ఓటేసిన అమెరికా!..కొత్త ప్రెసిడెంట్ ఎవరో.. ఇవాళ(నవంబర్ 6) రాత్రికల్లా తేలే చాన్స్

  •  దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం మొదలైన పోలింగ్
  • ఆయా స్టేట్స్​లో ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్
  • కమలా హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు 
  • జాతీయ సర్వేల్లో మాత్రం కమలకే ఆధిక్యం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త ప్రెసిడెంట్ ఎవరో నేటి రాత్రికల్లా దాదాపుగా తేలిపోనుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ను గెలిపించి అమెరికన్లు చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు పట్టం కడతారా? లేదంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కే రెండో సారి చాన్స్ ఇస్తారా? అన్నదానిపై మరికొద్ది గంటల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కాగా.. బుధవారం ఉదయం11.30కల్లా ముగియనుంది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. బుధవారం రాత్రి కల్లా తుది ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో టైమ్ జోన్లను అనుసరించి స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజాము నుంచి వేర్వేరు సమయాల్లో పోలింగ్ ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తూర్పున ఉన్న న్యూహాంప్ షైర్ లోని డిక్స్ విల్లే నాచ్ కౌంటీలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఓటింగ్ మొదలైంది. అనంతరం తూర్పు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఒక్కో చోట ఒక్కో టైంకు పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అయ్యాయి. ఎక్కువ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం11.30 గంటల కల్లా 50 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (రాజధాని వాషింగ్టన్ ఉన్న ప్రాంతం)లో ఓటింగ్ పూర్తి కానుంది. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలుకానుంది. బుధవారం రాత్రి కల్లా అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు గెలిచారన్నది దాదాపుగా తెలిసిపోనుంది. అయితే, 7 స్వింగ్ స్టేట్స్ లో ఫలితాలు తేలడం ఆలస్యమైతే గనక.. తుది ఫలితాలు వచ్చేందుకు కొన్ని గంటల నుంచి రోజుల సమయం కూడా పట్టొచ్చు. 

పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం 

అమెరికాలో మొత్తం 24.4 కోట్ల మంది అర్హత గల ఓటర్లు ఉండగా.. ఎలక్షన్ డేకు ముందే దాదాపు 8.20 కోట్ల మంది ఎర్లీ ఓటింగ్​లో పాల్గొన్నారు. ఇక ఎలక్షన్ డే సందర్భంగా పోలింగ్ బూత్​ల వద్ద హింస చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్​లోనూ వైట్ హౌస్​తోపాటు క్యాపిటల్ బిల్డింగ్ వద్ద భద్రతను పటిష్టం చేశారు. హూస్టన్, నెబ్రాస్కా, తదితర ప్రాంతాల్లో వర్షం పడినా.. ఓటర్లు గొడుగులు వేసుకుని వచ్చి ఓటింగ్​లో పాల్గొన్నారు. అయితే, కెంటకీలోని లూయీవిల్లేలో ఈ పోల్ బుక్స్ అందడం ఆలస్యం కావడంతో పోలింగ్ కూడా లేట్​గా ప్రారంభమైంది. సెయింట్ లూయిస్ లోని పోలింగ్ కేంద్రంలో కరెంట్ కావడంతో ఓటింగ్ ఆలస్యమైంది. పెనిసిల్వేనియాలోని రెండు కేంద్రాల్లో ఎలక్షన్ జడ్జిలు లేట్​గా రావడం కారణంగా పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. కాగా, ఓరెగాన్ లోని పోలింగ్ కేంద్రంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు పోలింగ్ బాక్స్ లు ధ్వంసమయ్యాయి.    

పెనిసిల్వేనియాలో గెలిచినోళ్లే ప్రెసిడెంట్​​ 

అమెరికాలో జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం వంటి సంస్థలు ఉండవు. అధ్యక్ష ఎన్నికలను సైతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంత రూల్స్, టైమింగ్స్​తో నిర్వహిస్తా యి. మొత్తం 50 రాష్ట్రాల్లో 535, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో 3 ఎలక్టర్లను అధ్యక్ష అభ్యర్థుల ప్రతినిధులు గా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకుంటారు. కనీసం 270 మంది ఎలక్టర్లను గెలిపించుకున్న అభ్యర్థే  ప్రెసిడెంట్ అవుతారు. పెనిసిల్వేనియా లో గెలిచిన వారే ప్రతిసారీ ప్రెసిడెంట్ అవుతున్నారు. కాగా, డిసెంబర్ 11న మాత్రమే ఏ పార్టీ (అభ్యర్థి) ప్రతినిధులు (ఎలక్టర్లు) ఎంతమంది గెలిచారన్నది అధికారికం గా ప్రకటిస్తారు. తర్వాత జనవరి 6న ఎలక్టర్లు ఓటింగ్ లో పాల్గొని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తర్వాత జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.