తిరిగి పంపించటం కాదు.. కాల్చి చంపేయాలి: US కాంగ్రెస్ అభ్యర్థి గోమెజ్ వీడియో వైరల్

న్యూయార్క్: అమెరికాకు అక్రమంగా వలస వచ్చి అమెరికన్లనే చంపుతున్న వలసదారులను తిరిగి పంపించటం కాదు.. కాల్చి చంపేయాలి అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు వాలెంటినా గోమెజ్  ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‎గా మారింది. కొలంబియన్ అమెరికన్ అయిన గోమెజ్ రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు.. ట్రంప్‎కు బలమైన మద్దతుదారు. ఓ కుర్చీలో మనిషి బొమ్మను పెట్టి తుపాకీతో తలపై షూట్​చేస్తున్న వీడియోకు.. అక్రమ వలసదారులకు ఇదే తగిన శిక్ష అనే క్యాప్షన్ పెట్టారు.  సంచలనంగా సృష్టించిన ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

“అమెరికన్లపై హత్యలు, అత్యాచారాలు వంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరి తీయాలి. వారిని దేశం నంచి పంపించడం కాదు.. ఇలా షూట్​చేసి చంపాలి’’ అని గోమెజ్ వీడియోలో మాట్లాడారు. అయితే ఈ వీడియో రూల్స్‎కు విరుద్ధంగా, హింసను ప్రేరేపించేలా ఉందంటూ ‘ఎక్స్’ ఆమె వీడియోను తొలగించింది. అలాగే ఆమెకు జరిమానా కూడా విధించింది.