గజ ఈతగాడి దురాశ.. నీటిలో కొట్టుకుపోయిన ప్రభుత్వ అధికారి

సమాజంలో సాటి మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువుందని నిరూపించే వాస్తవ ఘటనిది. ఓ గజ ఈతగాడి దురాశ వల్ల ఓ ప్రభుత్వ అధికారి నిండు ప్రాణం నీటిలో కలిసిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వారోగ్య శాఖ విభాగంలో ఆదిత్యవర్ధన్ సింగ్(44) అనే వ్యక్తి డిప్యూటీ డైరెక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన తన స్నేహితులతో కలిసి కాన్పూర్, బిల్‌హౌర్‌ సమీపంలోని నానామౌ గంగాఘాట్‌ వద్దకు విచ్చేశారు. అనంతరం స్నానం ఆచరించేందుకు గంగానదిలోకి దిగారు. అంతే క్షణాల్లోనే నీటి ఉధృతి పెరగడంతో నీటిలో కొట్టుకుపోయారు. 

ఆదిత్య సింగ్ నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్‌ కాశ్యప్‌ ఆయనను కాపాడేందుకు ముందుకొచ్చాడు. అయితే తనకు పది వేలు ఇస్తేనే కాపాడతానని మొండికేశాడు. సమయానికి చేతిలో క్యాష్ లేకపోవడం.. ఆన్‌లైన్‌లో రూ.10వేలు బదిలీ చేసే వరకు గజ ఈతగాడు నీటిలోకి దిగకపోవడంతో ఆయన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. చివరకు మనిషి జాడ కనిపించకపోవడంతో తీసుకున్న పది వేలు డైవర్ తిరిగిచ్చాడు.

Also Read :- మరో మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నయ్

డైవర్‌పై తీవ్ర ఆరోపణలు

నీటమునిగిన తన స్నేహితుడిని కాపాడాల్సిందిగా డైవర్‌ను చేతులెత్తి వేడుకున్నామని ఆయన వెంట ఉన్న యోగేశ్వర్ మిశ్రా, ప్రదీప్ తివారీ మీడియాకు వెల్లడించారు. 10వేలు బదిలీ చేసే వరకూ డైవర్ సమయాన్ని వృధా చేయడం వల్లే తమ స్నేహితుడు కొట్టుకుపోయారని చెప్తూ కంటతడి పెట్టుకున్నారు.

ఆదిత్య వర్ధన్ వారణాసిలోని ఆరోగ్య శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ కాగా, ఆయన భార్య శ్రేయ మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో న్యాయమూర్తి. వారి సమీప బంధువు అనుపమ్ సింగ్ బీహార్‌ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా ఉన్నారు. తప్పిపోయిన ఆదిత్యవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.