నేను పోతా బిడ్డో అమీర్​పేట దవాఖానకు!

  • 50 బెడ్లతో పాటు అన్ని వసతులతో వైద్యమందిస్తున్న యూపీహెచ్​సీ   
  • అందుబాటులో అన్ని విభాగాల డాక్టర్లు
  • రోజూ సగటున 600 ఓపీ, 100 టెస్టులు
  • రద్దీ దృష్ట్యా 100 బెడ్లకు పెంచాలని డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: సాధారణంగా సర్కారు దవాఖాన అనగానే కొంతమందికి నెగటివ్​ ఫీలింగ్​ఉంటుంది. డాక్టర్లు ఉండరని, ఉంటే సమయానికి రారని, వచ్చినా ఏదో నామ్​ కే వాస్తే చూసి పంపిస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ, అమీర్​పేట్ అర్బన్​కమ్యూనిటీ హెల్త్​సెంటర్​మాత్రం ఇందుకు భిన్నం. ఈ యూసీహెచ్​సీ పేదోళ్ల కార్పొరేట్ హాస్పిటల్​గా పేరు పొందింది. 2021లో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్​50 బెడ్స్​తో పాటు మిగతా అన్ని సౌకర్యాలు ఉండడంతో ట్రీట్మెంట్​కోసం వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్తే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో.. అమీర్​పేట్ చుట్టుపక్కల ఉన్నవారితోపాటు, దూర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికే తరలివస్తున్నారు. దీంతో రోజుకు దాదాపు 600 దాకా ఓపీ నమోదవుతుంది. వీరిలో గర్భిణులకు సంబంధించి 200 ఓపీ నమోదవుతుండగా,  పీడియాట్రిక్, జనరల్​మెడిసిన్, జనరల్ సర్జన్, స్కిన్​ తదితర డిపార్టుమెంట్లకు సగటున రోజూ వందకు పైగా ఓపీ నమోదవుతుంది.

వంద బెడ్లకు సరిపోయే డాక్టర్లు

అమీర్​పేట్​యూసీహెచ్​సీ 50 బెడ్లతో రన్​అవుతున్నప్పటికీ.. ప్రస్తుతం 100 బెడ్లకు సరిపోయేంత మంది డాక్టర్లు ఉన్నారు. నలుగురు గైనకాలజీ -డాక్టర్లు, ఇద్దరు సర్జన్లు, ముగ్గురు ఫిజీషియన్లు, నలుగురు అనష్తీషియా(మత్తు) డాక్టర్లు, ముగ్గురు పిల్లల డాక్టర్లు, ఒక స్కిన్​స్పెషలిస్ట్​, ఒక ఈఎన్​టీ డాక్టర్​ఉన్నారు. వీరితో పాటు పీజీలు కూడా సేవలందిస్తున్నారు. నెలకు 200 డెలివరీలు చేస్తుండగా, ఇందులో 40 సీజేరియన్లు ఉంటున్నాయి.  

ఇంతమంది స్పెషలిస్టులు ఉండడంతో కూకట్​పల్లి, యూసుఫ్​గూడ, రహ్మత్​నగర్, కార్మికనగర్, బంజారాహిల్స్​లోని స్లమ్​ఏరియా, ఫతేనగర్, బేగంపేట నుంచి కూడా రోగులు వస్తున్నారని సూపరింటెండెంట్​డాక్టర్​రవూఫ్, ఆర్ఎంవో వినాయక్​ చెప్పారు. ప్రస్తుతం హాస్పిటల్​లో రేడియాలజిస్టు, ఆప్తమాలజిస్ట్​ కొరత ఉందని, వారు కూడా ఉంటే రోగుల సంఖ్య వెయ్యి దాటినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలిపారు.

రోజూ వంద శాంపిల్స్​

ఇక్కడికి వచ్చే రోగుల కోసం రక్త , మూత్ర పరీక్షలు చేయడంతో పాటు ఎక్స్-​రే, ఆల్ట్రా సౌండ్​, ఈసీజీ వంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. రోజూ దాదాపు 100 శాంపిల్స్​ సేకరిస్తున్నారు. షుగర్, హిమోగ్లోబిన్​లాంటి టెస్టులను హాస్పిటల్​లోనే చేస్తుండగా, మిగతా రక్త, మూత్ర​శాంపిల్స్​ను నారాయణ గూడలోని (ఐపీఎం)కు  పంపిస్తున్నారు. 

అయితే, ట్రాన్స్​పోర్ట్​ కారణంగా ఒక్కోసారి రక్తం గడ్డ కట్టి పోతోందని, దీనివల్ల బ్లడ్​ శాంపిల్స్​రిపీటెడ్​గా తీసుకోవాల్సి వస్తోందని సూపరింటెండెంట్​చెప్పారు. అన్ని సౌకర్యాలున్నప్పటికీ, అవసరమైన కొన్ని పరికరాలు లేకపోవడంతో నారాయణగూడకు పంపుతున్నామని తెలిపారు.

 100 పడకల విస్తరణకు ప్రతిపాదనలు

వైద్య విధాన పరిషత్​ ఆధీనంలో నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్​ ప్రస్తుతం 50 పడకలతో నడుస్తుంది. దీని ప్రారంభ సమయంలోనే100 బెడ్లకు అప్​గ్రేడ్​ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రతిపాదనలు కూడా కమిషనర్​కు పంపించారు. ప్రస్తుతం ఆ ఫైల్​పెండింగ్ లో ఉంది. 

రోగుల తాకిడి పెరుగుతుండడంతో ఈ హాస్పిటల్​ ను100 బెడ్లకు అప్​గ్రేడ్ చేయాలనే డిమాండ్స్ నుంచి వినిపిస్తోంది. రద్దీకి అనుగుణంగా 100 బెడ్లకు పెంచాలని పలువురు రోగులు డిమాండ్​ చేస్తున్నారు.