుల తరబడి సమయం పడుతుంది. అయితే, ఎలక్ట్రోరల్ కాలేజీలో తమ మద్దతుదారులు కనీసం 270 సభ్యులను గెలిపించుకోగలిగిన అభ్యర్థి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటారు. గెలిచిన అభ్యర్థి వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపడతారు. అప్పటివరకు కొత్త అధ్యక్షుడు అధికార మార్పిడి, పాలనాపరమైన ప్రణాళికలు, మంత్రివర్గ కూర్పు తదితర ప్రక్రియలు పూర్తిచేసుకుంటారు.

ఎన్నికలు జరిగేదిలా..

చాలా దేశాల్లో కేంద్రీకృత ఎన్నికల సంఘాలు ఉండగా.. అమెరికాలో డీసెంట్రలైజ్డ్  ఎన్నికల వ్యవస్థ ఉంది. ఎన్నికల ప్రచారం, ఆర్థిక వ్యవహారాలను ఫెడరల్  ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల ప్రక్రియను రాష్ట్రాలు, స్థానిక అధికారులు పరిశీలిస్తారు. ఓటరు అర్హత నుంచి బ్యాలట్  డిజైన్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ వంటి సొంత ఎన్నికల నియమాలు ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్, ఓట్ల లెక్కింపులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. మూడు పద్ధతుల్లో ఓటేయొచ్చు..హ్యాండ్ మేడ్ పేపర్  బ్యాలట్: పేపర్  బ్యాలట్  మీద చేతితో మార్కింగ్  చేయడం ద్వారా ఓటు వేస్తారు.బ్యాలట్  మార్కింగ్ డివైజెస్(బీఎండీ): కంప్యూటర్  స్క్రీన్  మీద ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్​(డీఆర్ఈ) సిస్టం: ఈవీఎంలాగే డీఆర్ఈ సిస్టం ఉంటుంది. పేపర్  ట్రయల్  లేకుండా ఓట్లను డీఆర్ఈ  స్టోర్  చేసుకుంటుంది.

లెక్కింపు ఇలా..

హ్యాండ్ మేడ్ పేపర్  బ్యాలట్, బీఎండీలో వేసిన ఓట్లను ఆప్టికల్ స్కానర్లతో స్కాన్ చేస్తారు. ఈ స్కానర్లు ఓట్లను ఆటోమేటిక్​గా రికార్డుచేసి ఫలితాలను పట్టిక రూపంలో చూపిస్తాయి. ఫలితాలప్రకటనకు రాష్ట్రాలకు వేర్వేరు కాలమానాలు ఉన్నాయి. ఇన్​పర్సన్  పద్ధతిలో వేసిన ఓట్లను పోలింగ్ ముగిశాక లెక్కిస్తారు. ఈ పేపర్  బ్యాలట్లను కౌంటింగ్  కేంద్రాలకు తరలిస్తారు.