Google Pay: గూగుల్ పేలో కొత్త ఫీచర్లు

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్‌ యాప్‌ గూగుల్‌ పే(Google Pay) కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024 సందర్భంగా UPI సర్కిల్, UPI వోచర్, క్లిక్ పే(Clickpay) అనే మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ నూతన ఫీచర్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 

UPI సర్కిల్

యూపీఐ సర్కిల్ అనేది NPCI ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్. యూపీఐ సర్కిల్‌తో గూగుల్‌ పే వినియోగదారులు (ప్రైమరీ యూజర్లు) తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా అనుమతించవచ్చు. అనగా బ్యాంక్ ఖాతాలు లేని కుటుంబ సభ్యులు చెల్లింపులు చేయాల్సి వస్తే ప్రైమరీ యూజర్‌ అకౌంట్‌(Google Pay-లింక్డ్ ఖాతా) ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు.

UPI వోచర్స్‌ (ఈరూపీ)

యూపీఐ వోచర్లు లేదా eRupi అనేది కరోనా సమయంలో ప్రారంభించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ఫీచర్. ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలతోపాటు ప్రస్తుత యూపీఐ వినియోగదారులు వీటిని జారీ చేయవచ్చు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాను UPIకి లింక్ చేయకుండానే, మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన ప్రీపెయిడ్ వోచర్‌ను రూపొందించవచ్చు. NPCI, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో గూగుల్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

క్లిక్ పే క్యూఆర్ స్కాన్(Clickpay QR scan)

ప్రీపెయిడ్ యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. అచ్చం పేటీఎం(Paytm)లో ఉన్న ఫీచర్ లాగానే, వినియోగదారు తమ కస్టమర్ డేటాను యాప్‌కి జోడించిన తర్వాత వారి ప్రీపెయిడ్ యుటిలిటీ బిల్లులను గుర్తు చేస్తూ ఉంటుంది. 

అలాగే రూపే కార్డుదారుల కోసం ట్యాప్‌అండ్‌పే చెల్లింపుల సౌకర్యాన్నీ కల్పించింది. ఈ పేమెంట్స్‌ కోసం రూపే కార్డుదారులు తమ మొబైల్‌ ఫోన్లను కార్డులతో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఈ ఏడాది చివర్లో గూగుల్ పేకి జత కానుంది. చివరగా UPI లైట్ ఆటోపే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇది ఖాతాలో బ్యాలెన్స్ నిర్దిష్ట మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులు వారి UPI లైట్ ఖాతాను ఆటోమేటిక్‌గా టాప్ అప్ చేయడానికి అనుమతిస్తుంది.