మానుకోటకు మహర్దశ ముడా ఏర్పాటుతో వేగవంతంగా అభివృద్ధి

  • 13 మండలాల పరిధిలో 159 గ్రామాల్లో అమలు
  • మరింతగా పెరుగనున్న సిటీ కల్చర్, మౌలిక వసతుల కల్పన

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) ఏర్పాటుతో జిల్లాలో పట్టణీకరణ మరింతగా వేగవంతం కానుంది. గతంలో మారుమూల పల్లెలకు నిలయంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మానుకోట జిల్లా సిటీ కల్చర్ వేగంగా విస్తరించనుంది. జిల్లాలో మొత్తంగా18 మండలాలు ఉండగా, ఏజెన్సీ మండలాల్లో 1/70 చట్టం అమలులో ఉండటంతో కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు మండలాలను మినహాయించారు. మిగిలిన 13 మండలాలతో 159 గ్రామాలను కలుపుతూ (ముడా) పట్టణాభివృద్ధి సంస్థ విస్తరించనుంది. ముడాను ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక, పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 

ముడా ఏర్పాటుతో ప్రయోజనాలెన్నో....

మహబూబాబాద్ తోపాటు తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలతోపాటుగా చుట్టు పక్కల  ఉన్న 159  గ్రామాల్లోనూ నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ముడా కృషి చేయనుంది. జిల్లాలోని గుర్తించిన అన్ని ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలను సమాంతరంగా, వేగవంతంగా అమలు చేయనున్నది.

 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వివిధ ప్రాజెక్టులను అమలు చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ _విజయవాడ రైల్వేమార్గం ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రం విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో భారీ సంఖ్యలో రైస్, జిన్నింగ్, ఆయిల్ మిల్లులు, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రానైట్ క్వారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. పట్టణీకరణ మరింత వేగంగా అమలు కానుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.

జిల్లాకు జాతీయ రహదారుల సమాహారం..

మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 194 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు  ఎన్ హెచ్ 365 జాతీయ రహదారి సౌకర్యం అనుసంధానం కలిగి ఉంది. ఎన్ హెచ్-365 మల్లంపల్లి, నర్సంపేట మహబూబాబాద్ మీదుగా  నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, హైదరాబాద్​కు ఎన్ హెచ్- 563 జగిత్యాల, కరీంనగర్, వరంగల్, తొర్రూరు మీదుగా ఖమ్మం వరకు, ఎన్ హెచ్-930 పీ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ మీదుగా భద్రాద్రికొత్తగూడెం వరకు, ఎన్ హెచ్ 163జీ ( గ్రీన్​ హైవే) నాగపూర్ నుంచి మహబూబాబాద్, ఖమ్మం ద్వారా విజయవాడ వరకు జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. 

పట్టణీకరణ విస్తరణ కోసం రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, అనుభవజ్ఞులైన ప్రతినిధితో ప్రత్యేక కమిటీని నియమిస్తారు. ప్రత్యేక కార్యాలయం సైతం ఏర్పాటు కానుంది. ముడాకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, అడిషనల్​కలెక్టర్ వైస్ చైర్మన్​గా,  డైరెక్టర్ పురపాలక పరిపాలన శాఖ, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రాష్ట్ర సీఎస్ ను సైతం సభ్యులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.