మన ఎరువులు మహారాష్ట్రకు..సరిహద్దు మండలాల నుంచి జోరుగా రవాణా 

  • ఇక్కడి రైతుల పేరిట పొరుగు రాష్ట్రానికి తరలింపు 
  • భారీగా దండుకుంటున్న ఫర్టిలైజర్స్​ నిర్వాహకులు 
  • వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువు  
  • ప్రాణహిత అంతర్రాష్ట్ర చెక్​పోస్టు వద్ద కొరవడిన నిఘా

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సప్లై చేస్తున్న యూరియా, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున మహారాష్ట్రకు తరలుతున్నాయి. ఫర్టిలైజర్స్​ నిర్వాహకులు రాత్రివేళల్లో బొలెరోలు, డీసీఎం వ్యాన్లు, ఆటో ట్రాలీల్లో దొంగచాటుగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడి రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే వ్యాపారులు మాత్రం పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అడపాదడపా పట్టుకుంటున్నా అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. వ్యాపారులకు కొంతమంది అగ్రికల్చర్​అధికారుల అందడదండలు ఉండడంతోనే ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఎక్కువ రేట్లకు అమ్మకం

చెన్నూర్​తో పాటు జిల్లాలోని సరిహద్దు​మండలాల్లోని కొన్ని ఫర్టిలైజర్స్​ నుంచి మహారాష్ట్రలోని సిరొంచ, చుట్టుపక్కల గ్రామాలకు ఎరువులను తరలిస్తున్నారు. అక్కడ ఎరువుల కొరత ఉండడంతో ఎక్కువ రేట్లకు అమ్మతూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా బస్తాలను ఇక్కడ రైతులకు రూ.270 నుంచి రూ.280కి అమ్ముతుండగా, మహారాష్ట్రలో రూ.330 వరకు అమ్ముతున్నారు. డిమాండ్​ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రూ.350 నుంచి రూ.400 వరకు కూడా విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 అదనంగా వస్తుండడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు.

అక్రమ రవాణాతో ఎరువుల కొరత

మన ఎరువులు మహారాష్ట్రకు తరలిపోతుండడంతో ఇక్కడి రైతులకు కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఎరువుల అక్రమాలను అరికట్టేందుకు పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ వ్యాపారులు తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారు. రైతులు పట్టాదారు పాస్​బుక్, ఆధార్ కార్డుల జిరాక్స్​లు తీసుకొని వారికి ఎన్ని ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాలి. కానీ వ్యాపారులు తమకు తెలిసిన రైతులు, సాగులో లేని భూముల పాస్​బుక్​లు, ఆధార్​కార్డులు సేకరించి, ఆధార్​తో లింక్​అయి ఉన్న ఫోన్​నంబర్​వచ్చే ఓటీపీ తెలుసుకొని వారి పేరిట మహారాష్ట్రకు సప్లై చేస్తున్నట్టు సమాచారం. ఎరువులను పక్కడారి పట్టిస్తూ ఫర్టిలైజర్స్​ నిర్వాహకులు ఇక్కడి రైతులకు అవసరమైన ఎరువులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారు.

ఫిర్యాదులు వస్తేనే కదలిక

మహారాష్ట్రకు ఎరువుల అక్రమ రవాణా గురించి వ్యవసాయ అధికారులకు తెలిసినా ఫిర్యాదులు వస్తే తప్ప కదలడం లేదు. జూన్​25న రాత్రి చెన్నూర్​లోని ఒక ఫర్టిలైజర్​షాపు నుంచి మహారాష్ట్రకు ఎరువులు తరలిస్తున్నారనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పట్టుకున్నారు. బొలెరో వెహికల్​లో తరలిస్తున్న 60 బ్యాగుల కాంప్లెక్స్​ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. ఫర్టిలైజర్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అలాగే నాలుగు రోజుల కిందట చెన్నూర్​లోని రెండు ఫర్టిలైజర్స్​నుంచి బొలెరో, ఆటో ట్రాలీల్లో యూరియా, కాంప్లెక్స్​ ఎరువులను మహారాష్ట్రకు తరలించారు. ఈ నిత్యం కొనసాగుతోంది. కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి అంతర్రాష్ర్ట చెక్​పోస్టు వద్ద తనిఖీలు లేకపోవడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.  

లోడ్​కు రూ.5వేలు ఇస్తేనే ఇండెంట్​

వ్యవసాయ అధికారులు ఒక్కో లోడ్​కు రూ.5 వేలు ఇస్తేనే యూరియా ఇండెండ్​ పెడుతున్నారని ఫర్టిలైజర్స్​ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రకు సప్లై చేసే కొంతమందికి ఎంతంటే అంత ఇస్తూ తమను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు ఇదే అంశంపై ‘వెలుగు’లో కథనం రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఎంక్వయిరీ జరిపి చెన్నూర్​ఏడీఏ, ఏవోలను సస్పెండ్​ చేశారు. అయినా అగ్రికల్చర్​అధికారుల తీరు మారలేదని మండిపడుతున్నారు. ఈ సీజన్​లో ఏ షాపుకు ఎంత డిమాండ్​ఉంది, ఎంత ఇండెంట్​ ఇచ్చారని ఎంక్వయిరీ జరిపితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు.