సివిల్స్​లో పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంక్

  • సత్తాచాటిన అనన్యరెడ్డి
  • బీడీ కార్మికురాలి కొడుక్కు 27వ ర్యాంకు 
  • 231వ ర్యాంకు సాధించిన రైతు కూలీ బిడ్డ
  • యూపీఎస్​సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు 
  • తెలంగాణ, ఏపీ నుంచి 60 మందిదాకా ఎంపిక 
  • సివిల్స్ టాపర్​గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాస్తవ

హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు: సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్ 27వ ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన చందన జాహ్నవి 50, జనగామకు చెందిన మెరుగు కౌశిక్ 82వ ర్యాంకులు సాధించారు. సివిల్ సర్వీసెస్ 20‌‌‌‌23 ఎగ్జామ్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ)  మంగళవారం ప్రకటించింది. ఫలితాల్లో తెలంగాణతోపాటు ఏపీ నుంచి దాదాపు 60 మంది అభ్యర్థులు సివిల్స్ లో సెలక్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి నలుగురు టాప్ 100లో చోటు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో యూపీకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ సివిల్స్ టాపర్ గా నిలవగా, అనిమేశ్ ప్రధాన్ రెండో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 

బీడీ కార్మికురాలి కొడుకుకు 27వ ర్యాంకు  

సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించిన నందల సాయికిరణ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందినవారు. తండ్రి నందల కాంతారావు చేనేత కార్మికుడు. అనారోగ్యంతో 2016లోనే చనిపోయాడు. దీంతో తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ బిడ్డ స్రవంతి, కొడుకు సాయికిరణ్ ను కష్టపడి చదివించింది. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయికిరణ్ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేరయ్యారు. ఎలాంటి కోచింగ్ లేకుండా రెండో అటెంప్ట్ లోనే 27వ ర్యాంకు సాధించారు.  

తాతయ్య స్ఫూర్తితో ఐఏఎస్ విజయం 

హైదరాబాద్ కు చెందిన కేఎన్ చందన జాహ్నవి 50వ ర్యాంకు సాధించారు. మూడుసార్లు పరీక్ష రాయగా, మూడు సార్లూ సివిల్స్ కు ఎంపికైంది. అయితే, తొలిసారి కార్పొరేట్ సర్వీసెస్​కు, రెండోసారి ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు. తాజాగా మూడోసారి ఐఏఎస్ కు సెలక్ట్ అయ్యారు. తన తాత కృష్ణమూర్తి స్ఫూర్తితోనే తాను సివిల్స్ రాశానని చందన జాహ్నవి తెలిపారు. కార్పొరేట్ కంపెనీలో జాబ్ వదిలి.. సొంతంగా ప్రిపేర్ అయి సివిల్స్ లో విజయం సాధించినట్టు చెప్పారు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, తన కష్టానికి అదృష్టం తోడై ఈ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.  

తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు 

జనగామ పట్టణానికి చెందిన మెరుగు సుజాత,- సుధాకర్ దంపతుల కొడుకు మెరుగు కౌశిక్  సివిల్స్ లో 82వ ర్యాంక్ సాధించారు. జనగామ లోని సెయింట్ పాల్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన అనంతరం హైదరాబాద్ హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలో సివిల్స్ రకోచింగ్ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు.

 బీసీ స్టడీసర్కిల్ లో చదివి..

జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన కొయ్యాడ ప్రభాకర్, లక్ష్మి దంపతుల మూడో కొడుకు కొయ్యాడ ప్రణయ్ కుమార్ సివిల్స్ లో 554వ ర్యాంక్ సాధించారు. నాగారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ లో టెన్త్ వరకు చదివి, గజ్వేల్ లో పాలిటెక్నిక్, జేఎన్టీయూహెచ్​లో బీటెక్ పూర్తిచేశారు. సివిల్స్ సాధించాలన్న తపనతో ఏడు నెలల క్రితం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ లో చేరి కష్టపడి ప్రిపేర్ అయ్యానని, 554వ ర్యాంక్ సాధించానని ప్రణయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.   

సత్తా చాటిన జైపూర్ ఏసీపీ కొడుకు.. 

మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వనమాల దంపతుల కొడుకు విశాల్ సివిల్స్ లో 718వ ర్యాంకు సాధించారు. వీరిది ఆదిలాబాద్ జిల్లా చందా తుర్కల్ గ్రామం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్​టీపీసీ స్కూల్ లో 5 వరకూ, తూప్రాన్ లో టెన్త్ వరకు,  హైదరాబాద్​లో ఇంటర్ చదివారు. ఐఐటీ రూర్కిలో బీటెక్ చేసిన ఆయన మూడో ప్రయత్నంలో సివిల్స్ లో విజయం సాధించారు. చందా తుర్కల్ గ్రామంలో3 వేల జనాభాకు గాను  సుమారు 800 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారి స్ఫూర్తితోనే విశాల్ కష్టపడి చదివి సివిల్స్ సాధించినట్టు పేరేంట్స్ తెలిపారు. 

నాల్గొ ప్రయత్నంలో సత్తాచాటిన ధీరజ్‌‌‌‌

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌‌‌‌) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీసు సత్యనారాయణరెడ్డి, హేమలత దంపతుల కొడుకు పెంకీసు ధీరజ్‌‌‌‌రెడ్డి సివిల్స్ లో173వ ర్యాంక్‌‌‌‌ సాధించారు. సత్యనారాయణరెడ్డి ప్రభుత్వ జూనియర్‌‌‌‌ కాలేజీలో ప్రిన్సిపల్‌‌‌‌గా పనిచేసి రిటైర్ కాగా, హేమలత స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా గత నెలలో రిటైర్ అయ్యారు. 2019 నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నానని, మూడు సార్లు ఫెయిల్ కాగా, నాలుగో ప్రయత్నంలో విజయం సాధించానని ధీరజ్ తెలిపారు. అయితే, 173వ ర్యాంకుతో ఐపీఎస్‌‌‌‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని, మరోసారి పరీక్షరాసి ఐఏఎస్‌‌‌‌ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. 

ఆర్ఎంపీ కొడుకుకు 321వ ర్యాంక్ 

సివిల్స్ ఫలితాల్లో ఆర్ఎంపీ కొడుకు సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన ఆర్ఎంపీ నరేష్, లలిత కుమారుడు బుద్ది అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా ఇంట్లోనే సొంతంగా నోట్స్ తయారు చేసుకొని చదివి విజయం సాధించారు. అఖిల్ 2018లో కేయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పై దృష్టిపెట్టారు. తొలిరెండు ప్రయత్నాల్లో విఫలంకాగా, మూడో ప్రయత్నంలో 566వ ర్యాంకు సాధించి ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎంపికయ్యారు. అక్కడ జాయిన్ అయి సివిల్స్ కోచింగ్ కొనసాగించారు. చివరికి ఐదో ప్రయత్నంలో 321వ ర్యాంకు సాధించారు.  

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే.. 

దోనూరు అనన్య రెడ్డి (3వ ర్యాంక్), నందల సాయికిరణ్‌‌‌‌(27), చందన జాహ్నవి (50), మెరుగు కౌశిక్‌‌‌‌ (82), రావుల జయసింహా రెడ్డి (104), జస్వంత్ చంద్ర (162), పెంకీసు ధీరజ్‌‌‌‌రెడ్డి (173), జి.అక్షయ్‌‌‌‌ దీపక్‌‌‌‌ (196), గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ (198),  తరుణ్ కుమార్ (231), ఎహ్తేదా ముఫాసిర్ (278), అఖిల్ యాదవ్ (321), నిమ్మనపల్లి ప్రదీప్‌‌‌‌ రెడ్డి (382), బన్న వెంకటేశ్‌‌‌‌ (467), కడుమూరి హరిప్రసాద్‌‌‌‌ రాజు (475), పూల ధనుష్‌‌‌‌ (480), అడుసుమిల్లి మోనిక (487),  కె.శ్రీనివాసులు (526), ప్రణయ్ కుమార్ (554), నెల్లూరు సాయితేజ (558), కిరణ్‌‌‌‌ సాయి ఎంపు (568), మర్రిపాటి నాగభరత్‌‌‌‌ (580),  రజినీకాంత్ (587), పోతుపురెడ్డి భార్గవ్‌‌‌‌ (590), కె.అర్పిత (639), ఐశ్వర్య నెల్లిశ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్‌‌‌‌ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ (703), గాదె శ్వేత (711), విశాల్ (718),  కొలనుపాక సహన (739), వివేక్ రెడ్డి (741), అనిల్ కుమార్ (743), అనిల్ కుమార్ (764), ఉదయకృష్ణ రెడ్డి (780), వి.ధనుంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ (830),  జె. రాహుల్‌‌‌‌ (873), హనిత వేములపాటి (887), కె.శశికాంత్‌‌‌‌ (891), కెసారపు మీనా (899), అనుప్రియ నెనావత్ (914), రావూరి సాయి అలేఖ్య(938), గోవద నవ్యశ్రీ (995).

సత్తా చాటిన పాలమూరు బిడ్డ 

సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ సాధించిన దోనూరి అనన్య రెడ్డి తల్లిదండ్రులది మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా అడ్డాకల్‌‌‌‌ మండలం, పొన్నకల్‌‌‌‌ గ్రామం. వీరు చాలా ఏండ్ల క్రితమే మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ టౌన్ లోని లక్ష్మీనగర్‌‌‌‌ కాలనీలో స్థిరపడ్డారు. తండ్రి సురేష్‌‌‌‌రెడ్డి రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌ వ్యాపారి. తల్లి మంజులత హౌస్ వైఫ్ గా ఉన్నారు. అనన్య రెడ్డి తాత కృష్ణారెడ్డి స్టాటస్టికల్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉద్యోగిగా పని చేశారు. మనమరాలిని ఐఏఎస్ చేయాలని చిన్నప్పటి నుంచే దిశానిర్దేశం చేశారు. తాతయ్య ఆశయంతోపాటు సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో అనన్య కఠోర శ్రమతో సివిల్స్ కు ప్రిపేర్ అయి విజయం సాధించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కాగా, అనన్య రెడ్డి ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదివారు. ఇంటర్‌‌‌‌ ప్రారంభం నుంచే ఐఏఎస్‌‌‌‌ వైపు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్‌‌‌‌లోని నారాయణ ఐఏఎస్‌‌‌‌ అకాడమీలో చేరారు. ఇంటర్‌‌‌‌ పూర్తి అయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌‌‌‌ కాలేజీలో బీఏ(బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌)లో చేరారు. 2020 నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌ ప్రారంభించారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌‌‌‌ పరీక్షలకు సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. సివిల్స్‌‌‌‌లో ఆప్షనల్‌‌‌‌ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఒక్క ఆంత్రపాలజీ కోసం మాత్రమే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్నారు. 

సత్తా చాటిన రైతుకూలీ కొడుకు 

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ కుమార్ సివిల్స్ లో 231వ ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు శశికళ, బాబయ్య తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ, కూలీ పనులు చేస్తూ కొడుకును చదివించారు. బాబయ్య సోదరుడు కృష్ణ రైల్వేలో ఉద్యోగం చేస్తూ తరుణ్ కి గైడెన్స్ ఇస్తూ ఉన్నత చదువులకు సహకారం అందించారు. తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. సిటీలోనే ఉన్నత విద్య కూడా పూర్తి చేశారు. 

వెలుగు రిపోర్టర్ బిడ్డకు 739వ ర్యాంక్  

కరీంనగర్ లోని విద్యానగర్  కు చెందిన  కొలనుపాక సహన సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె తల్లి గీత హౌస్ వైఫ్ కాగా, తండ్రి అనిల్ జయశంకర్ వెలుగు పత్రికకు కరీంనగర్ టౌన్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. సహన స్థానిక  కెన్ క్రెస్ట్ స్కూల్ లో  టెన్త్ , శ్రీగాయత్రి  జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ లోని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్ సీ కోచింగ్ తీసుకున్నారు.  ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలకు అటెండయ్యారు. కరీంనగర్ కలెక్టర్ గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ స్ఫూర్తితో కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సహన తెలిపారు. అయితే, తనకు వచ్చిన ర్యాంకుకు ఐఏఎస్ కాకుండా మరొక సర్వీస్ లో జాబ్ వస్తుందని, అందులో జాయిన్ అయ్యాక మళ్లీ ఐఏఎస్ సాధించేందుకు పరీక్ష రాస్తానన్నారు. 

