మూడు జిల్లాల్లో అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీలు

  • అసిఫాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో అమలు
  • కలెక్టర్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్
  • మారనున్న పల్లెలు, పట్టణాల రూపురేఖలు

 నిర్మల్, వెలుగు: హెచ్ఎండీఏ తరహాలో ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీలు అమలు కాబోతున్నాయి. ఈ మేరకు మూడు జిల్లాల అథారిటీలకు సంబంధించి కలెక్టర్లు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదిలాబాద్ జిల్లాలో అవుడా, మంచిర్యాల, జిల్లాలో మూడా, నిర్మల్ జిల్లాలో నుడా పేరిట ఈ అర్బన్ అథారిటీలు ఏర్పడనున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా ఈ అథారిటీల పరిధిలోకి చేర్చారు.

పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన

మూడు జిల్లాల్లో ఏర్పడనున్న అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల ద్వారా పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా దీని పరిధిలోకి వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ అమలు పకడ్బందీగా జరగనుంది. దీనికోసం ఆయా జిల్లాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్లను లింక్ చేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పాటు సాటిలైట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేయడం అథారిటీల  ప్రధాన బాధ్యత. ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, భారీ సంఖ్యలో గ్రామపంచాయతీలను వీటి పరిధిలోకి తీసుకురానున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 420 గ్రామపంచాయతీలను నుడా పరిధిలో చేర్చనున్నారు.

అమలుకు జిల్లా స్థాయి కమిటీలు

అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల అమలుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కమిటీలకు కలెక్టర్ చైర్మన్ గా వ్వ వ్యవహరించనుండగా వైస్ చైర్మన్లు అడిషనల్ కలెక్టర్లు, అలాగే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించే ఓ నామిని, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నియమించే మరో నామిని, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నియమించే నామిని ఇందులో సభ్యులుగా కొనసాగుతారు.