సివిల్స్ టాపర్​గా ఆదిత్య శ్రీవాస్తవ

సివిల్స్ ఫలితాల్లో యూపీలోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆదిత్య శ్రీవాస్తవ 2022 సివిల్స్​లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్​కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక రూర్కెలా నిట్ పూర్వ విద్యార్థి అనిమేశ్ ప్రధాన్ సెకండ్ ర్యాంకు పొందారు. త్రివేండ్రంలోని కాలేజ్ ఆఫ్​ ఆర్కిటెక్ట్ పూర్వ విద్యార్థి పీకే సిద్ధార్థ రామ్​కుమార్​కు నాల్గో ర్యాంకు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి రుహానీకి ఐదో ర్యాంకు వచ్చాయి. అలాగే సృష్టి దబాస్‌‌‌‌ (6), అన్‌‌‌‌మోల్‌‌‌‌ రాఠోర్‌‌‌‌ (7), ఆశీష్‌‌‌‌ కుమార్‌‌‌‌ (8), నౌషీన్‌‌‌‌ (9), ఐశ్వర్య ప్రజాపతి (10) సివిల్స్ లో సత్తా చాటారు. కాగా, సివిల్స్ 2023 ఫలితాల్లో మొత్తం 1,016 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో 664 మంది అబ్బాయిలు, 352 మంది అమ్మాయిలు ఉన్నారు. జనరల్‌‌‌‌ కేటగిరీలో 347, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ లో115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ నుంచి 165, ఎస్టీ నుంచి 86 మంది చొప్పున సెలక్ట్ అయ్యారు. 

సివిల్స్ ఫలితాల్లో మెరిసిన ఓరుగల్లు 

సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్‍ వరంగల్‍ పరిసర ప్రాంతాల నుంచే ముగ్గురు యువకులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఇందులో ఒకరు గతంలోనే ఐపీఎస్‍ ట్రైనింగ్‍లో ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా ఇదివరకే జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు సివిల్స్ లో సత్తా చాటారు. హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి గతంలోనే సివిల్స్ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఐపీఎస్‍ ట్రైనింగ్‍లో ఉన్నారు. తాజాగా103వ ర్యాంక్ సాధించారు.  హైదరాబాద్‍ ఐఐటీలో బీటెక్‍ పూర్తి చేసిన జయసింహా 2020 నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఆయన తండ్రి ఉమ్మారెడ్డి వరంగల్‍ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రీసెర్చ్ అసోసియేట్‍ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. అలాగే వరంగల్‍ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన కిరణ్ సివిల్స్​లో 568వ ర్యాంకు సాధించారు. మూడో అటెంప్ట్ లో సక్సెస్‍ అయ్యారు. ఢిల్లీలో ఐఐటీ చదివిన కిరణ్ సీఏపీఎఫ్‍ 2022 ఫలితాల్లో జాతీయ స్థాయిలో15వ ర్యాంక్‍ సాధించారు. ఆయన తల్లిదండ్రులు జయలక్ష్మి, ప్రభాకర్‍రావు వ్యవసాయం చేస్తున్నారు. గ్రేటర్‍ వరంగల్ పరిధిలోని శివనగర్‍కు చెందిన కోటే అనిల్‍ కుమార్‍ సివిల్స్ లో 764వ ర్యాంక్‍ సాధించారు. వరంగల్‍ ఎన్‍ఐటీలో బీటెక్‍ ఈఈఈ చదివిన అనిల్ యూపీపీఎస్ సీ 2021 బ్యాచ్‍లో ‘ఐపీ అండ్‍ టీఏఎఫ్‍ఎస్‍’ లో ర్యాంక్‍ సాధించారు. పోస్టల్‍ అకౌంట్స్ డిపార్టుమెంట్ లో కోల్ కతాలో డిప్యూటీ డైరెక్టర్‍గా జాబ్‍ సాధించారు. ఆయన తండ్రి కొమురయ్య ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ కాగా, తల్లి హౌస్ వైఫ్. 

ఆరో ప్రయత్నంలో విజయం..

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన రజినీకాంత్ సివిల్స్ లో587వ ర్యాంకు సాధించారు. ఢిల్లీలో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కొన్నాళ్లు కోచింగ్ తీసుకున్నారు. ఆరు సార్లు సివిల్స్ రాయగా, చివరి ప్రయత్నంలో విజయం సాధించారు. ఆఖరి ప్రయత్నంలోనైనా తనకు ర్యాంకు రావడం సంతోషంగా ఉందని, ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని రజినీకాంత్ తెలిపారు. ఆయన తండ్రి సిద్దిరాములు చిన్న బిల్డర్​గా ఉన్నారు.  

హెడ్ కానిస్టేబుల్ బిడ్డకు 938వ ర్యాంక్ 

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశరావు బిడ్డ సాయి అలేఖ్య  సివిల్స్​లో 938వ ర్యాంకు సాధించారు. అలేఖ్య తాత రావూరి వెంకటరామయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఐపీఎస్​కావాలన్న తన తండ్రి కోరిక మేరకు చిన్నప్పటి నుంచే కష్టపడి చదివానని అలేఖ్య తెలిపారు. హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని, సివిల్స్ కు ప్రిపేర్ అయినట్లు చెప్పారు.